Share News

జగజ్జేత స్పెయిన్‌

ABN , Publish Date - Jul 21 , 2026 | 01:25 AM

స్పానిష్‌ కిక్‌ అదిరింది. ప్రపంచ సాకర్‌ వేదికపై స్పెయిన్‌ పతాక ఉవ్వెత్తున ఎగిసింది. పదహారేళ్ల తర్వాత ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మళ్లీ ఐరోపా చాంపియన్‌ స్పెయిన్‌ చెంతకు చేరింది. అత్యుత్తమ జట్టుగా...

జగజ్జేత స్పెయిన్‌

స్పానిష్‌ కిక్‌ అదిరింది. ప్రపంచ సాకర్‌ వేదికపై స్పెయిన్‌ పతాక ఉవ్వెత్తున ఎగిసింది. పదహారేళ్ల తర్వాత ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మళ్లీ ఐరోపా చాంపియన్‌ స్పెయిన్‌ చెంతకు చేరింది. అత్యుత్తమ జట్టుగా తమపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆ జట్టు అగ్రపీఠాన నిలిచి వహ్‌వా అనిపించింది. తుదిపోరులో సమ ఉజ్జీ, గత టోర్నీ చాంపియన్‌ అయిన అర్జెంటీనాను బోల్తా కొట్టించి గెలిచిన తీరు ప్రశంసనీయం. జట్టులో అంతగా అనుభవజ్ఞులు లేకపోయినా, బలాన్ని నమ్ముకొని తెలివిగా, వ్యూహాత్మకంగా ఆడిన స్పెయిన్‌.. లియోనెల్‌ మెస్సీ సేన ఆట కట్టించింది. రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించి తమ సత్తా చాటుకుంది. కోట్లాది అభిమానులు ఎంతో ఉత్కంఠతో వీక్షించిన ఈ మహాసమరంలో నమోదైన ఏకైక గోల్‌ను ఫెరాన్‌ టోరెస్‌ సాధించి స్పెయిన్‌ హీరోగా నిలిచాడు. టోర్నీ మొత్తం మీద ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయిన ఈ బార్సిలోనా కుర్రాడు అత్యంత కీలకమైన తుది సమరంలో మాత్రం విశ్వరూపం చూపించి జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు.

టోర్నమెంట్‌లో విశేషంగా రాణించి, అభిమానులను అలరించిన సాకర్‌ దిగ్గజం మెస్సీ అంతిమపోరులో మాత్రం స్పెయిన్‌ విజృంభణను అడ్డుకోలేకపోయాడు. గత టోర్నీలో తనదైన ప్రతిభతో అర్జెంటీనాను చాంపియన్‌గా నిలబెట్టిన మెస్సీ ఈమారూ అదే తరహా ప్రదర్శనతో తానాడుతున్న ఆఖరి ప్రపంచకప్‌ను చిరస్మరణీయం చేసుకుందామనుకున్నాడు. కానీ, ప్రత్యర్థి దూకుడైన ఆటతీరుకు తలొగ్గి నిరాశగా నిష్క్రమించాల్సి వచ్చింది. సాకర్‌ ప్రపంచకప్‌లో మెస్సీ శకానికి తెర పడినట్టే. ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా 39 ఏళ్ల మెస్సీ ఇప్పటికే ఖ్యాతి గడించాడు. ఆటలోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ ఉత్తమంగా ఉంటూ అందరివాడనిపించుకున్నాడు. కెరీర్‌లో లెక్కకు మిక్కిలి విజయాలు, ఘనతలు అందుకున్న మెస్సీ, తన చిరకాల స్వప్నమైన ప్రపంచకప్‌ను నాలుగేళ్లక్రితమే ముద్దాడాడు. ఈ టోర్నీలోనూ అతని ప్రతిభ తక్కువేమీ కాదు. అర్జెంటీనా జట్టు ఫైనల్‌ చేరేదాకా ప్రతి అడుగులోనూ మెస్సీ పాత్ర ఉంది. వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ జట్టును తుదిపోరుకు చేర్చి తన కెరీర్‌కు చిరస్మరణీయ ముగింపునిచ్చాడు.

