స్విస్ వివేకం
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:15 AM
దేశ జనాభాను నియంత్రించడానికి ఉద్దేశించిన ఒక ప్రతిపాదనను స్విట్జర్లాండ్ పౌరులు ఆదివారం నాటి ఓటింగ్‌లో తిరస్కరించారు. 2050 నాటికి స్విస్ జనాభా పదిమిలియన్లు దాటకుండా నిలువరించడంపై...
దేశ జనాభాను నియంత్రించడానికి ఉద్దేశించిన ఒక ప్రతిపాదనను స్విట్జర్లాండ్ పౌరులు ఆదివారం నాటి ఓటింగ్‌లో తిరస్కరించారు. 2050 నాటికి స్విస్ జనాభా పదిమిలియన్లు దాటకుండా నిలువరించడంపై స్విస్ పీపుల్స్ పార్టీ ప్రోద్బలం మేరకు జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పౌరులు అధికసంఖ్యలో పాల్గొని ఆ ఆలోచనకు అడ్డం కొట్టారు. ప్రధానంగా వలసలను అడ్డుకొనేందుకు ఈ అతిపెద్ద మితవాద పార్టీ రెఫరెండమ్ కుట్రకు తెరలేపిందని అంటారు. ఓటింగ్ ఆరంభంలో అధికఓట్లు జనాభా నియంత్రణవైపు మొగ్గుచూపినప్పటికీ, పోలింగ్ ముగిసే సరికి యాభైఐదుశాతం మంది ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సంపద్వంతమైన స్విట్జర్లాండ్ ఆరోగ్యానందాల్లోనూ తొలి స్థానాల్లోనే ఉంది. అయినా, అక్కడ పెరుగుతున్న జనాభాగురించీ, మరీ ముఖ్యంగా వలసల నియంత్రణ ఆవశ్యకత గురించీ మితవాదులు నిత్యం వాదిస్తూంటారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో స్విస్‌పౌరులు సదరు ప్రతిపాదనకు సరే అనివుంటే, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో జనసంఖ్యమీద హద్దు విధించిన తొలిదేశం స్విట్జర్లాండ్ అయివుండేది. ఇప్పుడు సదరు ప్రతిపాదన వీగిపోయినప్పటికీ, ఓటింగుకు ముందూ, అది దగ్గరపడుతున్నరోజుల్లోనూ దేశాన్ని ఆ ఆలోచన తీవ్రంగా కుదిపేసింది. ఆర్థిక ప్రగతి, వలసల నియంత్రణ, ఈయూతో భవిష్యత్ సంబంధాలు తదితర అంశాలపై మీడియా చర్చోపచర్చలు చేసింది. ఆవాసం, ఆరోగ్యం, రవాణా సహా ప్రతీరంగమూ, చివరకు పర్యావరణం సైతం జనాభా పెరుగుదల ప్రభావాన్ని చవిచూస్తున్నదనీ, స్విస్‌పౌరుల జీవనశైలినీ, నాణ్యతనూ పరిరక్షించుకోవాలంటే జనాభామీద హద్దులు ఉండాలని సదరు పార్టీ వాదన. ఆ రకమైన ఆలోచనకు అవకాశం ఇచ్చి, ఈ ప్రతిపాదనకు అంగీకరించిన పక్షంలో దేశం ఎదుగుదల నిలిచిపోయి, ఆర్థికంగా దెబ్బతింటుందనీ, సర్వరంగాల్లోనూ కార్మికుల కొరతతో సరికొత్త సమస్యలు తలెత్తుతాయని రెఫరెండమ్ వ్యతిరేకుల వాదన. ప్రధానంగా మిగతా యూరప్‌తో వేరుపడినట్టు అవుతుంది కనుక దీనిని వారు మరో బ్రెగ్జిట్‌గా అభివర్ణిస్తూ, ఈయూతో తెగదెంపులు చేసుకున్న బ్రిటన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు ప్రభావవంతంగా గుర్తుచేశారు.
గత రెండు దశాబ్దాల్లో స్విస్ జనాభా వేగంగా పెరిగింది. పాతికేళ్ళక్రితం ఈయూతో ఒప్పందం కారణంగా సరిహద్దులు చెరిగిపోయి, ప్రస్తుతం 91లక్షల జనాభాలో నాలుగోవంతు విదేశీయులే ఉన్నారు. యూరప్‌లో మిగతాదేశాలతో పోల్చితే ఇది చెప్పుకోదగ్గ సంఖ్య. నియంత్రణలు లేని ఈ వలసలవల్ల దేశం కిటకిటలాడిపోతోందని, ప్రజారవాణామీదా, సేవలమీద ఒత్తిడి హెచ్చిందనీ, దేశం తన అవసరాలు, సమర్థతలను మించి సాగవలసివస్తున్నదన్న మితవాదుల ఈ వాదనకు ఊహించినదానికంటే ఎక్కువ బలమే చేకూరింది. ఈ ప్రతిపాదన ప్రకారం, రాబోయే పాతికేళ్ళలో జనాభా కోటికి చేరకుండా నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 95లక్షలకు చేరగానే విదేశీయుల కుటుంబీకుల మీద నియంత్రణలు విధించడం, వలసనివారణ చర్యలను ఆరంభించడం చేపట్టాలి. కోటి తాకగానే, ఏకంగా ఈయూతో గతకాలపు ఒప్పందాన్నే తెంచుకోవాల్సి వస్తుంది. స్విట్జర్లాండ్–ఈయూలను అనుసంధానించి, అన్నిరంగాల్లోనూ ఈ దేశం ఎదుగుదలకు వీలుకల్పించిన అనాటి ఒప్పందాన్ని కాదనుకోవడమే కాక, భవిష్యత్ సంబంధాలను కూడా ఇది దెబ్బతీస్తుంది. వలసశ్రామిక శక్తే అన్ని కీలకరంగాలకు పునాదిగా ఉన్నందున దానిని కాలదన్నడం అత్యంత ప్రమాదకరమని ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, ట్రేడ్‌యూనియన్లు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. బయటినుంచి వచ్చినవారు మనదేశానికి భారం అన్న వాదనకు మీరు కనుక సరేనంటే, ఆరోగ్యం, ఆతిథ్యం సహా అన్ని కీలకరంగాలూ కుప్పకూలుతాయి, స్విట్జర్లాండ్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులు చెరిగిపోతాయి అంటూ ఆర్థికవేత్తలు సైతం ప్రజలను హెచ్చరించారు. సరిహద్దుల ఆవలినుంచి బతుకుతెరువుకోసం వచ్చినవారిని శత్రువులుగా, వనరుల దోపిడిదారులుగా, ఉద్యోగ ఉపాధులను కొల్లగొట్టేవారిగా చిత్రీకరిస్తూ, వారిని అడ్డుకోవడమే దేశాభిమానంగా ప్రచారం చేసుకుంటున్న పాలకులు అన్ని చోట్లా వీరంగాలు వేస్తున్న కాలం ఇది. స్విస్ పౌరులు అటువంటి మాయమాటలకు లొంగకుండా, తమ శ్రేయస్సు, దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం మెచ్చుకోదగినది.
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..