నరకం.. అమెరికా!
ABN , Publish Date - Apr 29 , 2026 | 04:52 AM
భారతదేశాన్ని డోనాల్డ్ ట్రంప్ నరకంతో పోల్చిన కొద్దిరోజుల్లోనే అమెరికా పెద్దలందరికీ ఆ సాయుధుడు ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో చూపించాడు. వైట్‌హౌస్ కరస్పాండెంట్ల విందు ఘటనలో అధ్యక్ష ఉపాధ్యక్షులు...
భారతదేశాన్ని డోనాల్డ్ ట్రంప్ నరకంతో పోల్చిన కొద్దిరోజుల్లోనే అమెరికా పెద్దలందరికీ ఆ సాయుధుడు ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో చూపించాడు. వైట్‌హౌస్ కరస్పాండెంట్ల విందు ఘటనలో అధ్యక్ష ఉపాధ్యక్షులు, మంత్రులు, అధికారులు క్షేమంగా బయటపడటం సంతోషం కలిగిస్తోంది. యావత్ ప్రపంచాన్ని నిర్ఘాంత పరిచిన ఈ పరిణామానికి కారకుడు ట్రంప్ పరిభాషలో చెప్పుకోవాలంటే స్వర్గంలాంటి తమ దేశాన్ని నరకప్రాయం చేయడానికి అక్రమంగా సరిహద్దులు దాటివచ్చిన చొరబాటుదారుడేమీ కాడు. చక్కగా చదువుకొని, ఇంజనీరింగ్ పూర్తిచేసి, పలు పరిశోధనలు ప్రయోగాలు నిర్వహించి, ప్రస్తుతం ఉపాధ్యాయవృత్తిలో ఉన్న ముప్పైయేళ్ళ ఈ అమెరికన్‌ని, కమలా హారిస్ ఎన్నికల ప్రచారానికి ఓ పాతిక డాలర్లు విరాళంగా ఇచ్చినందువల్ల డెమోక్రాటిక్ పార్టీ సానుభూతిపరుడని అంటున్నారు.
రెండేళ్ళలో ట్రంప్ మీద జరిగిన మూడవ హత్యాయత్నం ఇది. ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు పాల్గొంటున్న కార్యక్రమంలోకి ఒక సాయుధ దుండగుడు వసతి సైతం సంపాదించి లోపలకు రాగలగడం భద్రతావ్యవస్థ వైఫల్యం. కాల్పులు జరిగిన వెంటనే ట్రంప్, వాన్స్‌లను భద్రతా సిబ్బంది ఈడ్చుకెళ్ళినంత పనిచేశారు. తాను హీరోలాగా ప్రవర్తించానని, ఎవరికీ భయపడనని, ఈ పదవిలో ఉన్న ముప్పుగురించి తనకు తెలుసునని, ఘటన అనంతరం కూడా హోటల్‌లోనే భోజనం చేసి వెళతానని తాను భీకరంగా పోరాడానని ట్రంప్ తన రాజకీయ అవసరాల రీత్యా చాలా చెప్పుకున్నారు. అయినా, చివరకు సీక్రెట్ సర్వీసెస్ చెప్పినట్లుగానే చేశానన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. రేటింగులు తీవ్రంగా పడిపోయిన తరుణంలో ఈ దాడి జరగడం ఆయనకు రాజకీయంగా మేలు చేస్తుంది. అరవైరోజుల ఇరాన్ యుద్ధంలో అరవైసార్లు మాటమార్చి, అర్థంలేని నిర్ణయాలతో ప్రపంచాన్నంతా ముంచిన ట్రంప్‌కు నవంబరు మధ్యంతర ఎన్నికల్లో ఈ దాడి ఉపకరించవచ్చు. కాలువెనక్కుతీసుకోలేక మిత్రదేశాలను ఆడిపోసుకుంటూ కాలంనెట్టుకొస్తున్న ట్రంప్‌ను అమెరికన్ కాంగ్రెస్‌లో బలాబలాలు తారుమారయ్యే పరిస్థితినుంచి బయటపడవేయవచ్చును. బుల్లెట్ దెబ్బకు రక్తమోడిన చెవి అధికారాన్ని చేరువచేసినట్టే ఈ ఘటన సైతం ఉపకరించవచ్చు.
