Share News

మాటా మంచీ...!

ABN , Publish Date - May 19 , 2026 | 12:21 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన చైనా పర్యటనను అద్భుతం, అమోఘం అంటున్నారు. పర్యటన విజయవంతమైందన్న ఒట్టిమాటలతో సరిపెట్టకుండా దానిని ఆయన ఆకాశానికి ఎత్తేశారు....

మాటా మంచీ...!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన చైనా పర్యటనను అద్భుతం, అమోఘం అంటున్నారు. పర్యటన విజయవంతమైందన్న ఒట్టిమాటలతో సరిపెట్టకుండా దానిని ఆయన ఆకాశానికి ఎత్తేశారు. తన పర్యటన ఇరుదేశాల మధ్యా ఎంతో మంచి సాధించిందనీ, అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని, ఇతరులెవ్వరికీ సాధ్యంకాని అనేకానేక సమస్యలను సైతం తాను పరిష్కరించానని ఆయన చెప్పుకున్నారు. చైనాలో తనకు దక్కిన ఆ గౌరవం, ఆ అట్టహాసాలు, ఆ ఆడంబరాలు ఆయనకు తెగనచ్చేసినట్టు ఉన్నాయి. అంతటి శక్తిమంతమైన దేశానికి అధినేతగా ఉన్న మహాబలవంతుడైన నాయకుడు తనతో సన్నిహితంగా, స్నేహపూర్వకంగా ఉండటం ట్రంప్‌ మనసు దోచినట్టుంది.

ట్రంప్‌ మాదిరిగా ఇంత అతిగా కాకున్నా, చైనా అధ్యక్షుడు కూడా ఈ పర్యటనను చరిత్రాత్మకమైనదిగా, ఉభయదేశాల సంబంధాల్లో మైలురాయిగా అభివర్ణించారు. ట్రంప్‌ తన పర్యటన వల్ల అమెరికా పెట్టుబడిదారులకు ఒనగూరే లబ్ధిగురించి కూడా చెప్పాలి కనుక, 200 బోయింగ్‌ విమానాలను కొనడానికి చైనా హామీ ఇచ్చిందని, ఇది అమెరికాలో వందలాది అధికాదాయ ఉద్యోగాలను సృష్టిస్తుందని, అలాగే, ఇప్పటికే అంగీకరించిన సోయాబీన్స్‌కు తోడుగా, ఏటా పదిహేడు బిలియన్‌ డాలర్లు విలువచేసే పలు వ్యవసాయ ఉత్పత్తులను సైతం చైనా దిగుమతి చేసుకోబోతున్నదని చెప్పుకొచ్చారు. ప్రతీదీ తన విజయంగా చాటుకోగల నైపుణ్యం ట్రంప్‌కు ఉండనే ఉంది. మొత్తంగా ఈ పర్యటనలో ఉభయదేశాధినేతల మధ్య వెల్లివిరిసిన స్నేహం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ట్రంప్‌ ఎక్కడా అసందర్భపు వ్యాఖ్యలు చేయకుండా, దౌత్యపరిధులు అతిక్రమించకుండా నిగ్రహంగా వ్యవహరించడం మరో విశేషం. దీనికి కొనసాగింపుగా, సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ తరువాత ఈ ఏడాది చివర్లోగా మరోసారైనా ఈ దేశాధ్యక్షులు ఇద్దరూ కలుసుకుంటారట.


