న్యాయం నిలిచింది!
ABN , Publish Date - Apr 10 , 2026 | 02:38 AM
మా కుటుంబానికి ఏం జరుగుతోందోనని భయంగా ఉంది అన్నమాట ఒక పోలీసు నోట వినబడటం ఆశ్చర్యం. సాతాంకుళం కేసులో కీలకసాక్షిగా వ్యవహరించిన రేవతి తనను ప్రశంసలతో ముంచెత్తుతున్న...
మా కుటుంబానికి ఏం జరుగుతోందోనని భయంగా ఉంది అన్నమాట ఒక పోలీసు నోట వినబడటం ఆశ్చర్యం. సాతాంకుళం కేసులో కీలకసాక్షిగా వ్యవహరించిన రేవతి తనను ప్రశంసలతో ముంచెత్తుతున్న మీడియాతో ఇదేమాట చెబుతోంది. ఒక సంచలనాత్మకమైన తీర్పుకు ప్రధాన కారకురాలైన ఆమెను రాబోయే రోజుల్లో తన కుటుంబానికి రక్షణ ఉండదేమోనన్న అనుమానం పీడిస్తోంది. తొమ్మిదిమంది పోలీసు సిబ్బందికి జీవితఖైదుతో సరిపెట్టకుండా, ఏకంగా మరణశిక్ష విధించిన మదురై కోర్టు తీర్పు ఎంత సంచలనం సృష్టించిందో, అంతటి శిక్షకు కొండంత సాయం చేసిన హెడ్‌కానిస్టేబుల్ రేవతి కూడా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అన్యాయాన్ని ప్రతిఘటించే ఆమె స్థైర్యానికీ, బెదిరింపులకు ఏ మాత్రం లొంగని ఆమె ధైర్యసాహసాలకు దేశం మురిసిపోతోంది.
కొవిడ్ కాలంలో నిబంధనలను ఉల్లంఘించి దుకాణం తెరిచారన్న పేరిట తండ్రీకొడుకులను అరెస్టుచేసి, పోలీసు స్టేషన్‌లో వేధించి, హింసించి, రాత్రంతా లాఠీదెబ్బలతో ప్రాణాలు తీసిన ఆ భయానకమైన ఘట్టం దేశాన్ని కుదిపేసింది. కొట్టిచంపేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేయడానికి ఆ పోలీసులు చేసిన ప్రయత్నాలు, జాగ్రత్తలు న్యాయమూర్తిని ఆశ్చర్యపరిచాయి. అత్యంత అరుదైన కేసు అంటూ ఆయన చేసిన వ్యాఖ్య, తీర్పులో భాగంగా అలవోకగా చేసింది కాదు. మనసు లోతుల్లోంచి వచ్చింది అది. ‘నువ్వు చావాల్సిందే.. ఒకవేళ నేను జైలుకెళ్ళాల్సి వస్తే, నా ఆస్తి మొత్తం అమ్మి బయటకు వచ్చేస్తా’ అన్నాడట సబ్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణన్ బెనిక్స్‌ను లాఠీతో కొడుతూ. వాళ్ళ ఆర్తనాదాలు నాకు వినిపించడం లేదేమి? అంటూ మరో ఇన్‌స్పెక్టర్ రెచ్చగొట్టాడట. నేలమీద పడిన రక్తపు మరకలను బాధితుడితో అతడి బనీను విప్పించి మరీ తుడిపించారట. రాత్రంతా పోలీసు స్టేషన్‌లో కొడుతూనే ఉన్నారని, అనేకసార్లు లాకప్ హింస చూసిన, ఆర్తనాదాలు విన్న తాను జయరాజ్, బెనిక్స్‌ను తోటి పోలీసులు పెడుతున్న హింసను చూసి తట్టుకోలేకపోయానని రేవతి కన్నీరు పెట్టుకున్నారు. కస్టడీ హింసకూ, పోలీసుల అమానుషత్వానికీ పరాకాష్ఠ ఈ ఘటన. కుమారుడు చావుదెబ్బలు తిని కన్నుమూసిన ఘోరాన్ని కళ్ళారా చూసిన ఆ తండ్రి మర్నాడు తానూ ఆ దెబ్బల తాకిడికి ప్రాణాలు కోల్పోయాడు. ప్రజాగ్రహంతో రంగంలోకి దిగిన సీబీఐకి రేవతి, మరో కానిస్టేబుల్ పని సులభం చేశారు. ఐదేళ్ళపాటు అన్ని ఆధారాలనూ పరిశీలించి, వందకు పైగా సాక్షులనూ విచారించిన మదురై కోర్టుకు ఇవి లాకప్ మరణాలని నిర్ధారించడంలో మరో సందేహమే లేకపోయింది. ఈ కఠిన శిక్ష విధించడంతో పాటు, బాధిత కుటుంబాలవారికి నష్టపరిహారంగా చెల్లించేందుకు కోటిన్నర రూపాయలు జరిమానాగా వేయడం సముచితం. చట్టాన్ని రక్షించాల్సిన వారు ప్రాథమిక సూత్రాలనూ నియమాలనూ తుంగలోతొక్కి, హద్దులులేని క్రూరత్వంతో ఆ ఇరువురి ప్రాణాలను హరించి, పౌరుడికీ రాజ్యానికీ మధ్య ఉన్న బంధాన్నీ, ఒప్పందాన్నీ తుంచేసినందుకు ఈ మాత్రం అవసరం.
ఇటువంటి ఘటనలకు తావులేని వ్యవస్థలను, నివారించగల విధానాలను ఎందుకు సృష్టించుకోలేకపోతున్నామన్నది ప్రశ్న. ఉన్నవీ, అమలు చేయాల్సినవీ కూడా ఉద్దేశపూర్వకమైన ఉల్లంఘనలకు గురవుతున్నందునే నిర్లజ్జగా, నిరంతరంగా లాకప్ హత్యలు సాగుతున్నాయి. తన భద్రతను, వృత్తినీ, ఉనికినీ ప్రమాదంలోకి నెట్టి, ఏ మాత్రం బంధుత్వంలేని ఇద్దరు వ్యక్తులకు దక్కాల్సిన అంతిమన్యాయం కోసం నిలబడి పోరాడే రేవతివంటివారు అత్యంత అరుదు. తనతో కలిసి పనిచేసినవారి ఒత్తిళ్ళనూ, తన పైవారి ఆదేశాలనూ ధిక్కరించి, తారుమారైన సాక్ష్యాలను తిరగదోడడంలోనూ, మాటుగా ఉన్నవాటి గుట్టురట్టుచేయడంలోనూ, చెరిపేసినవాటిని చిత్రీకరించడంలోనూ ఆమె చూపిన సాహసం అసామాన్యమైనది. సాక్ష్యాలను తుడిపేసి, సాక్షుల నోళ్ళు మూయించడం పోలీసులకు సులభమైపోతున్నది కనుకనే, ఠాణాల్లో జరిగే అమానుషాలు వెలుగుచూడటం లేదు. అందువల్ల, ఒత్తిళ్ళకు ఎదురొడ్డి, సత్యరక్షణకు కట్టుబడిన రేవతి వంటి ఒకరిద్దరిపై కేసులూ న్యాయమూ పూర్తిగా ఆధారపడటం సరికాదు. పోలీసుస్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు, అవి నిరంతరాయంగా పనిచేయడం, సత్వరమే ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, సాక్ష్యాలూ, సాక్షుల పరిరక్షణ, స్వతంత్ర దర్యాప్తు, బెదిరింపులకు తావులేకుండా చేయడం వంటివి కలగలిసినప్పుడే పోలీసుల దురాగతాలకు హద్దు ఉంటుంది, కస్టడీ మరణాలకు కళ్ళెం వేయడం సాధ్యపడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News