Share News

సంకేతాలు సందేశాలు

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:14 AM

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్న పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజల నాడిని కొంతమేరకు పట్టిస్తున్నాయి. పంజాబ్‌లో అధికారంలోకి రాగలననీ, హిమాచల్‌లో...

సంకేతాలు సందేశాలు

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్న పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజల నాడిని కొంతమేరకు పట్టిస్తున్నాయి. పంజాబ్‌లో అధికారంలోకి రాగలననీ, హిమాచల్‌లో అధికారాన్ని నిలబెట్టుకోగలననీ భావిస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు సానుకూలంగా లేవు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల్లో దాదాపు సగం స్థానాలు దక్కాయి. ఆప్‌ను దెబ్బతీయగలనని అనుకున్న కాంగ్రెస్‌ దానికంటే సగం తక్కువ స్థానాలతో సరిపుచ్చుకోవలసి వచ్చింది. అదేవిధంగా, తాను అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో నాలుగు కార్పొరేషన్లలో మూడింటిని బీజేపీకి కోల్పోయింది. పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారపక్షం జోరు ప్రదర్శించలేకపోవడం ప్రధానంగా ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖూకు ఇబ్బందికరమైన స్థితి.

ఏడుగురు రాజ్యసభ సభ్యుల ఫిరాయింపులు, అవినీతి ఆరోపణలతో కష్టాల్లో ఉన్న కేజ్రీవాల్‌ పార్టీకి పంజాబ్‌ స్థానిక సంస్థల ఫలితాలు పెద్ద ఊరట. గరిష్ఠ వాటా సాధించడమే కాక, కాంగ్రెస్‌ను బాగా వెనక్కు నెట్టగలిగింది. నిరంతరం వివాదాల్లో ఉండే ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ తన పాలనకు తిరుగులేదని, పట్టు చెదరలేదని చెప్పుకోవచ్చు. నాలుగేళ్ళక్రితం భారీ మెజారిటీతో అధికారంలో వచ్చిన తమ పార్టీ ఇప్పటికీ కార్యక్షేత్రంలో బలంగా ఉన్నదనీ, ప్రజలు సంతృప్తిగా ఉన్నారనీ ప్రచారం చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్‌ అని ఆప్‌ నాయకులు ఈ విజయోత్సాహంలో చెప్పుకుంటున్నారు. అయితే, 2021లో కాంగ్రెస్‌ కూడా ఇదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసి, కొన్ని నెలల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. అందువల్ల, తాను అధికారంలో ఉన్న ఈ ఏకైక రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం ఆప్‌కు ఎంతో ముఖ్యం. ఉత్తర భారతంలో ఈ విపక్షపాలిత అతిపెద్ద రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ ముందస్తు వ్యూహాలతో, ప్రణాళికలతో సిద్ధంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల రంగంలో నామమాత్రంగానే ఉన్నప్పటికీ, గత ఏడాది ఢిల్లీలో జరిపినకంటే రాజకీయంగా అతి పెద్దయుద్ధం పంజాబ్‌లో చేయబోతున్నది. జాట్‌ సిక్కు అయిన కేవల్‌ సింగ్‌ ధిల్లాన్‌ను పంజాబ్‌ బీజేపీ అధ్యక్షుడుగా నియమించడం ద్వారా, తాను సంప్రదాయ హిందూ ఓటు బ్యాంకును దాటి వెడుతున్న సందేశాన్ని ఇచ్చింది. శిరోమణి ఆకాలీదళ్‌ కూడా బీజేపీతో మళ్ళీ చేయి కలపవచ్చునని అంటున్నారు. వ్యవసాయ చట్టాలకు తొలుత మద్దతు ఇచ్చి, ఆ తరువాత నాలుక కరుచుకొని బీజేపీకి దూరం జరిగినా పంజాబ్‌ ప్రజల ఆదరణ కోల్పోయిన ఆకాలీదళ్‌కు మార్గాంతరం కూడా లేదు. ఇక, ప్రస్తుతం బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తున్న ఉత్తర భారతంలో తన ఉనికిని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక అవకాశం పంజాబ్‌. మాదకద్రవ్యాలు, ముఠాలు, శాంతిభద్రతల పరిరక్షణ, పాలనాపరమైన వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, పార్టీలో అంతర్గత పోరాటాలు, సమిష్టి నాయకత్వ లోపం కారణంగా ప్రజల్లో అసంతృప్తిని ఓట్లుగా మలుచుకోవడంలో అది విఫలమవుతోంది. పంజాబ్‌లో ప్రస్తుతానికి ఆప్‌దే పైచేయి కావచ్చును కానీ, అసెంబ్లీ ఎన్నికల నాటికి అమరీందర్‌ సింగ్‌ వంటివారి కొత్త ఎత్తుగడలు ఈ పరిస్థితులను మార్చేయవచ్చునని అంటున్నారు.


సంస్థాగత బలంకంటే స్థానిక అంశాలు, నాయకుల ప్రభావం వల్లనే బీజేపీ విజయాలు సాధించగలిగిందనీ, మరీ ముఖ్యంగా, కాంగ్రెస్‌ మూలాలున్న తిరుగుబాటుదారులవల్లనే బీజేపీకి ఈ విజయాలు దక్కాయని హిమాచల్‌ ముఖ్యమంత్రి వాదన. అయితే, ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నదనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రాబోతున్నదనీ బీజేపీ ప్రచారం చేసుకోవడానికి ఈ ఫలితాలు ఉపకరించాయి. నిజానికి గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కూడా ఇలాగే పలు కార్పొరేషన్లలో విజయం సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు చెప్పుకోదగ్గవే కానీ, యభైమూడు పట్టణ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌ 29ని గెలుచుకొని, ముఖ్యమైన ప్రాంతాలను నిలబెట్టుకున్నమాట వాస్తవం. వైఫల్యాలపై ఆత్మపరిశీలన చేసుకొని, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావడానికి క్షేత్రస్థాయిలో దానికి ఇంకా అనేక అవకాశాలున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

యూఎస్‌లో 30 మంది భారతీయుల అరెస్ట్

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 12:14 AM