బంగ్లాతో అతుకు..!
ABN , Publish Date - Jul 01 , 2026 | 03:22 AM
నాకు చావంటే భయంలేదు, ఈ ఏడాదిలోనే నా స్వదేశంలో కాలూనుతానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. రెండేళ్ళక్రితం దేశం నుంచి పారిపోయి, భారత్‌లో తలదాచుకున్న ఆమెకు ఒక్కసారిగా..
నాకు చావంటే భయంలేదు, ఈ ఏడాదిలోనే నా స్వదేశంలో కాలూనుతానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. రెండేళ్ళక్రితం దేశం నుంచి పారిపోయి, భారత్‌లో తలదాచుకున్న ఆమెకు ఒక్కసారిగా అంత ధైర్యం ఎందుకు వచ్చిందో తెలియదు. గత ఏడాది నవంబరులో బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించినప్పటినుంచీ ఆమెను అప్పగించమంటూ ఆ దేశం మనను అదేపనిగా పోరుతున్నది. ఈ తరుణంలో నిజంగానే హసీనా తన మాటకు కట్టుబడితే అది అమిత సాహసమే.
ఉరిశిక్ష విధించిన సదరు ట్రిబ్యునల్‌ను దేశాన్ని అవిచ్ఛిన్నంగా పాలిస్తున్న కాలంలో హసీనాయే ఏర్పాటు చేశారు. అది వెలువరిస్తూ వచ్చిన తీర్పుల ఆధారంగానే ఆమె శత్రుసంహారం సాగించారు. బుధవారం ఆమె పార్టీ ఈ ట్రిబ్యునల్ రద్దుకోసం బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతోంది. అక్రమంగా, రాజ్యాంగవ్యతిరేకంగా ఏర్పాటైన ఈ ట్రిబ్యునల్ తమ నాయకురాలికి విధించిన ఉరిశిక్షను రద్దుచేయాలన్నది దాని డిమాండ్. రెండేళ్ళక్రితం ఆమె ఆదేశాలమేరకే భద్రతాబలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లు, మారణాయుధాలు వాడి ఉద్యమకారులను ఊచకోత కోశాయంటూ, ఆమెకు ఈ ట్రిబ్యునల్ మరణశిక్షతో పాటు అత్యంత కసిగా ఇంకొన్ని శిక్షలు కూడా విధించింది. అసలు ఆ ఉద్యమమే ప్రజావ్యతిరేక తీవ్రవాద గ్రూపుల ఆధ్వర్యంలో, రాజకీయ ప్రేరేపిత లక్ష్యాలతో జరిగిందని, భద్రతాదళాలు తీసుకున్న ప్రతీ చర్యకూ తమ నాయకురాలిని బాధ్యురాలిని చేయడం సరికాదని ఆ పార్టీ తన సుదీర్ఘమైన ప్రకటనలో వాదించింది. అంతర్జాతీయ పర్యవేక్షణలో తనపై విచారణ జరిపించాలన్న తమ నాయకురాలి కనీస కోరికను కూడా నెరవేరనివ్వకుండా ఈ ట్రిబ్యునల్‌ను అడ్డుపెట్టుకొని పాలకులు రాజకీయ కక్షతీర్చుకుంటున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ ఈ దేశవ్యాప్త నిరసనోద్యమాలకు సిద్ధపడుతోంది. హసీనాతో అంటకాగిన చాలామంది నాయకులను, అలనాటి మిత్రపక్షనేతలను కూడా ఈ ట్రిబ్యునల్ వదలడం లేదు. బుధవారం కూడా ఆ ట్రిబ్యునల్ రెండేళ్ళనాటి హింసకు కారకుడంటూ ఆమెకు కుడిభుజం లాంటి ఓ నాయకుడికి పదేళ్ళ కఠిన కారాగారం విధించింది.
ప్రాణాలకు తెగించి నిజంగానే హసీనా తిరిగి తన స్వదేశానికి తిరిగివెళ్లిపోతారా? అన్న ప్రశ్నను అటుంచితే, ఆమె భారత్‌లో ఉన్నంతకాలం ఉభయదేశాల సంబంధాలు సవ్యంగా ఉండవన్నది వాస్తవం. 2024 ఆగస్టు 4న ఆమె పదవినుంచి దిగిపోయేంతవరకూ ఈ రెండుదేశాల స్నేహం, సాన్నిహిత్యం అద్భుతంగా ఉండేది. దాదాపు రెండుదశాబ్దాలపాటు భారత్ నిబ్బరంగా, నిర్భయంగా ఉండగలిగింది. అమెరికా ఆశీస్సులు, మన పొరుగుదేశాల అండదండలతో అనేక నెలలు సాగిన ఆ పోరాటంతో ఆమె చివరకు ప్రాణరక్షణకోసం పరుగులు తీయాల్సి వచ్చింది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వచ్చిన మహ్మద్ యూనిస్ అందరి ఒత్తిళ్ళకూ లొంగి ఆమెకూ, ఆశ్రయం ఇస్తున్న భారత్‌కూ వ్యతిరేకంగా వ్యవహరించడంతో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దిగజారాయి. హిందూ మైనారిటీలపై సాగిన దాడులను భారత్ తప్పుబడుతున్నకొద్దీ పొరుగుదేశంలో వారిపై హింస పెరుగుతూ వచ్చింది. అవామీలీగ్ మద్దతుదారులపైన కొన్ని సంస్థలూ సంఘాలు చేస్తున్న ఈ దాడుల్లో రాజకీయమే తప్ప మతం లేదని యూనిస్ సమర్థించుకొనేవారు. ఎగుమతులు నిలిపివేయడం వంటి భారత్ ప్రతీకారచర్యలు కూడా పరిస్థితిని వేడెక్కించాయి. గత ఏడాది డిసెంబరులో ఉస్మాన్‌హాదీ హత్య ఘటన మరింత అగాధాన్ని పెంచింది.
బంగ్లాదేశ్ భవిష్య రాజకీయ పరిణామాలను అంచనావేయడంలో కాస్తంత జాప్యం జరిగినప్పటికీ, భారత ప్రభుత్వం ముందుగానే తారిఖ్ రహ్మాన్‌తో కాస్తంత సయోధ్య సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయన ప్రధాని అయినప్పటినుంచీ ఉభయదేశాల సంబంధాలు కాస్తంత మెరుగుపడటం ఆరంభించాయి. యుద్ధకాలంలో భారత్ పొరుగుదేశానికి ఇంధనాన్ని సైతం అందించింది. ఇటీవల తారిఖ్ రహ్మాన్‌తో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ భేటీ మంచి ముందడుగు. తరచు సమావేశాలు జరుగుతూ సంబంధాలను మెరుగుపరచుకొనే ప్రయత్నం సాగుతోంది. నాలుగువేల కిలోమీటర్ల సరిహద్దు ఉన్న బంగ్లాతో నదీజలాలు, విద్యుత్, సరిహద్దు రవాణా, అక్రమవలసలు ఇత్యాది సమస్యలు ఉండటం సహజం. పశ్చిమబెంగాల్‌లో ఇటీవల ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల హామీలు నిలబెట్టుకొనే పేరిట చేపడుతున్న చర్యలు బంగ్లాదేశ్‌తో మొగ్గతొడుగుతున్న ఈ సయోధ్యను దెబ్బతీయకుండా చూడాలి. రాజకీయాలను పక్కనబెట్టి ఇరుదేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలి.
Also Read:
టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి
డెలివరీ బాయ్‌తో వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్