మనీలా సందేశం
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:29 AM
రెండేళ్ళ తరువాత క్వాడ్ సమావేశం జరగడమే ఓ విశేషమైతే, దీనికితోడు, అమెరికా అధ్యక్షుడే స్వయంగా హాజరైనారు కనుక, మీడియాకు అది గొప్ప వేడుక అయింది
రెండేళ్ళ తరువాత క్వాడ్ సమావేశం జరగడమే ఓ విశేషమైతే, దీనికితోడు, అమెరికా అధ్యక్షుడే స్వయంగా హాజరైనారు కనుక, మీడియాకు అది గొప్ప వేడుక అయింది. క్వాడ్ సభ్యదేశం కాని ఫిలిప్పీన్స్‌లో ఈ సదస్సు జరగడం మరో విశేషం. రాజధాని మనీలాలో ‘ఆసియాన్’ సభ్యత్వ దేశాల నేతలంతా ‘కలసికట్టుగా మన భవితను నిర్దేశించకుందాం’ అంటూ ప్రాంతీయ శాంతి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, భద్రత ఇత్యాది అంశాలమీద చర్చలు చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ 23వ భారత్–ఆసియాన్ సదస్సులో పాల్గొని మిగతా దేశాలతో వాణిజ్యం, దీర్ఘకాలిక సంబంధాల మీద మాట్లాడారు. ‘ఆసియాన్’ ఆఖర్లో మనీలా వచ్చిన అమెరికా అధ్యక్షుడు, మరికొందరు నేతలు ఎలాగూ ఎపెక్ సదస్సుకోసం చైనా వెళ్ళవలసి ఉన్నది కనుక ‘క్వాడ్’ కూడా ఇక్కడే జరిగిందని చెబుతున్నారు. అయితే, ప్రయాణసౌలభ్యం కాక, మనీలాలో కొన్ని హెచ్చరికల తరువాతే చైనాలో అడుగుపెట్టాలని ట్రంప్ నిర్ణయించుకోవడంతో క్వాడ్ సదస్సు ఏర్పాటు కాస్తంత హడావుడిగా జరిగిందని కొందరు అంటారు.
దాదాపు దశాబ్దంపాటు నిద్రావస్థలో ఉన్న క్వాడ్‌ను 2017 నవంబరులో మనీలాలో జరిగిన ఆసియాన్ సదస్సు సందర్భంగానే ఈ నాలుగు దేశాలు పునరుద్ధరించాయి. మళ్ళీ తొమ్మిదేళ్ళకు అక్కడే అత్యున్నతస్థాయి నాయకుల సదస్సు జరగడం నిజానికి విశేషమే. ఆసియాన్ దేశాలను క్వాడ్ పట్టించుకోవడం లేదన్న విమర్శలను తిప్పికొట్టడానికి కూడా పక్కపక్కనే రెండు సదస్సులు జరగడం ఉపకరిస్తుంది. సముద్రంలో చైనా వీరంగాలను ఫిలిప్పీన్స్ నేరుగా భరిస్తోంది కనుక, క్వాడ్ భాగస్వామి కాకున్నా అక్కడ ఈ సదస్సు జరిపి, ఫిలిప్పీన్స్ సార్వభౌమత్వ పరిరక్షణకు తామంతా కట్టుబడివున్నామని, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ సముద్రజలాల్లో చైనా దూకుడును ఎంతమాత్రం ఉపేక్షించబోమని క్వాడ్ చాటిచెప్పింది. చైనాతో సయోధ్యకు అమెరికా తహతహలాడుతున్నది కనుక, ఆ సాన్నిహిత్యంమీద క్వాడ్ భవిష్యత్తు ఆధారపడి వుంటుందన్నది నిజం. చైనా, రష్యా అధినేతలతో అత్యున్నత స్థాయి భేటీకి ముందు ట్రంప్ మనీలాలో క్వాడ్ మీద ఎంతో అభిమానాన్ని ప్రకటించారు. క్వాడ్ పుట్టుకే చైనా లక్ష్యంగా జరిగింది కనుక, శత్రువుతో బేరాలు ఆడుకోవడానికి ఈ వేదికను వాడుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. పైగా, మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న ఆయనకు ప్రపంచపటంమీద తాను చక్రం తిప్పుతున్నానని చెప్పుకోవచ్చు. మలివిడత అధికారంలోకి వచ్చిన తరువాత చైనాతో అవసరాల రీత్యా క్వాడ్ మీద ట్రంప్ అంతగా దృష్టిపెట్టలేదు కానీ, 2007లో పుట్టి, ఆ తరువాత జపాన్, ఆస్ట్రేలియా రాజకీయ పరిణామాల కారణంగా నిస్తేజంగా మారిన క్వాడ్‌ను 2017లో పునరుద్ధరించింది ఆయనే. అన్ని రంగాల్లోనూ అన్ని విధాలా ఎదిగిపోతున్న చైనాకు సంకెళ్ళు వేయడానికి ఏర్పడినప్పటికీ, దానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడటం కంటే, పరోక్షంగా చురకలంటించడానికే క్వాడ్ పరిమితమైంది.
సముద్ర నిఘావ్యవస్థ, ఉమ్మడి సైనికవిన్యాసాలు, కేబుల్ కనెక్టివిటీ, సైబర్ సెక్యూరిటీ భాగస్వామ్యం ఇత్యాది అనేక సరికొత్త ఆశయాలు క్వాడ్ దేశాధినేతలు ప్రకటించారు. ఈ ప్రాంతంలో చైనా దూకుడును, దాని ఏకపక్ష ఎగుమతి ఆంక్షలను పరోక్షంగా విమర్శిస్తూ, సురక్షితమైన రవాణా కారిడార్ల కోసం కలిసి పనిచేయాలని, కీలకమైన సరఫరా వ్యవస్థలను సురక్షితంగా మార్చుకోవాలని క్వాడ్ సంకల్పించింది. కృత్రిమ మేధకు సూపర్ ఇంటలిజెన్స్ అని ఇటీవలే నామకరణం చేసిన ట్రంప్ దానిలో పెట్టుబడులు, విస్తరణతో క్వాడ్ బలోపేతం కాబోతోందన్నారు. పారిశ్రామిక విప్లవం కంటే గొప్ప మార్పును ఏఐ తెస్తుందని, క్వాడ్ సభ్యదేశాలన్నీ దానితో ప్రయోజనం పొందుతాయని, భద్రతభయాలకు ఇక తావులేదన్నారు. వచ్చే ఏడాది క్వాడ్ దేశాల వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించి, వాణిజ్యసంబంధాలను మరింత బలోపేతం చేయబోతున్నట్టు, అలాగే, విస్తృతస్థాయిలో ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. మరిన్ని కొత్త నిర్ణయాలు కూడా అప్పుడు జరుగుతాయట. క్వాడ్ శిఖరాగ్ర సమావేశం ఉమ్మడి ప్రకటన కూడా దాని భవిష్యత్ సహకారం, చైనామీద ఏమాత్రం ఆధారపడే అవసరంలేని వ్యవస్థల ఏర్పాటు విషయంలోనూ ఎంతో నమ్మకాన్ని పెంచేట్టుగానే ఉంది. అయితే, చైనా అధ్యక్షుడిని ఆలింగనం చేసుకోవడానికి వెడుతూ మధ్యలో మనీలాలో కాలూనిన అమెరికా అధ్యక్షుడు రేపటిరోజుల్లోనూ క్వాడ్ పట్ల ఇంతే పట్టుదలగా ఉంటారా?
ఇవి కూడా చదవండి..
ట్రైన్ డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లేందుకు యువతి యత్నం.. ఘటనపై ఆర్పీఎఫ్ విచారణ
‘అక్వాన్’ తుపాను: 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 31 ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు