Share News

ప్రజామోదమేనా?

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:56 AM

రష్యా పార్లమెంట్‌ ఎన్నికల్లో వ్లాదిమిర్‌ పుతిన్‌ ఘనవిజయం సాధించారు. 450 స్థానాలున్న పార్లమెంట్‌ దిగువసభ డ్యుమాలో యునైటెడ్‌ రష్యాపార్టీ 355 స్థానాలు దాటింది. పదేళ్ళక్రితం...

ప్రజామోదమేనా?

రష్యా పార్లమెంట్‌ ఎన్నికల్లో వ్లాదిమిర్‌ పుతిన్‌ ఘనవిజయం సాధించారు. 450 స్థానాలున్న పార్లమెంట్‌ దిగువసభ డ్యుమాలో యునైటెడ్‌ రష్యాపార్టీ 355 స్థానాలు దాటింది. పదేళ్ళక్రితం ఎన్నికల్లో ఆయన సాధించిన స్థానాలకంటే ఇప్పుడు బాగా పెరిగాయట. ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభమైన తరువాత ఎన్నికలు జరిగింది ఇప్పుడే కనుక, జనాదరణ తగ్గకపోగా హెచ్చిందనుకోవాలి. బరిలో బలమైన ప్రతిపక్షాలేమీ లేవు గనుక, లేకుండా ఆయన చేశాడు కనుక ఇదీ ఒక విజయమేనా? అని పాశ్చాత్య మీడియా విరుచుకుపడుతోంది. యునైటెడ్‌ రష్యా పార్టీకి యాభై ఎనిమిది శాతం ఓట్లు పోలైనట్టుగా రష్యా ఎన్నికల సంఘం చెబుతున్న లెక్కలు ఏ లెక్కన తప్పులతడకో అది విశ్లేషిస్తోంది. ఒక బలమైన, ప్రజాదరణ ఉన్న యుద్ధవ్యతిరేక పార్టీని పుట్టిన వెంటనే గిట్టేట్టుగా ఆయన న్యాయస్థానాల ద్వారా చేశాడని, ఇప్పుడు ఏవో నాలుగు చిన్నాచితకా పార్టీలు, అవి కూడా చట్టసభల్లో ప్రవేశించడానికి సరిపడా స్థానాలు గెలుచుకొనేట్టుగా ఎన్నికల రంగాన్ని తయారుచేశాడని, ఎన్నో అక్రమాలు, అన్యాయాలకు పాల్పడితే కానీ, ఈ గెలుపు సాధ్యంకాలేదని అంటోంది.

పుతిన్‌ విజయం ఆశ్చర్యం కలిగించదు అంటూ, రష్యాలో ఎన్నికలు జరిగినప్పుడల్లా అవి ఎంత బూటకమైనవో పాశ్చాత్య మీడియా దండెత్తడం కొత్తేమీ కాదు. పాతికేళ్ళకు పైగా ప్రధానిగానో, దేశాధ్యక్షుడుగానో రష్యాను ఏలుతున్న పుతిన్‌, తన రాజకీయ ప్రత్యర్థులను హతమార్చి, జైళ్ళలో కుక్కి, దేశం నుంచి తరిమికొట్టి, వెంటాడి వేధించి, ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించి రష్యాను నిరంకుశంగా ఏలుతున్నారని అవి ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటాయి. ఇప్పుడు, ఆయన ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్నాడు కనుక, ఈ ఫలితాల మీద మరింత ఘాటైన, లోతైన విమర్శలు వినబడటం సహజం. ఈ ఫలితాలు, అందునా, రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో కూడా దక్కిన సానుకూలత పుతిన్‌కు తిరుగులేని శక్తినిస్తుందని, ఆయన దమనకాండకు అడ్డూ ఆపూలేకుండా పోతుందని వాటి వాదన.