మొత్తం 48 దేశాలు పాల్గొన్న ఈ ప్రపంచ కప్‌నకు కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. గ్రూపు దశనుంచి నాకౌట్‌ వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లతో టోర్నీ హోరెత్తిపోయింది. స్పెయిన్‌, అర్జెంటీనా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌లాంటి మేటి జట్లు సెమీఫైనల్‌కు చేరడం నాకౌట్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఇక లీగ్‌ దశలో కొన్ని సంచలనాలు లేకపోలేదు. జర్మనీలాంటి మేటి జట్టును పరాగ్వే, బ్రెజిల్‌ జట్టును నార్వే ఇంటిదారి పట్టించడం ఆశ్చర్యపరిచింది. ఇక టోర్నీలో కేవలం లక్షా 60వేల జనాభావున్న కురకావో, ఇంకా కేపెవెర్డె అద్భుత విజయాలతో అభిమానుల మన్ననలందుకున్నాయి. మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన కిలియన్‌ ఎంబాపె, మెస్సీల మధ్య గోల్స్‌ పోరాటంలో చివరకు ఎంబాపెదే పైచేయి అయింది. మొత్తం 10 గోల్స్‌తో గోల్డెన్‌ బూట్‌ను గెల్చుకున్నాడు. గోల్డెన్‌ బాల్‌, గోల్డెన్‌ గ్లోవ్‌లను స్పెయిన్‌కు చెందిన రోడ్రి, సైమన్‌లు అందుకున్నారు.


పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న అతి చిన్నదేశాలు కూడా ప్రపంచకప్‌నకు అర్హత సాధిస్తుంటే, అన్నీ ఉన్న మన దేశంలో మాత్రం ఫుట్‌బాల్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రపంచ ర్యాంకుల్లో భారత జట్టు ఇప్పుడు 138వ స్థానంలో ఉంది. జట్టు చరిత్రలో అత్యుత్తమంగా 94వ స్థానాన్ని ఎప్పుడో 1996లో సాధించింది. ఎక్కడిదాకో ఎందుకు ఆసియాలోనే మన ర్యాంకు 26. ఆటగాళ్లు వస్తున్నారు.. వెళ్తున్నారు, కోచ్‌లు మారుతూనే ఉన్నారు... తరాలూ మారుతున్నాయి... కానీ జట్టు ఆటతీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి తరహాలోనే ఉంది. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎప్పుడూ కార్పొరేట్‌ రంగం పెద్దగా సహకరించింది లేదు. ఒకప్పుడు మోహన్‌బగాన్‌, ఈస్ట్‌ బెంగాల్‌, మహ్మడన్‌ స్పోర్టింగ్‌ లాంటి క్లబ్‌ జట్లకు అద్భుత ఆటగాళ్లుండేవాళ్లు. అయినా వారి ప్రతిభ బలీయమైన భారత జట్టును తయారుచేయడంలో విఫలమైంది. ఆ తర్వాత వచ్చిన ఐఎస్‌ఎల్‌దీ అదే పరిస్థితి. విదేశాల నుంచి ఎంతో మంది ఆటగాళ్లు వచ్చి ఆడుతున్నా.. అదీ ఉపకరించడంలేదు. 148 మంది కోట్ల జనాభా ఉన్న దేశంలో 14మంది ఆటగాళ్లు దొరకడంలేదా అని అంటుంటారు కానీ, మన తర్వాత అధిక జనాభా ఉన్న చైనా కూడా ఈసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. జనాభాతో ప్రతిభాపాటవాలను ముడిపెట్టలేము, భారీ జనాభా ఉన్నంతమాత్రాన క్రీడల్లో విజయాలూ దక్కవు. కేవలం 35 లక్షల జనాభా ఉన్న ఉరుగ్వే దశాబ్దాలుగా సాకర్‌ అత్యున్నత క్రీడాకారుల్ని అందిస్తోంది. ముందుగా భారత జట్టు ఆసియాలో టాప్‌–10లో ఉండేందుకు ప్రయత్నించాలి. ఆసియాలో అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉంటే.. అప్పుడు వరల్డ్‌కప్‌ సంగతి చూడొచ్చునన్నది భారత ఫుట్‌బాల్‌ లెజెండ్‌ సునీల్‌ ఛెత్రి అభిప్రాయం. మన దేశంలో ఫుట్‌బాల్‌ ఎదగకపోవడానికి గల సవాలక్ష సమస్యల్లో ప్రతిభ అనేది ఒకటి మాత్రమే.

ఈ వార్తలనూ చదవండి:

తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై కేంద్రం క్లారిటీ..

పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని మరింత పెంచుతారా? కేంద్రం ఏమందంటే..

Updated Date - Jul 21 , 2026 | 01:25 AM