Share News

‘సుప్రీం’ హెచ్చరిక..!

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:30 AM

ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన న్యాయపోరాటం, అనంతరం కోర్టు వ్యాఖ్యలు, ఇచ్చిన...

‘సుప్రీం’ హెచ్చరిక..!

ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన న్యాయపోరాటం, అనంతరం కోర్టు వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు గమనించినవారికి, ఇకమీదట ఆ అంశంపై ఎవరెంత పోరాడినా పెద్దగా ఫలితం ఉండదని అర్థమైపోయివుంటుంది. మొత్తం సర్‌నే ఆపగలనన్నంత ధీమాతో నల్లకోటు వేసుకున్న మమతాబెనర్జీ స్వయంగా చక్కని వాదనలు చేశారు. తడబడకుండా చెప్పదల్చుకున్నదంతా చెప్పేశారు. న్యాయమూర్తులు పెద్దగా అడ్డుతగలకుండా, అడిగిన కంటే అధిక సమయమే ఇచ్చి, ఆమె వాదన విన్నారు. తన రాష్ట్రంలో సర్‌ పేరిట సాగుతున్న దుర్మార్గాలు అక్రమాలు ఎన్నెన్ని విధాలో మమత చెప్పినదంతా విన్న న్యాయమూర్తులు ఆమెను ఆవేశపడవద్దని హితవు చెబుతూ, ప్రక్రియ కొనసాగనివ్వాలని, ఎన్నికలసంఘానికి సంపూర్ణ సహాయసహకారాలు అందించాలని ఆదేశించారు. ప్రశాంతంగా ఉండమని అంటూనే కోర్టు ఆమెకు ప్రశాంతత చేకూర్చలేదని విశ్లేషకుల అభిప్రాయం.

ఏవైనా ఆదేశాలు అవసరమైతే మేమున్నాం, కానీ, ప్రక్రియకు ఎటువంటి అడ్డంకినీ అనుమతించేది లేదని కోర్టు తేల్చేసింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలూ అర్థం చేసుకోవాలనీ, అవి సర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని కోర్టు అన్నది. ఎన్నికలముందు ఎందుకీ హడావుడి అని అడగాల్సిన కోర్టు, ఓటర్ల రివిజన్‌ చేపట్టకపోతే నకిలీ ఓట్లను ఎలా తొలగించగలుగుతాం? అని ఆశ్చర్యపోతోంది. ఇక, ఎన్నికల సంఘం అధికారులు పేర్లూ, ఇంటిపేర్లలో అక్షరదోషాలు, వివాహం అనంతరం మహిళల చిరునామాల్లో మార్పులు వంటి చిన్నచిన్న కారణాలతో పెద్దసంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నారని, స్థానికత రుజువుచేసుకొనేందుకు సమయం ఇవ్వడం లేదని, దీనివల్ల కోటీ ముప్పైలక్షలమంది ఓటర్లు ప్రభావితం అవుతున్నారని బెంగాల్‌ ప్రభుత్వం వాదిస్తే, దీనికి పరిష్కారంగా కోర్టు మరోవారం గడువు పొడిగించింది. నిజానికి, ఫిబ్రవరి 14నే తుదిజాబితాను ప్రకటించవలసి ఉండగా, దానికి మరోవారం వరకూ పరిశీలనలు, అభ్యంతరాలకు న్యాయస్థానం అవకాశం ఇవ్వడం మమతకు కాస్తంత ఊరట. మూడువందల మంది అధికారులను కేటాయించమని అడిగితే, బెంగాల్‌ ప్రభుత్వం 80మందినే ఇచ్చిందని ఎన్నికల సంఘం న్యాయవాది చెప్పుకున్నారు.


అవసరమైనంత సిబ్బందిని ఇవ్వాల్సిందిగా ఆదేశించి, మైక్రో అబ్జర్వర్లకు అంతిమ నిర్ణయం చేసే అధికారం లేదని, వారు కేవలం సహాయకులు మాత్రమేనని కోర్టు ప్రకటించడం కూడా మమతకు ఉపశమనమే. అయితే, ఇప్పుడు కొత్తగా రంగంలోకి దిగుతున్న ఎనిమిదిన్నరవేల మందీ అతివేగంగా పరిజ్ఞానాన్ని పెంచుకొని కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఓటర్లకు న్యాయం చేయగలరా అన్న ప్రశ్న ఉండనే ఉంది. రాష్ట్రప్రభుత్వం అధికారులను సమకూర్చనందుకు సర్వోన్నత న్యాయస్థానంలో అదేపనిగా పోరాడి మమత ప్రభుత్వం మెడలు వంచాల్సిన ఎన్నికల సంఘం, ఎవరో ఒకరితో, ఏదో ఒకరీతిలో, ఎలాగోలా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తిచేయదల్చుకున్నదా? అని కొందరి ప్రశ్న. సర్‌ ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులపై దాడులు జరుగుతున్నాయనీ, వారిని భయపెడుతున్నారని అంటున్న ఎన్నికల సంఘాన్ని ఊరడించడం కోసం డీజీపీనుంచి కోర్టు అఫిడవిట్‌ కోరింది.

సర్వోన్నత న్యాయస్థానం అదనంగా ఓ వారం గడువు పొడిగించినా కూడా ఎన్నికల సంఘం సిబ్బంది తమ లక్ష్యాన్ని గడువులోగా పూర్తిచేయడం కోసం భోజన విరామం కూడా తగ్గించుకొని, కొన్ని గంటలు అధికంగా పనిచేయవలసి వస్తున్నదట. ఆ కాస్త గడువూ పెంచకపోతే ఇంకెంత హడావుడిగా పని జరిగేదో, ఇంకెన్ని లక్షలమందికి అన్యాయం జరిగేదో దేశం గమనించాలని బెంగాల్‌ మంత్రులు కోరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సిన సమయం సమీపిస్తున్నందున ఎన్నికల సంఘం ఉన్నతాధికారులనుంచి, స్థానిక సిబ్బంది వరకూ ఒత్తిడికి గురవకతప్పదు. సుప్రీంకోర్టులో తనకే విజయం దక్కిందని తృణమూల్‌ నాయకులు చెప్పుకుంటున్నారు. ఏవో అల్ప, స్వల్ప సవరణలు మాత్రమే చేసి, మొత్తం సర్‌ ప్రక్రియను గట్టిగా వెనకేసుకొచ్చి, బలంగా ఎత్తిపట్టినందుకు ఎన్నికల సంఘం తెగ సంతోషిస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అమలుకాబోతున్న రాష్ట్రాలకు ఈ తీర్పు ఒక హెచ్చరిక. అసలుసిసలు ఓటర్లను రక్షించుకొని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఇక వాటిమీదే ఉంది.

ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 04:30 AM