బారామతిలో విషాదం
ABN , Publish Date - Jan 29 , 2026 | 02:51 AM
మహారాష్ట్ర రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలపాటు కీలకభూమిక నిర్వహించిన ప్రస్తుత ఆ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత...
మహారాష్ట్ర రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలపాటు కీలకభూమిక నిర్వహించిన ప్రస్తుత ఆ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. తనకు రాజకీయ జన్మనిచ్చి, దశాబ్దాలుగా వెన్నంటివున్న బారామతిలోనే ఆయన ఆఖరుశ్వాస విడిచారు. రెండుసార్లు ఎమర్జెన్సీ లాండింగ్ కోసం ప్రయత్నించి, చివరకు కుప్పకూలిన లియర్‌జెట్ ౪5 మోడల్ చార్టర్డ్ విమానంలో ఎలాంటి సాంకేతిక, నిర్వహణ లోపాలూ లేవని సదరు కంపెనీ యజమాని చెబుతూంటే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీని వీడాలని అజిత్‌పవార్ ఆలోచిస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగిందని వ్యాఖ్యానించడం ద్వారా ఈ ఘటనలో కుట్రకోణం ఉందని ఆమె అనదల్చుకున్నారు. దట్టమైన పొగమంచు కమ్మేసి, ఏమీ కానరాని వాతావరణమే ఈ ప్రమాదానికి కారణమని పౌరవిమానయాన శాఖ అంటోంది.
పినతండ్రి శరద్‌పవార్ రాజకీయనీడలో ఎదిగి, రెండున్నరేళ్ళక్రితమే ఆ నీడనుంచి బయటపడిన అజిత్‌పవార్ ఇంకా ఎత్తుకు ఎదిగే శక్తిసామర్థ్యాలు ఉండికూడా విధివక్రీకరించింది. పదిహేనేళ్ళలో ఆరుసార్లు ఉపముఖ్యమంత్రి అయిన ఆయన నిక్కచ్చితనం, దూకుడు, క్షణాల్లో నిర్ణయాలు చేయగల సమర్థతల గురించి సన్నిహితులు గర్వంగా చెబుతూంటారు. పార్టీమీద ఆయనకున్న పట్టు, కార్యకర్తలతో సాన్నిహిత్యం, భారీ సభలూ సమావేశాల నిర్వహణాశక్తి ఇత్యాది సమర్థతల కారణంగా శరద్‌పవార్ ఈయనమీదే ఎక్కువగా ఆధారపడేవారు. బాబాయ్‌మీద తిరుగుబాటుచేసి, పార్టీని నిలువునా చీల్చి శత్రువులతో చేయికలపడానికి ఉపకరించినవి కూడా ఈ లక్షణాలే. ఇతడిని నమ్ముకొని అంతమంది ఎమ్మెల్యేలు రాజకీయదురంధరుడైన శరద్‌పవార్ మీద తిరుగుబాటు చేయడం అబ్బాయ్ వ్యూహరచనకు, సమర్థతకు నిదర్శనం. ముప్పయ్‌ఐదేళ్ళక్రితం బాబాయ్ కోసం బారామతి లోక్‌సభ స్థానాన్ని త్యాగం చేసిన అజిత్‌పవార్, అదేచోట బాబాయ్‌ని ఓడించేంత శక్తిమంతుడుగా ఎదిగిపోయాడు.
పెద్దాయనకు విధేయత ప్రకటించడంలోనూ, ధిక్కరిస్తున్నట్టుగా కనిపించడంలోనూ, నేతకు నచ్చిన చొరవను చూపడంలోనూ అజిత్ అందెవేసిన చెయ్యి. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత చిన్నాన్నతో విభేదించి, దేవేంద్రఫడ్నవీస్‌తో చేయికలపడం, కేవలం ఎనభైగంటలు ఉపముఖ్యమంత్రిగా ఉండి, ఆ ప్రభుత్వం మెజారిటీ లేక కుప్పకూలగానే తిరిగి సొంతగూటికి చేరుకోవడం అజిత్‌కు మాత్రమే సాధ్యం. అన్నకొడుకు కనుక అంత అవమానించినా, పెద్దాయన వెనక్కురానిచ్చారన్నది ఎంత నిజమో, అజిత్ శక్తిసామర్థ్యాలు ఆయనకూ అవసరమన్నదీ అంతే నిజం. అంతేనా, ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలో ఏర్పడిన మహావికాస్ అగాఢీ ప్రభుత్వంలో ఎన్సీపీ భాగస్వామిగా అజిత్ మళ్ళీ అదే పదవి పొందగలిగారు. రెండున్నరేళ్ళలోనే ఉద్ధవ్ ప్రభుత్వం కూలినా, బాబాయ్‌తో విభేదించి, ఈమారు మహాయుతిలో చేరి అజిత్ మళ్ళీ అదే పదవిని అలంకరించారు. శిందే ఏలుబడిలోనూ, ఫడ్నవీస్ పాలనలోనూ నెంబర్ టూ గానే ఉండిపోయిన అజిత్‌పవార్, సీఎం కావాలన్న దశాబ్దాల కల ఆరునూరైనా నెరవేర్చుకోగల సమర్థుడని ఎన్సీపీలో ప్రతీకార్యకర్తకూ తెలుసు. పవార్‌ల మధ్య విభేదాలు శుద్ధ అబద్ధాలనీ, బాబాయ్–అబ్బాయ్ కలిసి రాజకీయం చేస్తారని కొందరివాదన. తనకుమార్తెను రాజకీయాల్లోకి తెచ్చి అజిత్‌ను నిలువరించడానికి శరద్‌పవార్ ఒకదశలో ప్రయత్నించినమాట నిజమేనని మరికొందరంటారు.
అజిత్‌పవార్ నేతృత్వంలోని చీలికవర్గాన్నే అసలు ఎన్సీపీగా ఎన్నికలసంఘం గుర్తిస్తే, 2024నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ పవార్ కంటే ఈ జూనియర్ పవార్‌కే మహారాష్ట్ర ప్రజలు నాలుగురెట్లు అధికస్థానాలు ఇచ్చి ఆదరించారు. ఇకపై అజిత్‌లేని ఆయన చీలికవర్గం అలాగే నిలుస్తుందా లేక పెద్దాయన పంచనచేరిపోతుందా, ఫడ్నవీస్ ప్రభుత్వానికి కష్టకాలం వచ్చినట్టేనా, అజిత్‌స్థానాన్ని ఆయన వారసులకు ఇచ్చి జాగ్రత్తపడుతుందా, ఏక్‌నాథ్ ఏకుమేకుకాకుండా అజిత్‌ను చేర్చుకున్న బీజేపీ ఇకపై శిందే తలెగరేయకుండా నిలువరించగలదా? అనేకానేక విశ్లేషణలతో మీడియా మారుమోగిపోతోంది. పలు నాటకీయ పరిణామాలు, రాజకీయ తిరుగుబాట్లు, కుట్రలూ కుంభకోణాలతో సాగిన అజిత్‌పవార్ నాలుగుదశాబ్దాల రాజకీయ జీవితం, మరింత భవిష్యత్తు మిగిలివుండగా హఠాత్తుగా ముగిసిపోవడం అత్యంత విషాదం.
ఇవి కూడా చదవండి
ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’
రాజ్యాంగ నిష్ఠను త్యజిస్తున్న గవర్నర్లు!