ప్రయత్నం ఫలించేనా?
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:07 AM
అప్పుడప్పుడు ఓ నాలుగు మంచిమాటలు చెప్పడం, హితబోధలు చేయడంతో సరిపెట్టకుండా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మరింత చొరవ చూపాలని భారత్ నిర్ణయించుకున్నట్టు...
అప్పుడప్పుడు ఓ నాలుగు మంచిమాటలు చెప్పడం, హితబోధలు చేయడంతో సరిపెట్టకుండా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మరింత చొరవ చూపాలని భారత్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, అది కాస్తంత శ్రుతిమించినప్పుడల్లా నిగ్రహం పాటించాలంటూ భారత్ కోరుతూనే ఉంది. ఆ ఏడాది సెప్టెంబర్‌లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అన్నారు కూడా. పుతిన్‌ను కలిసినప్పుడల్లా యుద్ధం ముగించడం గురించి గుర్తు చేస్తూనే వచ్చారు. అయితే, మొన్నీమధ్య ఈ యుద్ధ నివారణకు తాము అందుకున్న ప్రతిపాదనలన్నింటిలోకీ భారతదేశం నుంచి వచ్చినదే అత్యంత సమగ్రమైనదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా మెచ్చుకోవడం, ఈ ఘర్షణకు ముగింపు పలికేలా మోదీ నిరంతరం చొరవ చూపుతున్నారనీ, ఆయన దగ్గర చాలా మంచి ఆలోచనలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మరోపక్క ప్రశంసించడం గమనార్హం. మోదీ శాంతి గురించే మాట్లాడుతుంటారని, యుద్ధం విషయంలో భారత్ ఏ పక్షమూ వహించకుండా తటస్థంగా ఉంటోందని, మోదీ పడుతున్న తపనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని పుతిన్ అన్నారు. భారత్ శాంతివచనాలకు పరిమితం కాకుండా, అంతకుమించిన పాత్ర పోషిస్తోందని, ఉభయపక్షాలతోనూ చర్చిస్తోందని విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ కూడా వ్యాఖ్యానించారు. శాంతికోసం క్షేత్రస్థాయిలో పనిచేసే దిశగా వచ్చిన ఈ మార్పు ప్రశంసించదగినది.
జైశంకర్ సెప్టెంబర్ 3న ఉక్రెయిన్‌లో పర్యటించడానికి మూడురోజుల ముందు బిష్కెక్‌లో పుతిన్‌తో నరేంద్రమోదీ మాట్లాడుతూ ఈ అంతం లేని యుద్ధానికి ముగింపు పలకాల్సిందిగా చెప్పినట్టు, అలాగే, జైశంకర్ చెప్పిన దానిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా శ్రద్ధగా విన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే, యుద్ధాన్ని ముగించడానికి భారతదేశం ఒక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందన్న ఉక్రెయిన్ మెచ్చుకోలును చూడాలి. టర్కీ, ఈజిప్ట్, అమెరికా నుంచి కూడా ఉక్రెయిన్‌కు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, భారతదేశం ఇచ్చినదే ఉక్రెయిన్‌కు నచ్చి, శాంతిస్థాపనలో కీలకపాత్ర పోషించడానికి కూడా భారత్ సిద్ధంగా ఉందని అది ప్రకటించినట్టు కనిపిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ రెండూ ఇంత సానుకూలత ప్రకటించిన ఈ మంచి తరుణంలోనే భారత్ క్రియాశీలకంగా వ్యవహరించి వాటిని చర్చలకు కూచోబెట్టాలని ఆశావాదులు అంటున్నారు. యుద్ధంలో ఇంధనవనరుల జోలికి పోబోమని, షరతులు లేని కాల్పుల విరమణకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అంటోంది.
డిసెంబర్‌లో జరిగే జి20 సదస్సులో పుతిన్‌తో నేరుగా మాట్లాడటానికి కూడా తాను సిద్ధమని జెలెన్‌స్కీ ప్రకటించారు. ప్రధానంగా ధాన్యం ఎగుమతి దేశాలైన ఈ రెండూ పరస్పరం రేవులూ, నౌకలపై దాడులు చేసుకోవడంతో ప్రపంచం ఇబ్బందిపడుతోంది. ఇప్పుడు సాగుతున్న రెండు యుద్ధాల వల్ల ఇప్పటికే ఎరువుల కొరత ఉందని, రాబోయే నెలల్లో భారీ ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం కనిపిస్తోందని జైశంకర్ ఈ మధ్యనే ఓ హెచ్చరిక కూడా చేశారు. ఉక్రెయిన్ యుద్ధం యూరప్ ఇంధన మార్కెట్లను అతలాకుతలం చేస్తే, రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారతదేశాన్ని అమెరికా సుంకాలతో బెదిరిస్తోంది. ఐదేళ్లుగా రష్యా చమురు కొనుగోలు విషయంలో పాశ్చాత్యదేశాలనుంచి భారత్ అనేక విమర్శలు ఎదుర్కొంటోంది.
రష్యా, ఉక్రెయిన్ రెండూ ఒక తటస్థ, నిజాయితీగల మధ్యవర్తి కోసం చూస్తున్నందున, జైశంకర్ హామీ ఇస్తున్న చొరవను భారత్ వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. మోదీ కనుక ఈ యుద్ధాన్ని ఆపగలిగితే, ఆహార, ఇంధన సంక్షోభాలు చాలావరకు తగ్గి, ప్రపంచం హర్షిస్తుంది. సరిహద్దుల వంటి పెద్దపెద్ద సమస్యలను ముందే పరిష్కరించుకోలేకపోయినా, రెండుపక్షాలకు ఇబ్బందికరమైన పలు అంశాలమీద ఒక తక్షణ అవగాహనకు రావచ్చు. ఉభయదేశాల ప్రయోజనాలను కాపాడేరీతిలో సాగే చర్చలవల్ల కనీసం ఉద్రిక్తతలు తగ్గి, కాల్పుల విరమణ ఒప్పందం వంటివి కుదిరినా సంతోషించాల్సిందే. అంతిమ ఫలితం ఎలా ఉన్నా, శాంతికోసం ప్రయత్నించిన కీర్తి భారత్‌కు ఎక్కడికీ పోదు.
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..