ఇరుదేశాల మధ్యా వాణిజ్యయుద్ధం పతాకస్థాయిలో ఉన్న తరుణంలో, తొమ్మిదేళ్ళ తరువాత, చైనాలో ట్రంప్‌ కాలూనారు. ఉభయదేశాలు ప్రతీకార చర్యలకు స్వస్తిచెప్పి, పరస్పర విశ్వాసంతో సహకారంతో వాణిజ్యబంధాన్ని బలోపేతం చేయడానికి ఒక బోర్డు ఏర్పాటుచేసుకోవడం, అరుదైన లోహాల అందుబాటు విషయంలో అమెరికా వాదనలను చైనా పరిగణనలోకి తీసుకోవడం వంటి సానుకూల నిర్ణయాలు కొన్ని జరిగాయి. ఇరాన్‌, హోర్ముజ్‌, ఉత్తరకొరియాలకు సంబంధించి ట్రంప్‌కు అవసరపడిన మర్యాదమాటలను చైనా కాదనలేదు. తైవాన్‌ విషయంలో చైనా మనసుకు నచ్చే నాలుగు మాటలు ట్రంప్‌ నోటా విన్నాం. ఇరుదేశాల సంబంధాలు కయ్యానికి కాలుదువ్వే స్థాయికి చేరుకొని ఉన్న నేపథ్యంలో ఈ మాత్రం సహకారమే మిగతా ప్రపంచానికి అద్భుతంగా కనిపిస్తోంది. తమ ప్రయోజనాలను కాదని ఒకరికోసం ఒకరు త్యాగం చేయగల అవకాశాలు ఎంతమాత్రం లేనప్పటికీ, ఉభయదేశాలు సయోధ్య కనబరచడం విశేషం. ముఖ్యంగా, ఇంటా బయటా అనేక సమస్యలు చుట్టుముట్టివున్న ట్రంప్‌కు ఇది పెద్ద ఊరట. ఆయన చేస్తున్న వాణిజ్య యుద్ధానికి అమెరికా న్యాయస్థానాలు మోకాలడ్డుతూంటే, ఇరాన్‌తో యుద్ధం ఆశించినరీతిలో ఫలితం ఇవ్వకపోగా, ప్రతికూలంగా పరిణమించింది. యుద్ధం తరువాత ప్రపంచం దృష్టిలో ఇరాన్‌ అత్యంత శక్తిమంతమైన దేశంగా మిగిలింది. ఏకంగా నాగరికతనే నాశనం చేస్తానని ప్రకటించిన ట్రంప్‌కు ఇరాన్‌ తనకుతానుగా లొంగివస్తే తప్ప, చివరకు జలసంధిని కూడా విముక్తం చేయలేనని అర్థమైపోయింది. చైనా సహకారం లేనిదే ఇరాన్‌ విషయంలో అడుగుముందుకు వేయడం కష్టమని కూడా ఆయనకు అనిపించింది. పన్నెండుశాతం చమురు దిగుమతి చేసుకుంటున్నందున చైనాకు కూడా హోర్ముజ్‌ తెరిచివుండటం అవసరమే కనుక ఇరాన్‌ను కచ్చితంగా ఒప్పించగలదు. ఆర్థికంగా అత్యంత బలమైన చైనాకు ఓ రెండువందల బోయింగ్‌ విమానాలను కొనుగోలు చేయడం కష్టమేమీ కాదు. ఈ ట్రంప్‌కార్డ్‌తో అమెరికా మార్కెట్‌లో తన ఆధిపత్యం దెబ్బతినకుండా చైనా చూసుకుంది. మిగతా ఎవరికీ సాధ్యం కాని సమస్యలు సైతం పరిష్కరించానని ట్రంప్‌ అంటున్నవి ఆయన సృష్టించినవే. ఈ పర్యటనతో ఆ ఊబినుంచి కాస్తంతైనా బయటపడుతున్నందుకు ట్రంప్‌ సంతోషిస్తున్నారు. ఆర్థికంగా, సైనికపరంగా, సాంకేతికంగా శక్తిమంతమైన చైనాతో కయ్యం కంటే వియ్యం ఉత్తమమని ట్రంప్‌ గుర్తించడం ఈ పర్యటన సారాంశం. అనేకానేక సరికొత్త అవగాహనలకు ట్రంప్‌ పర్యటన ఉపకరించిందని చైనా కూడా అందుకే అంటోంది.

ఇవి కూడా చదవండి..

మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా

Updated Date - May 19 , 2026 | 12:21 AM