Share News

చెప్పకనే చెబుతున్నా..

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:18 AM

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని హతం చేశామని ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్‌ ఏకకంఠంతో ధృవీకరించినా, భారత ప్రధాని నరేంద్రమోదీ నోరువిప్పకపోవడం సముచితం కాదని...

చెప్పకనే చెబుతున్నా..

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని హతం చేశామని ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్‌ ఏకకంఠంతో ధృవీకరించినా, భారత ప్రధాని నరేంద్రమోదీ నోరువిప్పకపోవడం సముచితం కాదని కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మౌనం తటస్థం కాదు, తప్పించుకోవడం అంటున్నారామె. భారత విదేశాంగ విధానం లక్ష్యాలు, ఆశయాల మీద అనుమానాలు కలుగుతున్నాయని, దాని విశ్వసనీయత దెబ్బతింటున్నదని హెచ్చరించారు ఆమె. ఖమేనీ హత్యను ప్రశ్నించకుండా, ఇరాన్‌ సార్వభౌమత్వ ఉల్లంఘనను ఖండించకుండా మోదీ ప్రభుత్వం మౌనం పాటించడం అసలు సంఘటనల కంటే ఎక్కువ దిగ్భ్రాంతికి గురిచేస్తోందట. పార్లమెంట్‌ సమావేశాల్లోనైనా ఆయన చేత ఏదో మాట్లాడించాలని ఆమె ఎందుకు అనుకుంటున్నారో తెలియదు కానీ, నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ యుద్ధం విషయంలో అనుసరిస్తున్న విధానం మీద ఎవరికీ ఏ అనుమానాలూ లేవు. ఆయన ఇజ్రాయెల్‌లో ఒకే ఒక్కరోజు కాలూనివచ్చిన కొద్దిగంటల్లోనే ఆరంభమైన ఈ భీకర యుద్ధం గురించి నోరుతెరిచినదానికంటే ఎక్కువగా మౌనంగానే చెప్పేశారు. ఇరాన్‌ మీద ఇజ్రాయెల్‌ దాడిచేయగానే తాను ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూతో మాట్లాడినట్టు ఓ పోస్టుపెట్టారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగానూ, గల్ఫ్‌దేశాల్లోని అమెరికా స్థావరాల మీదా ఇరాన్‌ ప్రతీకారదాడులు చేయగానే తాను అరబ్‌ ఎమిరేట్స్‌ అధినేతతో ఫోన్‌లో మాట్లాడానని మరో ట్వీట్‌ చేశారు. ఎమిరేట్స్‌ అధినేతను బ్రదర్‌ అని సంబోధిస్తూ, ఆ దేశం మీద జరిగిన దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. రెండు ఫోన్‌కాల్స్‌, ఇటీవలి రెండు సమావేశాలు మన విధానాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయని మీడియా విశ్లేషిస్తూంటే, ఇంకా మోదీ నోరువిప్పాలని డిమాండ్‌ చేయడం అనవసరం.


యుద్ధం ఇప్పట్లో ఆగదు, ఈ క్షిపణిమోతల తరువాత, బూట్ల చప్పుళ్ళు కూడా వినబడతాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ అధినాయకుడు నెతన్యాహూ ముక్తకంఠంతో తేల్చేశారు. ఇరాక్‌ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను భూగర్భం నుంచి వెలికితీసినప్పుడూ, ఉరితీసినప్పుడూ ఎంతటి అవమానకరమైన, వికారమైన భాష విన్నామో ఇప్పుడూ అదే వినబడుతోంది. ఎనభైనాలుగేళ్ళ వృద్ధుడు, రేపోమాపో దిగిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఈ హత్య జరిగింది. గతంలో ఇరాన్‌ ఉన్నతాధికారులను, నేతలను అమెరికా హత్యచేసిన తీరుకూ, ఈ సామూహిక హత్యాకాండకూ ఉన్న తేడా అనేకులకు గుర్తుకువస్తున్నది. వేగంగా ప్రయాణిస్తున్న కారులో సైతం తాము లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తిని మాత్రమే హత్యచేయగలిగే నైపుణ్యం, సమర్థత, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఉండి కూడా, ఈ వృద్ధుడిని సకుటుంబసపరివారంగా హతం చేయడం ద్వారా అమెరికా మిగతా ప్రపంచాన్ని భయపెట్టి, వికటాట్టహాసం చేసింది. రాత్రికి రాత్రి దేశాధినేతలను ఎత్తుకుపోవడమే కాదు, ఎక్కడ దాక్కున్నా అతిభయానకంగా మట్టుబెట్టగల శక్తిసామర్థ్యాలు తమకు ఉన్నాయని ట్రంప్‌ చాటిచెప్పారు. గిట్టని పాలకుడిని మట్టుబెట్టిన తరువాత కూడా ఇంకా ఈ విధ్వంసం ఎందుకు అని కొందరి అనుమానం. ఖమేనీ స్థానంలోకి ఎందరు వచ్చినా వారూ హతం కావాల్సిందే కానీ, తమ కీలుబొమ్మ కుర్చీ ఎక్కేవరకూ ఈ యుద్ధమూ విధ్వంసమూ ఆగదని దానర్థం. కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకొనేందుకు అనాదిగా ఉపయోగిస్తున్న భవనాన్ని అమెరికా యుద్ధవిమానాలు నేలమట్టం చేయడంలో మీ పాలకులు ఎవరో నిర్ణయించేది మేమేనన్న హెచ్చరిక ఉంది. తమ మతపెద్దను అమెరికా హత్యచేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలకు ఆగ్రహాన్ని, ఆవేదనను కలిగించడం సహజం. చాలాచోట్ల నిరసనల్లో సున్నీలు కూడా పాల్గొన్నారని, మొత్తంగా ముస్లిం సమాజం మనసుగాయపడిందనే విశ్లేషణలు వింటున్నాం. ఆగ్రహావేశాలు వేగంగానే ఉపశమించవచ్చును కానీ, గాయం మానడం కష్టం. దీని ప్రభావం ఎన్నిరూపాల్లో ఎన్నివిధాలుగా ఉంటుందో భవిష్యత్తు చెబుతుంది. యుద్ధం కూడా నాలుగువారాల్లో ముగుస్తుందని ట్రంప్ అంటున్నా, ఒకవేళ నిజంగానే అది జరిగినా, రేపిన నిప్పు మాత్రం చల్లారదు. సద్దాం మరణానంతర ఇరాక్‌ కొత్తరకం ఉగ్రవాదశక్తులను ఎగుమతిచేసిన దుష్ర్పభావాలు ప్రపంచం ఇప్పటికీ చవిచూస్తోంది. గతకాలపు కత్తియుద్ధాల్లో శత్రువు తలతెగితే విజయం సాధించినట్టే. ఇప్పుడూ అదే జరిగినా యుద్ధం సాగుతోంది. రాజు మరణించగానే శత్రుసైన్యాలు దాసోహపడటం, రాజ్యమూ అంతఃపురం సహా సమస్త పరివారం వశం కావడం రాచరికాల్లోనే సాధ్యం.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 12:18 AM