రిపబ్లికన్ అబ్రహాం లింకన్ నుంచి డెమోక్రాట్ జాన్ ఎఫ్ కెన్నడీ వరకూ నలుగురు అమెరికా అధ్యక్షులు అధికారంలో ఉండగా ప్రాణాలు కోల్పోయారు. ఇదే హోటల్‌లో నలభైఐదేళ్ళక్రితం రోనాల్డ్ రీగన్‌పై హత్యాయత్నం జరిగింది. అయితే, ఇటీవలికాలంలో అమెరికా సమాజంలో విద్వేషం, హింసాప్రవృత్తి మరింత హెచ్చి వరుస హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ప్రతీ వందమందికీ 120 తుపాకులున్న దేశంలో, ఆటోమేటిక్ రైఫిళ్ళతో సామూహిక హత్యాకాండలకు దిగడం ఎలాగూ ఉండగా, నాయకులను, రాజకీయ, సైద్ధాంతిక ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకోవడం, ఆయా దేశాలు, జాతుల పట్ల తీవ్ర వివక్ష, వ్యతిరేకతలతో దాడులకు పాల్పడటం, చంపివేయడం బాగా పెరిగింది. దేశంలోకి వచ్చినవారంతా దొంగలు, దురాక్రమణదారులు అన్నతరహాలో ఇమ్మిగ్రేషన్ అధికారులే వ్యవహరిస్తున్నారు. ట్రంప్ విధానాలు, అమానవీయ వైఖరులు ఉమ్మడి భావనను పాతరేశాయి. తనకు రాజకీయంగా అనుకూలంగా లేని ప్రతీ సంస్థనూ, వ్యవస్థనూ ట్రంప్ అవమానించి, ప్రజల్లో వాటిపట్ల నమ్మకాన్ని తుంచేశారు. అమెరికాను ఉన్నతంగా నిలబెట్టే పేరిట సమాజాన్ని చీల్చేశారు. ఐదేళ్ళక్రితం ట్రంప్ ప్రోత్సాహం మేరకు ఆయన మనుషులే క్యాపిటల్ హిల్‌మీద అత్యంత హేయమైన దాడి జరిపి, అమెరికా పరువుతీశారు. ట్రంప్ రాకకు ముందు పాత్రికేయులనుంచి కమేడియన్ల వరకూ అన్ని రంగాలవారూ స్వేచ్ఛగా, నిర్భీతితో అమెరికా అధ్యక్షులపై, పాలనపై వెటకారాలూ విమర్శలూ చేసేవారు. కానీ, ట్రంప్ రాకతో పరిస్థితి మారిపోయింది. ఒక నియంత మాదిరిగా వ్యవహరిస్తూ రాజకీయాల్లోనూ సమాజంలోనూ చర్చకు, భిన్నాభిప్రాయానికి చోటులేని వాతావరణాన్ని సృష్టించారు. ఎదుటివారు చెప్పింది వినకపోగా, దుర్మార్గపు భాషలో అవమానించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. కాలిఫోర్నియా వాసి కోలో టామోస్ అలెన్ జరిపిన ఈ దాడి అమెరికా సమాజం ఎటువంటి వాతావరణాన్ని అనుభవిస్తున్నదో తెలియచెబుతోంది. అతడి ఉద్దేశాలు, లక్ష్యాలు ఏవైనప్పటికీ, విభజనవాదం, విషపూరిత ప్రసంగాలు, తుపాకీ సంస్కృతి ఒక ప్రమాదకరమైన కలయిక.
ఈ వార్తలు కూడా చదవండి
పెళ్లి పేరుతో రూ.కోట్ల వసూలు.. అషురెడ్డిపై ధర్మేంద్ర తీవ్ర ఆరోపణలు
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్