‘బుల్డోజర్ న్యాయ’మేనా?
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:43 AM
బుల్‌డోజర్ న్యాయం మీద సర్వోన్నత న్యాయస్థానం 2024 నవంబరులో వెలువరించిన తీర్పు ధిక్కరణకు గురైందంటూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల ఆయా రాష్ట్రాల హైకోర్టులకు...
బుల్డోజర్ న్యాయం మీద సర్వోన్నత న్యాయస్థానం 2024 నవంబరులో వెలువరించిన తీర్పు ధిక్కరణకు గురైందంటూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల ఆయా రాష్ట్రాల హైకోర్టులకు బదిలీచేసింది. దేశవ్యాప్తంగా వందలాది కేసులు స్థానిక అంశాలతో, విభిన్న వాదనలతో ముడిపడివున్నందున కేసు మెరిట్‌ను బట్టి హైకోర్టులే వాటిని తేల్చడం సముచితమని సుప్రీంకోర్టు భావించింది. అక్రమనిర్మాణాల కూల్చివేతలకు బుల్‌డోజర్ల వాడకంపై అడ్డంకులేమీ ఉండబోవని, అయితే ఆ కూల్చివేతలు చట్టబద్ధంగా, నోటీసుల జారీతో తగిన గడువుతో జరగాలని కోర్టు పేర్కొంది. సోమ్‌నాథ్ ఆలయ సమీపంలో మసీదుల కూల్చివేతలనుంచి, మహారాష్ట్ర, యూపీ తదితర అనేక రాష్ట్రాల్లో పలు రకాల నిర్మాణాల కూల్చివేతలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని, రెండేళ్ళనాటి తీర్పులో సుప్రీంకోర్టు ప్రవచించిన మార్గదర్శకాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారన్నది పిటిషన్‌దారుల వాదన. ఆ తీర్పు అప్పటికి వివిధ సందర్భాల్లో నిందితుల ఇళ్ళ కూల్చివేతలకు సంబంధించినది మాత్రమేనని చెబుతూ, ధిక్కారపిటిషన్లను హైకోర్టులు వీలైనంతవరకూ నాలుగునెలల్లోనే పరిష్కరించాలని సూచించింది. విస్తృత చర్చకు దారితీసిన ఈ తీర్పు వెలువడిన నాలుగు రోజులకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇదే బుల్‌డోజర్ న్యాయానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయి వాస్తవానికి అద్దంపడుతున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు తమ నివాసాలు, వ్యాపారాలపై ప్రభుత్వం బుల్‌డోజర్‌తో విరుచుపడే ప్రమాదం ఉన్నదన్న భయంతో ముందస్తు రక్షణ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. పోక్సో చట్టాన్ని, మతమార్పిడి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన నేరాలపై వారి సమీప బంధువు ఒకరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, వీరి ఆవాసాలనూ ఆస్తులనూ కూడా సీజ్‌చేయడం వారి ఈ అనుమానానికి కారణం. తాము ఏ నేరమూ చేయలేదని, తమపై ఏ కేసులూ లేవని, ఆ నిందితుడికీ ఈ ఆస్తులకు సంబంధం కూడా లేదని, అయినా పోలీసులు వీటిని లక్ష్యంగా చేసుకోవడం వల్ల తాము నిలువనీడ కోల్పోయి, జీవనాధారానికి కూడా దూరమైనామని వారు విన్నవించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగానే పాతవాదనే వినిపించింది. ఆ నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌కూ, ఈ ముగ్గురి ఆస్తులను సీజ్‌చేయడానికీ ఏ సంబంధం లేదని, వీరి నిర్మాణాలన్నీ ప్రభుత్వ భూములమీద ఎటువంటి అనుమతులూ లేకుండా ఉన్నందునే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఈ మాటలు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ అతుల్ శ్రీధరన్‌కు బాధతో పాటు, గట్టి ఆగ్రహమే కలిగించినట్టున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా తక్షణ బుల్‌డోజర్ న్యాయాన్ని నిత్యం చూస్తున్న సమాజం రక్తదాహాన్ని తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇళ్ళ కూల్చివేతకు ఒడిగడుతోందన్నారు ఆయన. పిటిషన్‌దారుల ఆస్తులు అక్రమమైనవన్న ప్రభుత్వవాదన నిజమే అనుకున్నప్పటికీ, అవి రాజకీయ నేతల ఆశీస్సులు, అవినీతి అధికారుల ప్రమేయం లేకుండా రాత్రికిరాత్రే పుట్టుకురావని ఆగ్రహించారు. ‘చిన్న ఇల్లుకట్టడానికి పేదవాడు ముక్కలు చెక్కలవుతాడు, కానీ తగలబెట్టడానికి మాత్రం మీరు వీసమెత్తు పశ్చాత్తాపపడరు’ అంటున్న ఉర్దూ కవి బషీర్ బద్ర్ కవితను ఆయన ఉటంకించారు.
ఇక, క్రిమినల్ కేసుల్లోని నిందితుల నివాసాలను కూల్చేందుకు అధికారులు ప్రదర్శించే దూకుడును నియంత్రించడానికి ఆయన ఓ రెండు అదనపు రక్షణలను ప్రతిపాదించే ప్రయత్నం చేశారు కానీ, చట్టబద్ధమైన సంస్థలను తమ అధికారాలను వినియోగించకుండా అడ్డలేమంటూ తోటి న్యాయమూర్తి విభేదించారు. అభిప్రాయభేదం దృష్ట్యా ఈ విభజిత తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వారు నివేదించారు. ప్రయాగ్‌రాజ్‌లో అక్రమ నిర్మాణాలపేరిట నిందితుల, వారి బంధువుల ఇళ్ళను కూల్చివేయడంపై గత ఏడాది ఏప్రిల్‌లో ఎంతో ఆవేదన చెంది, నిలువనీడ ప్రాథమిక హక్కులో భాగమంటూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చిన సుప్రీంకోర్టు, రెండేళ్ళనాటి తన మార్గదర్శకాలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు కొనసాగడంపై అసంతృప్తిని ప్రకటించి, ధిక్కార పిటిషన్లను స్వీకరించి వుంటే బాగుండేది. నేరాన్ని అధికారబలంతో కాక, న్యాయప్రక్రియద్వారా నిరూపించాలన్న ఆ మార్గదర్శకాల సారాంశం అమలుకానందుకు ఆగ్రహించివుంటే సముచితంగా ఉండేది.
ఇవి కూడా చదవండి
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్
12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..