Share News

జీవించే హక్కుకు కొత్త భాష్యం

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:54 AM

ప్రయాణికుల భద్రతను ప్రాథమిక హక్కు స్థాయికి పెంచి సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు విశేషమైనది. వారి భద్రత కేవలం విధానపరమైన వ్యవహారం కాక, ఆర్టికల్‌ 21లో అంతర్భాగమని కోర్టు...

జీవించే హక్కుకు కొత్త భాష్యం

ప్రయాణికుల భద్రతను ప్రాథమిక హక్కు స్థాయికి పెంచి సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు విశేషమైనది. వారి భద్రత కేవలం విధానపరమైన వ్యవహారం కాక, ఆర్టికల్‌ 21లో అంతర్భాగమని కోర్టు స్పష్టంచేసింది. తద్వారా క్షేమకరమైన మౌలికసదుపాయాల ఏర్పాటునుంచి ప్రమాదాల నివారణకు బాధ్యత పడటం వరకూ ప్రభుత్వం జవాబుదారీ అవుతుంది. జీవించే హక్కు కేవలం ఒక వ్యక్తి భౌతిక ఉనికికి పరిమితం కాబోదని, సురక్షితమైన వాతావరణంలో జీవించడం కూడా అందులో భాగమని కోర్టు స్పష్టంచేసింది. అందువల్ల, రోడ్లవంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వంపైన ఆ సదుపాయాలు పౌరుడి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందన్నది సారాంశం. ఇలా భద్రతను ప్రాథమికహక్కుగా ప్రకటించడం ద్వారా న్యాయస్థానం ప్రయాణికుడి రక్షణను రాజ్యంపైన పెట్టింది. అంటే, మౌలిక సదుపాయాల నిర్వహణలో నిర్లక్ష్యం ఇకపైన కేవలం తప్పిదంగా కాక, పౌరుడి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది. ప్రయాణికుల భద్రతను పాలన, విధానపరమైన అంశం నుంచి ప్రాథమిక హక్కు స్థాయికి పెంచడం వల్ల న్యాయస్థానాలను ఆశ్రయించగలిగే అధికారం కూడా వ్యక్తికి హెచ్చినట్టే. హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆయా రహదారుల్లో తనకు క్షేమకరంగా లేని పరిస్థితులపై ఫిర్యాదులు చేయవచ్చు, ప్రమాదకరంగా పరిణమించిన రోడ్లకు మరమ్మత్తులు, మెరుగుదల డిమాండ్ చేయవచ్చు.

గత ఏడాది నవంబరులో జరిగిన రెండు రోడ్డుప్రమాదాలను సుప్రీంకోర్టు సూమోటోగా స్వీకరించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. నవంబరు 2న రాజస్థాన్‌లోని ఫలోడీలో జరిగిన రోడ్డుప్రమాదంలో పదిహేనుమంది ప్రాణాలు కోల్పోయి, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ మర్నాడే రంగారెడ్డి జిల్లాలో మరో ఘోరం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్‌ వెడుతున్న ఆర్టీసీ బస్సును కంకరలోడ్‌తో ఉన్న లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పదిమంది మహిళలు, ఒక చిన్నారి సహా 19మంది మరణించారు. వ్యవస్థాగత నిర్లక్ష్యాన్ని, సదుపాయాల లేమిని ప్రశ్నిస్తూ ఈ కేసులో సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత విశ్రాంతి స్థలాల్లో తప్ప, జాతీయ రహదారులపై భారీ వాణిజ్యవాహనాల పార్కింగ్‌ నిషేధం సహా అనేక మార్గదర్శకాలను ప్రకటించింది. హైవేలపై అధునాతన ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థలు, జీపీఎస్‌ ఆధారిత చిత్రాలు, ఈ–చలాన్‌ ద్వారా ఉల్లంఘనల కట్టడి, రహదారుల అంచుల్లో వ్యాపార, వాణిజ్య కట్టడాల నిర్మాణంపై నిషేధం వంటివి ఇందులో ఉన్నాయి. ప్రమాదాల నివారణకు ఆధునాతన ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు కోర్టు సూచించింది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న అన్ని అక్రమ కట్టడాలను 60రోజుల్లోగా కూల్చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. జాతీయ రహదారులు ఉన్న జిల్లాలన్నీ పక్షంరోజుల్లోగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకొని రోడ్లను నిరంతరం పర్యవేక్షించాలి. తద్వారా జిల్లా పరిధిలో జరిగే ప్రమాదాలకు ఆయా అధికారులదే బాధ్యత. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా చేయవలసినదేమిటో కూడా కోర్టు వివరంగా చెప్పింది. మొత్తంగా, రోడ్డుప్రమాదాలను నివారించడానికి డజనుపైనా మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, రెండునెలల అనంతరం వీటి ఆచరణను సమీక్షిస్తానని హెచ్చరించింది కూడా.


సుప్రీం ఆగ్రహానికీ, ఆవేదనకు బలమైన కారణం ఉంది. దేశంలో జాతీయ రహదారులు రెండుశాతమే అయినా, మొత్తం ప్రమాదాల్లో ముప్పై ఒక్కశాతం వాటిమీదే జరుగుతున్నాయి. 36శాతం మరణాలు అక్కడే సంభవిస్తున్నాయి. ఇందుకు అతివేగమే కారణమని పలు నివేదికలు తేల్చినందున వేగాన్ని నియంత్రించే విధానాలపైన కూడా కోర్టు ప్రత్యేక దృష్టిపెట్టింది. నాలుగులేన్లు, ఆరులేన్లకు రోడ్లను విస్తరిస్తున్న ప్రభుత్వాలు ప్రమాదాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదు. దీనికితోడు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల విషయంలో అధికారుల అవినీతి సైతం ప్రమాదాలను పెంచుతున్నాయి. వాహనదారుల అతివేగం, బాధ్యతారాహిత్యం, తోటిప్రయాణికుల పట్ల నిర్లక్ష్యం, మద్యం తాగి నడపడం వంటివి యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. ఇక, రహదారుల నిర్మాణంలో ఇంజనీర్ల తప్పులు చాలా ప్రమాదాలకు దారితీస్తున్నాయి. నిముషానికో రోడ్డు ప్రమాదం, రోజూ నాలుగువందలయాభై మరణాలు సంభవిస్తున్న ఈ దేశంలో సుప్రీంకోర్టు చొరవతోనైనా పరిస్థితిలో మార్పు వస్తే సంతోషం.

ఇవి కూడా చదవండి

ఆర్టీసీ సమ్మెలో ఆందోళనకర పరిణామాలు..

చిన్న నౌకలనూ కాల్చేయండి.. అమెరికా నేవీకి ట్రంప్ కీలక సూచనలు

Updated Date - Apr 24 , 2026 | 12:54 AM