Share News

‘సుప్రీం’ విచిత్ర ఆదేశం

ABN , Publish Date - Jul 17 , 2026 | 02:58 AM

మధ్యప్రదేశ్‌లోని ధార్‌జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల–కమల్‌ మౌలా మసీదు సముదాయం వివాదాన్ని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని సుప్రీంకోర్టు...

‘సుప్రీం’ విచిత్ర ఆదేశం

మధ్యప్రదేశ్‌లోని ధార్‌జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల–కమల్‌ మౌలా మసీదు సముదాయం వివాదాన్ని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని సుప్రీంకోర్టు ప్రకటించింది. భోజ్‌శాల సముదాయాన్ని సరస్వతీ ఆలయంగా నిర్థారిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మేనెలలో ఇచ్చిన తీర్పుపై ముస్లిం పక్షం దాఖలు చేసిన అప్పీళ్ళను స్వీకరిస్తూ, నోటీసులు కూడా జారీ చేస్తూ, పదిపదిహేను రోజుల్లో కేసును విస్తృత ధర్మాసనానికి నివేదిస్తామని న్యాయమూర్తులు హామీ ఇచ్చారు. ఈ కేసు బహు సున్నితమైనదనీ, తాను గందరగోళం సృష్టించాలని అనుకోవడం లేదని, ఇరువర్గాలు సంయమనం పాటించాలనీ కోర్టు కోరింది. ఉద్రిక్తతలకు తావివ్వవద్దని ఉభయులకూ హితవు చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేయడానికి కానీ, ఆ తీర్పుముందువరకూ హిందూముస్లింలు ఆ సముదాయంలో నిర్దిష్టమైన వారాల్లో ప్రార్థనలు జరుపుకొనే రెండుదశాబ్దాల విధానాన్ని పునరుద్ధరించడానికి గానీ సిద్ధపడకపోవడం ఆశ్చర్యం. హైకోర్టు తీర్పుకు ముందున్న స్థితిని తిరిగినెలకొల్పకపోవడంతోపాటు, శుక్రవారం ప్రార్థనలు చేసుకొనేందుకు ముస్లింలకోసం ఆ కాంప్లెక్స్‌ వెలుపల స్థలాన్ని కేటాయించాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం విచిత్రం.

ఈ కాంప్లెక్స్‌ స్వరూపస్వభావాలకు సంబంధించిన అత్యంత సంక్లిష్టమైన చారిత్రక, పురావస్తు అంశాల్లోకి పోయి, వాటిపై నిర్ణయాలు చేయడం, తీర్పులు ఇవ్వడం ద్వారా మధ్యప్రదేశ్‌ హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందన్నది ముస్లిం పక్షం ప్రధానవాదన. దీనికితోడు, ఆ నిర్ణయాల ఆధారంగా అది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226తమకు ప్రసాదించిన ప్రార్థన హక్కులను తొలగించిందన్నది వారి ఆరోపణ. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఎస్‌ఐ) నివేదిక ఆధారంగానే హైకోర్టు సదరు సముదాయాన్ని ఆలయంగా నిర్థారించినప్పటికీ, ఎలాంటి క్రాస్‌ ఎగ్జామినేషన్లు జరపలేదని, అరబిక్‌, పర్షియన్‌ ఇత్యాది ఇతర శాసనాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఆ నివేదికను హైకోర్టు ఆమోదించిందన్నది వాదన. ఈ సముదాయం 1958నాటి స్మారకచిహ్నాలు ప్రదేశాల పరిరక్షణ చట్టానికి లోబడి ఉన్నందున 1991నాటి ప్రార్థనాస్థలాల ప్రత్యేక చట్టం దీనికి వర్తించదంటూ హైకోర్టు ఈ కేసులో దూకుడుగా ముందుకుపోవడాన్ని కూడా వారు సవాలు చేస్తున్నారు. ఆ కట్టడాన్ని మసీదుగా గుర్తిస్తూ ధార్‌ సంస్థానం 1935లో జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు చెల్లనిదిగా ప్రకటించింది. ముస్లిం చట్టం ప్రకారం కమల్‌ మౌలా మసీదు రద్దుచేయలేని వక్ఫ్‌ అని గుర్తుచేస్తూ, ఏఎస్‌ఐ పాత్ర, స్థల నిర్వహణ ఇత్యాది అంశాల్లో హైకోర్టు ఆదేశాలను ముస్లిం పక్షం ఈ పిటిషన్లలో సవాలు చేసింది. తన అనుమతి లేకుండా ఆ సముదాయం నిర్మాణంలో ఎటువంటి మార్పుచేర్పులూ చేయవద్దని ఆదేశించిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుమీద ముస్లిం పక్షం లేవనెత్తిన చాలా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదన్నది విమర్శ.


తానేమీ యాజమాన్యహక్కును నిర్ణయించడం లేదని తీర్పులో పదేపదే పేర్కొంటూనే, వందల ఏళ్ళుగా రికార్డుల్లో ఉన్నదానికి భిన్నంగా ఆ ప్రదేశం మత స్వభావాన్ని హైకోర్టు నిర్థారించి, ఒకపక్షం ప్రార్థన హక్కులను రద్దుచేసింది. ఆ కాంప్లెక్స్‌లోపల సంపూర్ణ హక్కులతో వాగ్దేవిని పూజించుకొనే అవకాశం హిందూపక్షానికి దక్కినప్పటికీ, న్యాయప్రక్రియలో మరొకరికి అన్యాయం జరిగిందన్న విమర్శలకు సుప్రీంకోర్టు తావివ్వకూడదు. మధ్యంతర ఉపశమనానికి అది అంగీకరించకపోవడంతో హైకోర్టు తీర్పును అది పరోక్షంగా ఆమోదించినట్టయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి విషయంలో జరుగుతున్నదే, ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని ఈ జ్ఞానదేవాలయంలోనూ కొనసాగుతోందన్న ఆరోపణలకు ఆస్కారమిచ్చినట్టయింది. హిందూ పిటిషనర్లు కోర్టులకు ఎక్కడం, వారి డిమాండ్లకు లోబడి సర్వేలకు అనుమతించడం, యథాతథస్థితి కొనసాగించాలన్న ముస్లిం పక్షం విజ్ఞప్తులను కాదనడం, ఆయాప్రదేశాల మతపరమైన స్థితిని దిగువకోర్టులు నిర్థారిస్తూంటే, సర్వోన్నత న్యాయస్థానం నోరువిప్పకపోవడం లేదా అత్యంత పరిమితంగా జోక్యం చేసుకోవడం వంటి గొలుసుకట్టు పరిణామాలు ఒక విధానంగా అమలుజరుగుతున్నట్టు అనిపించడంలో తప్పేమీలేదు. ఏ రథయాత్రలూ అవసరం లేకుండా, న్యాయస్థానాల ద్వారా దేశవ్యాప్తంగా అనేక అయోధ్యలను సిద్ధం చేస్తున్నారన్న వ్యాఖ్యానాలకు సుప్రీంకోర్టు అవకాశం ఇవ్వకూడదు.

ఈ వార్తలనూ చదవండి:

వెనక్కి తగ్గిన మెటా.. ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద ఏఐ ఫీచర్ తొలగింపు..

మరో ఏఐ మోడల్‌‌ను లాంచ్ చేసిన స్పేస్ఎక్స్ఏఐ

Updated Date - Jul 17 , 2026 | 02:58 AM