Share News

పాతమిత్రుల కొత్త ఆశలు!

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:31 AM

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్న పంజాబ్‌లో పాతపొత్తు తిరిగి కొత్తగా పొడిచింది. మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు...

పాతమిత్రుల కొత్త ఆశలు!

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్న పంజాబ్‌లో పాతపొత్తు తిరిగి కొత్తగా పొడిచింది. మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మహోద్యమాన్ని నడుపుతున్న తరుణంలో, వాటిని నిరసించకపోతే ఏకంగా ఉనికే కోల్పోతామన్న భయంతో ఎన్డీయే నుంచి శిరోమణీ అకాలీదళ్‌ తప్పుకుంది. మరో రెండేళ్ళకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేసిన అకాలీదళ్‌, బీజేపీ ఘోరపరాజయాన్ని చవిచూస్తే, ఆమ్‌ ఆద్మీపార్టీ (ఆప్‌) భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కలివిడిగా నడిస్తే అధికారానికి చేరువకావచ్చునని ఈ రెండు పార్టీల ఆశ.

రైతు ప్రయోజనాల పరిరక్షణకే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని చెప్పిన అకాలీదళ్‌ నాయకులు ఇప్పుడు రైతులకు మోదీ ఏమి మేలు చేశారని తిరిగి చేతులు కలిపారని రైతు నాయకులు ప్రశ్నిస్తున్నారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఈ కలయికను అవకాశవాదం అంటున్నాయి. ఇది రాజకీయ పొత్తు కాదని, సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో శాంతిభద్రతలు క్షీణించి, గ్యాంగుల సంస్కృతి పెరిగిపోయిన రీత్యా దేశశ్రేయస్సుకు అత్యవశ్యకమైన అనుబంధమని అమిత్‌ షా నిర్వచించారు. హిందూ–సిఖ్‌ సోదరభావాన్ని బలోపేతం చేసే చర్యగా దీనిని అభివర్ణించారు. ఈ పొత్తులో అకాలీదళ్‌దే పెద్దన్న పాత్ర అనీ, ముఖ్యమంత్రి పదవి దానికే దక్కుతుందని అమిత్‌ షా స్పష్టం చేశారు.

117 స్థానాలున్న అసెంబ్లీలో నెగ్గుకురావడానికి బీజేపీ అకాలీదళ్‌కు పొత్తు అవసరం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో దెబ్బతిన్న ఈ కూటమి మరో రెండేళ్ళకు వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ చతికిలబడింది. తదనంతరం సాగుచట్టాలు అవకాశంగా వాడుకొని అకాలీలు ఆ పొత్తు తెంపేసుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఏకంగా 92స్థానాలు నెగ్గి ఎదురులేని శక్తిగా నిలిచింది. ఆ ఎన్నికల్లో అకాలీలకు మూడు, బీజేపీకి రెండుస్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసిపోటీచేసినప్పుడు పదిశాతంలోపు ఓట్లు గెలుచుకున్న బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటిరిగా పోరాడి 18శాతాన్ని దాటింది. ఈ విజయగర్వం బీజేపీలో ఉంటుందన్న భయంతోనే సీఎం కుర్చీ విషయంలో అకాలీలు ముందుగానే అమిత్‌షానుంచి మాట తీసుకున్నారు. అయితే, గతంలో 23స్థానాల్లో పోటీచేసిన బీజేపీ ఈ మారు రెట్టింపు డిమాండ్‌ చేసే ఆలోచనలో ఉన్నదని, సభలో దాదాపు సగంసీట్లు దానికి కేటాయించడం అకాలీలకు పెద్ద సమస్య అవుతుందని విశ్లేషకుల వాదన.


అయితే, గత లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ తన ఓటుబ్యాంకును మూడురెట్లు పెంచుకున్నప్పటికీ, ఒక్క స్థానాన్ని కూడా నెగ్గలేకపోయింది. దాని ఓట్లు ప్రధానంగా పట్టణ, హిందూ ఓటర్లవి. గ్రామీణ ప్రాంతాల్లో దాని బలం దాదాపు శూన్యం. పంజాబ్‌లో డెబ్బయ్‌ నియోజకవర్గాలు అక్కడే ఉన్నాయి. దీనికితోడు, సాగుచట్టాలను తెచ్చిన అపకీర్తి ఆ పార్టీని ఇంకా వెంటాడుతూనే ఉంది. మోదీ ప్రభుత్వం ఆ తరువాత వాటిని రద్దుచేసినప్పటికీ రైతులు, మరీముఖ్యంగా జాట్‌సిఖ్‌ ఓటర్లకు బీజేపీమీద కోపం తగ్గలేదు. అందువల్ల అకాలీదళ్‌ సాయం లేకుండా ఓ నాలుగుస్థానాలు గెలుచుకోవడం దానికి అసాధ్యం. గత నాలుగేళ్ళలో కాంగ్రెస్‌, అకాలీదళ్‌, ఆప్‌నుంచి అనేకమంది ప్రముఖనాయకులను బీజేపీ‍ చేర్చుకుంది. సునీల్‌ జాఖడ్‌, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ వంటివారు వచ్చినప్పటికీ ఎన్నికల క్షేత్రాన్ని తమకు అనుకూలంగా మార్చలేకపోయారని గ్రహించే బీజేపీపెద్దలు అకాలీలతో రాజీకి వచ్చివుంటారు. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా విశ్లేషించి రేపటి ఎన్నికల్లో కలిసిపోటీచేస్తే 58స్థానాలు దక్కవచ్చునని ఈ కూటమి అంచనాలు కట్టుకుంది. అంటే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజారిటీ లభించవచ్చు లేదా సమీపానికి చేరువకావచ్చు అని వాటి నమ్మకం. గ్రామీణప్రాంతాల్లో అకాలీలకు, పట్టణాల్లో బీజేపీకీ ఆదరణ ఉన్నమాట నిజమే. అయినప్పటికీ, పార్టీలు చేతులు కలిపినంతమాత్రాన ఓటర్ల మనసులు మారిపోతాయని, కరిగిపోతాయని చెప్పలేం. ఆప్‌ ఇంకా బలమైన శక్తిగానే ఉంటూ ప్రధాన పోటీ దానికీ కాంగ్రెస్‌కూ మధ్యేనని అంతా అనుకుంటున్న తరుణంలో ఈ పొత్తు పొడిచింది. అసెంబ్లీ ఎన్నికలకు అర్నెల్లదూరం కూడా లేనందున ఈ కలయిక ఏ మాయచేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..

అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..

Updated Date - Nov 27 , 2026 | 02:31 AM