ఐదేళ్ల ఏలుబడి..
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:33 AM
ఇరవై సంవత్సరాలు–నలుగురు అధ్యక్షులు–రెండు ట్రిలియన్ డాలర్లు. అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితిని మళ్ళీ మొదటికి తేవడానికి అమెరికా పెట్టిన ఖర్చు, పడిన శ్రమ ఇది. తాలిబాన్ పాలనకు ఐదేళ్ళు నిండిన సందర్భంలో...
ఇరవై సంవత్సరాలు–నలుగురు అధ్యక్షులు–రెండు ట్రిలియన్ డాలర్లు. అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితిని మళ్ళీ మొదటికి తేవడానికి అమెరికా పెట్టిన ఖర్చు, పడిన శ్రమ ఇది. తాలిబాన్ పాలనకు ఐదేళ్ళు నిండిన సందర్భంలో మాధ్యమాలు గతాన్ని స్మరించుకున్నాయి. అఫ్ఘాన్‌లో మిగిలిన కొద్దిమంది అమెరికా సైనికులూ పెట్టాబేడా సర్దుకొని పోతూంటే, కాబూల్ వైపు దూసుకొస్తున్న తాలిబాన్ చేతిలో చావు ఖాయమని భయపడ్డవారంతా ప్రాణాలకు తెగించి విమానాల వెంట పరుగులు తీసిన ఆ దృశ్యాలు ఇప్పుడు మళ్ళీ తెరమీద కనిపించాయి. ఈ ఐదేళ్ళ తాలిబాన్ ఏలుబడిలో అఫ్ఘానిస్థాన్‌కు ఒరిగిందేమిటి, పోయిందేమిటన్న ప్రశ్నలను అటుంచితే, అప్పట్లో ఊహకు కూడా అందనిది– తాలిబాన్‌తో భారత్ స్నేహం, పాకిస్థాన్‌తో దాని వైరం–ఇప్పుడు నిజమైంది. శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడు.
తాలిబాన్ తిరిగి కాబూల్‌ను వశం చేసుకున్న ఐదేళ్ళనాటి సందర్భాన్ని పురస్కరించుకొని, న్యూఢిల్లీలోని అఫ్ఘాన్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన ‘విజయదినోత్సవం’లో భారత్ పాల్గొంది. విదేశాంగశాఖలో పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, ఇరాన్ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘానిస్థాన్ జెండా పక్కన నిలబడి, చార్జ్ డి ఎఫైర్స్‌గా వ్యవహరిస్తున్న నూర్ అహ్మద్ నూర్ ఈ సందర్భంగా ఉభయ దేశాల మధ్యా పెరిగిన సాన్నిహిత్యాన్ని ప్రశంసించారు, విభిన్నరంగాల్లో సహకారాన్ని ప్రస్తావించారు. అఫ్ఘానిస్థాన్ పక్షాన నిలిచినందుకు భారత్‌కు ధన్యవాదాలు చెబుతూ, అంతర్జాతీయ వేదికలపై మరింత మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్ పాలుపంచుకోకపోవడం సహజం. తాలిబాన్ పాలనను అధికారికంగా గుర్తించకుండానే భారతదేశం దానితో నెయ్యం నెరపుతోంది. రాయబార కార్యాలయం వెలుపలి జెండాకొయ్యమీద గత కాలపు ఇస్లామిక్ ‘రిపబ్లిక్’ ఆఫ్ అఫ్ఘానిస్థాన్ జెండా ఎగురుతూంటే, లోపల మాత్రం తాలిబాన్ తమ జెండాతో కార్యక్రమాలు నిర్వహించుకుంటోంది. గత ఏడాది అక్టోబర్‌లో అఫ్ఘాన్ విదేశాంగమంత్రి అమీర్‌ఖాన్ ముత్తాఖీ తన విలేకరుల సమావేశాన్ని నిర్వహించినప్పుడు కూడా ఈ రెండు జెండాలూ కనిపించాయి. ఆ సమావేశంలో ముత్తాఖీ భారత్‌ను పొగుడుతూ, పాకిస్థాన్‌ను చీల్చిచెండాడారు. తమ గడ్డమీద భారత వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించబోమని హామీ ఇచ్చారు. భారత విదేశాంగమంత్రి జైశంకర్‌తో ముత్తాఖీ భేటీ, ఇరువురి కరచాలనంతో అప్పటివరకూ ఉన్న సందేహాలన్నీ చెదిరిపోయాయి. తాలిబాన్ పునరాగమనం తరువాత భారత్–అఫ్ఘాన్ మధ్య జరిగిన అత్యున్నతస్థాయి సమావేశం అది. ఆ తరువాత, కాబూల్‌లో నామమాత్రంగా ఉన్న ఒక కార్యాలయం పూర్తిస్థాయి దౌత్యకార్యాలయంగా మారింది, అఫ్ఘాన్‌లో పలురంగాల్లో పెట్టుబడులకు భారత్ సిద్ధపడింది.
