మతవివాదంలో మాన్!
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:47 AM
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్న తరుణంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, అది ఫేక్ అంటూ ఆయన చేసిన వాదనను...
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్న తరుణంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, అది ఫేక్ అంటూ ఆయన చేసిన వాదనను సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక, మత సంస్థ అకాల్‌తఖ్త్ తిరస్కరించి, ఆయనను ‘గురుద్రోహి’గా ప్రకటించింది. సిక్కు గురువుల చిత్రపటాలపై భగవంత్ మాన్ మద్యం చల్లుతున్నట్టుగా ఉన్న ఆ వీడియో కృత్రిమమేథతో సృష్టించినదని, అందులో ఉన్న వ్యక్తి కొలతలకూ తనకూ పోలికే లేదని ఆకాల్‌తఖ్త్ ముందు మాన్ వాదించారు. కానీ, ఐదుగురు సింగ్ సాహెబ్‌ల సమావేశం ఆయనను దోషిగా నిర్థారించింది. భారత ప్రభుత్వం గుర్తించిన రెండు అత్యున్నతస్థాయి ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో ఆ వీడియోను పరీక్షిస్తే అది నకిలీది కాదని, ఏఐతో రూపొందించలేదని నిర్ధారణ అయిందంటూ గురుద్రోహి మాన్‌తో సిక్కు సమాజం ఏ సంబంధాలూ పెట్టుకోకూడదని అకాల్‌తఖ్త్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా వెలివేయడంతో పాటు, ఆప్ ప్రభుత్వం ఇటీవల చేసిన ఒక చట్టంమీద వివరణ కోరుతూ మొత్తం మంత్రివర్గాన్ని, అన్ని పార్టీలకు చెందిన సిక్కు ఎమ్మెల్యేలను ఈనెల 29న తమ సమక్షంలో హాజరుకావాలని ఆకాల్‌తఖ్త్ ఆదేశాలు జారీచేసింది. గురుగ్రంథ్ సాహెబ్‌ను అవమానపరచినవారికి శిక్షలు విధించే ఈ చట్టాన్ని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ)ని సంప్రదించకుండా తేవడం వెనుక పంథ్‌ను చీల్చే, దాని అధికారాలను లాక్కొనే దురుద్దేశాలు ఉన్నాయన్నది అకాల్‌తఖ్త్ వాదన. మాన్‌ను అది ‘పంథ్ విరోధి’గా ప్రకటించింది. మతపెద్దల ఆదేశాలు, ఆగ్రహాలు మాన్ ప్రభుత్వాన్ని తక్షణం కూల్చకపోయినా, మతంతో ముడిపడిన ఈ వివాదాన్ని మిగతాపార్టీలు చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే ఘనంగా ప్రకటించారు కూడా.
మాన్ రాజీనామా చేయాలని విపక్షం అంతా పట్టుబడుతోంది. మతంతో గేమ్స్ వద్దు, వెంటనే దిగిపో అని కాంగ్రెస్, బీజేపీ నాయకులు హితోపదేశం చేస్తున్నారు. చివరకు, ఇదే మతదూషణ నిందను గతంలో ఎదుర్కొని బాధలు పడ్డ బాదల్ కూడా ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటున్నారు. అకాల్ తఖ్త్ సాహెబ్ సర్వోన్నత అధికారాన్ని గౌరవించి తప్పుకో, లేదా మళ్ళీ మరో నేరం చేసినవాడవవుతావని హెచ్చరిస్తున్నారు. మాన్ ఎన్ని వివరణలు ఇచ్చినా, అకాల్‌తఖ్త్ చర్యలు ఆయన ప్రభుత్వంమీద తీవ్ర ఒత్తిడి పెంచాయి. సజీవ గురువుగా సిక్కులు గౌరవించే గురుగ్రంథ్ సాహెబ్ అపవిత్రం కాకుండా నిలువరించడానికి ఒక సవరణ చట్టాన్ని తెచ్చి కూడా ఆయన మత పెద్దల ఆదరణ పొందలేకపోయారు. అకాల్‌తఖ్త్‌లో కొందరు తనకు వ్యతిరేకంగా ఈ కుట్ర చేశారని ఆయన వాదన. ఆ పీఠాన్ని గౌరవిస్తున్నట్టుగా మాట్లాడుతూనే, ఈ పరిణామాన్ని పెద్దగా పట్టించుకోనట్టుగా నటిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఆయన ప్రజలకే జవాబుదారీ కానీ, ఆకాల్‌తఖ్త్‌కు జడవాల్సిన అవసరం కూడా లేదు. కానీ, అంతిమంగా ఓటర్లు ఈ ‘గురుద్రోహి’ విషయంలో ఎలా ఆలోచిస్తారన్నదే ముఖ్యం.
ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం అకాల్‌తఖ్త్ తన ముందుకు రమ్మంటూ ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ, గవర్నర్, న్యాయస్థానాలు, రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళని ఈ మతపీఠం తనకు సమాధానం చెప్పుకోవాలని అంటోంది. గురుగ్రంథ్ సాహెబ్ గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టాల్సిన ఆ సంస్థ సదరు చట్టం బలహీనంగా ఉన్న పక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, దానిని అపవిత్రం చేసే చర్యల నిరోధానికి మరింత గట్టిగా కృషిచేయమని కోరవచ్చు. కానీ, అత్యంత కఠినమైనదిగా పలువిమర్శలు ఎదుర్కొన్న ఓ చట్టాన్ని అది కేవలం తమ అధికారాలను బలహీనపరుస్తుందన్న అనుమానంతో తప్పుబడుతోంది. దాని రూపకల్పనలో పాలుపంచుకున్నవారందరినీ తనముందుకు వచ్చి సమాధానం చెప్పుకోవాలని అంటోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గతంలో ఆకాల్‌తఖ్త్ చర్యలూ, నిర్ణయాల కారణంగా దెబ్బతిన్న వారు సైతం ఇటువంటి సందర్భాలు తలెత్తినప్పుడల్లా మళ్ళీ దానినే సమర్థించుకురావడం. ఇక, మాన్ అంతిమంగా ఓటర్ల మనసు గెలుచుకుంటారో లేదో వచ్చే ఏడాది మాత్రమే తేలుతుంది.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్