నిరసన.. నైతిక బాధ్యత
ABN , Publish Date - Jul 18 , 2026 | 02:37 AM
సామాజిక కార్యకర్త, విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఇరవైరోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణదీక్షలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, పదికేజీలకు పైగా బరువు తగ్గారని, దీక్షసాగితే కీలక అవయవాలపై దుష్ప్రభావాలు తప్పవని వైద్యబృందం..
సామాజిక కార్యకర్త, విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఇరవైరోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణదీక్షలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, పదికేజీలకు పైగా బరువు తగ్గారని, దీక్షసాగితే కీలక అవయవాలపై దుష్ప్రభావాలు తప్పవని వైద్యబృందం హెచ్చరిస్తోంది. ఆయన ప్రాణానికి ప్రమాదం ఉన్నది కనుక, దీక్ష విరమింపచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేస్తూ, ప్రతీ పౌరుడి ప్రాణమూ విలువైనదేనని, వాంగ్‌చుక్‌కు ప్రభుత్వ వైద్యులతో నిరంతర పరీక్షలు నిర్వహిస్తూ, వైద్యపరమైన చర్యలన్నీ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఆయనతోపాటుగా ఆమరణదీక్షలో ఉన్న ముగ్గురు విద్యార్థినేతల ఆరోగ్యం బాగా దిగజారిందని, తక్షణమే దీక్షవిరమించాల్సిందిగా ఒకరిని వైద్యులు హెచ్చరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వాంగ్‌చుక్ మాత్రం తాను బయటకు బలహీనంగా కనిపిస్తున్నా, లోన గట్టిగానే ఉన్నానని హామీ ఇస్తున్నారు. సోమవారం శీతాకాల సమావేశాలు మొదలవుతున్న పార్లమెంట్ వరకూ కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టబోయే శాంతియుత ర్యాలీలో పాల్గొనేందుకు తాను కచ్చితంగా ఆ రోజువరకూ జీవించే ఉంటానని వాంగ్‌చుక్ విశ్వాసాన్ని ప్రకటించారు.
తనను దీక్ష విరమించుకోవాలని ఒత్తిడి చేయవద్దని, సోమవారం నాటి ర్యాలీలో పాలుపంచుకొని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వాంగ్‌చుక్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన పక్షాన నిలవడానికి మహామహులెవ్వరికీ ధైర్యం లేకపోయిందని సోషల్ మీడియాలో విమర్శలు ఉన్నప్పటికీ, దీక్షాస్థలిని సందర్శించి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖులు, నేతలు లేకపోలేదు. కొందరు స్వయంగా వచ్చి సంఘీభావం ప్రకటిస్తే, బీజేపీ ప్రభుత్వ కఠినవైఖరిని పలు వేదికలద్వారా మరికొందరు ప్రశ్నిస్తున్నారు. నీట్ వైఫల్యం మీద స్వయంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ, ధర్మేంద్రప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్‌పార్టీ, కాస్తంత ఆలస్యంగానైనా వాంగ్‌చుక్ పక్షాన మాట్లాడుతోంది. 1984లో లద్దాఖ్ వాసులకు ఎస్టీ హోదా ఇవ్వాలంటూ వాంగ్‌చుక్ తండ్రి వాంగ్యాల్ ఇలాగే దీక్షకు దిగితే ఇందిరాగాంధీ స్వయంగా లెహ్ వెళ్ళి, డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చి దీక్ష విరమింపచేసిన ఘట్టాన్ని ఆ పార్టీనేతలు గుర్తుచేస్తున్నారు. 2011లో అన్నాహజారే దీక్ష సందర్భంలోనూ మన్మోహన్ సింగ్ మానవీయంగా వ్యవహరించారని, అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ చర్చించడం, కలసికట్టుగా వ్యవహరించడం ఆ మహానుభావులకు తెలుసునని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. వాంగ్‌చుక్ ఈ దీక్షకు దిగడానికి బీజేపీమీద ఆయనకు ఉన్న పాతకక్షలే కారణమంటూ కొన్ని హిందీ చానెళ్ళలోనూ, సోషల్ మీడియాలోనూ బురదజల్లే పని మరోపక్క జోరుగా సాగుతోంది.
లద్దాఖ్‌కు రాష్ట్రహోదా, ఆరో షెడ్యూల్ రక్షణల కోసం గత ఏడాది వాంగ్‌చుక్ సుదీర్ఘపోరాటం చేసినప్పుడు ప్రభుత్వం ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. పైగా, హింసను ప్రేరేపించారన్న ఆరోపణలతో, ఆయన మీద జాతీయ భద్రతాచట్టాన్ని ప్రయోగించి, జైల్లో పడేశారు. 170 రోజులు జైల్లో ఉన్నాక, సుప్రీంకోర్టులో కేసు చివరివిడత విచారణకు రెండురోజుల ముందు ప్రభుత్వం ఆయనను విడుదలచేసింది. దానితోపాటు, ఆయనను అరెస్టుచేయడానికి ప్రాతిపదికలుగా వాడిన పాకిస్థాన్‌తో సంబంధాలు, అనుమానస్పద విదేశీపర్యటనలు, అక్రమ విరాళాల సేకరణ ఇత్యాది ఆరోపణలను కూడా గాలికి వదిలేసింది. ఇప్పటి ఆయన డిమాండ్లలో ప్రభుత్వానికి గిట్టనివీ, నెరవేర్చలేనివీ కొన్ని ఉండవచ్చు. కానీ, మొత్తంగా పోటీ పరీక్షల విశ్వసనీయత దెబ్బతినివున్న పరిస్థితుల్లో ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్న సంస్కరణలపై మాట్లాడటానికీ, తగిన చర్యలు చేపట్టడానికీ ప్రభుత్వానికి అభ్యంతరం ఉండనక్కరలేదు. ప్రజల పక్షాన నిరశనలు, ఉద్యమాలు చేయడం వాంగ్‌చుక్‌కు కొత్తకాదు. రేపోమాపో ఆయన దీక్ష విరమించినా ఎవరూ దానిని వైఫల్యంగా భావించరు. కానీ, నెలన్నరనుంచి సాగుతున్న ఈ ఉద్యమాన్ని బేఖాతరు చేయడం ప్రభుత్వానికి అప్రదిష్ఠతెస్తుంది, మానవత్వం, జవాబుదారీతనం కొరవడ్డాయన్న అభిప్రాయానికి తావిస్తుంది. శాంతియుతంగా సాగుతున్న నిరసనను అలాగే ముగిసేట్టు చూడాల్సిన బాధ్యత ఇరుపక్షాలపైనా ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్!
భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావు: కలకత్తా హైకోర్టు