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్‌పై అక్కడక్కడ వివిధ గ్రూపులు అడపాదడపా దాడులు జరుపుతున్నప్పటికీ, గతంతో పోల్చితే, ఇప్పుడు ఆ దేశం పూర్తిగా తాలిబాన్ చేతుల్లోనే ఉంది. మహిళలు, విద్య, హక్కులు ఇత్యాది విషయాల్లో శాసనాల మాట ఎలా ఉన్నా, గతంతో పోల్చితే కాఠిన్యం తగ్గిందని అంటారు. తాలిబాన్ ప్రవేశానికి ముందువరకూ అఫ్ఘానిస్థాన్‌లోకి ప్రవహించిన విదేశీసాయం నిలిచిపోవడంతో దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. తాలిబాన్ గతపాలనలో పాకిస్థాన్‌కు కుడిభుజంగా ఉంటూ దాని నుంచి ఆర్థిక, ఆయుధ సాయం విస్తృతంగా పొందింది. పాక్ సైనిక, గూఢచర్య విభాగాల ఆదేశాలకు అనుగుణంగా భారత్ సహా చాలా దేశాలకు చేటు చేసింది. అమెరికా, దాని మిత్రదేశాల ప్రయోజనాలకు భంగం కలిగించనన్న హామీతో, పాకిస్థాన్ సాయంతో అది మళ్ళీ అఫ్ఘానిస్థాన్‌లో కాలూనింది. తన పొరుగు దేశం తాలిబాన్ వశం కాగానే ఇమ్రాన్‌ఖాన్ ఆనందంగా అల్లాకు కృతజ్ఞతలు తెలియచేశారు. కానీ, ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. పాకిస్థాన్‌కు తాలిబాన్ బద్ధశత్రువై, ఉభయ దేశాల మధ్యా ప్రస్తుతం ప్రకటిత యుద్ధమే సాగుతోంది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని భారతదేశం తాలిబాన్‌కు దగ్గరైంది. ప్రస్తుతానికి పరిస్థితి అనుకూలంగా ఉన్నా, అమెరికా, పాకిస్థాన్ అనుభవాల దృష్ట్యా తాలిబాన్‌తో కాస్తంత ఎడం పాటిస్తూనే భారత్ తన ప్రయోజనాలను చక్కబెట్టుకోవాలి. మహిళలు, జాతి, మత మైనారిటీలపై అణచివేతకు స్వస్తిచెప్పి, ప్రజావ్యతిరేకత లేకుండా జాగ్రత్తపడితేనే అన్నిదేశాల సాయంతో, ఆమోదంతో తన ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దుకోవడం తాలిబాన్‌కు సాధ్యపడుతుంది.
ఈ వార్తలను కూడా చదవండి:
పార్క్‌లో భారీ కొండచిలువ హల్‌చల్.. వీడియో వైరల్
ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా.. గంటకు 45.6 కిలోమీటర్ల వేగంతో చైనా 'సూపర్‌మ్యాన్' రోబో..