ఒకవేళ ఈ ఎన్నికల్లో నాలుగు ఓట్లు, కొన్ని సీట్లు తగ్గినా, యుద్ధరంగం నుంచి పుతిన్‌ వెనకడుగువేయరని, ఎన్నికల ఫలితాలు యుద్ధపరిణామాలను నిర్ణయంచబోవని అందరికీ తెలుసు. అయితే, ఉక్రెయిన్‌ అధ్యక్షుడుగా జెలెన్‌స్కీ ఉనికినే గుర్తించనిరాకరిస్తూ, చట్టబద్ధతలేని ఆయనతో గానీ, ఆయన ప్రభుత్వంతోగానీ నేరుగా సంప్రదింపులను రష్యా తిరస్కరిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు ఎన్నుకోని నాయకుడితో తాము అవగాహనకో, ఒప్పందానికో వచ్చి యుద్ధాన్ని ఆపేయడమంటూ జరగదని రష్యా అప్పుడప్పుడు, అవసరం మేరకు దబాయిస్తూ వస్తోంది. ఇవన్నీ ఉత్తిత్తిమాటలేనని, ఉక్రెయిన్‌ భూభాగాల్లోకి అనుకున్నంతమేర చొరబడేంతవరకూ రష్యా ఈ కబుర్లు చెబుతూనే ఉంటుందని అందరికీ తెలుసు. అయితే, 2022లో రష్యాతో యుద్ధం మొదలైన కారణంగా మార్షల్‌ లా అమలులోకి తెచ్చి ఉక్రెయిన్‌లో 2024లో జరగాల్సిన ఎన్నికలను జెలెన్‌స్కీ నిర్వహించలేదు. ఈ మార్షల్‌లా అమలులో ఉన్నంతకాలం ఆయన ఎన్నికలు జరపనక్కరలేదు. మరోపక్క, ఉక్రెయిన్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 108ప్రకారం మళ్ళీ ఎన్నికలు జరిగేవరకూ గత అధ్యక్షుడే కొనసాగుతాడన్న మినహాయింపు ఎలాగూ ఉన్నది కనుక, జెలెన్‌స్కీని వెనకేసుకొస్తూ రష్యా విమర్శలను పాశ్చాత్యదేశాలు కొట్టిపారేస్తూంటాయి. ఇప్పుడు ఒకపక్క యుద్ధంలో ఉంటూ కూడా రష్యా అధ్యక్షుడు ఎన్నికలు నిర్వహించి, ఘనవిజయం సాధించడంతో అతనిది నైతికంగా పైచేయి అవుతుందేమోనన్న భయాలూ అనుమానాలూ సహజం.

ఐదేళ్ళనాటి ఎన్నికల ఫలితాలతో పోల్చినా, యునైటెడ్‌ రష్యా పార్టీకి ఇప్పుడు మరో 9శాతం ఓట్లు పెరిగాయి కనుక, రష్యన్లంతా ఉక్రెయిన్‌మీద యుద్ధానికి అండగా నిలిచినట్టు పుతిన్‌ మద్దతుదారులు ప్రచారం చేసుకోవచ్చు. కానీ, ఈ సంక్షోభకాలంలో ప్రజలు ఎవరికి, ఎందుకు ఓటుచేసినా, యుద్ధం కొనసాగాలని కోరుకోరన్నది వాస్తవం. అది వేగంగా ముగిసి, జీవితాలు మళ్ళీ త్వరితగతిన గాడినపడాలనే రష్యన్లు ఆశిస్తున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం, పాశ్చాత్యదేశాల ఆంక్షలు రష్యాను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రజలు అష్టకష్టాల్లో ఉన్నారు. ఈ క్లీన్‌స్వీప్‌ను అడ్డుపెట్టుకొని కొత్త వీరంగాలు వేయడం సరికాదని పుతిన్‌ గుర్తుపెట్టుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

Updated Date - Sep 23 , 2026 | 12:56 AM