చిత్తశుద్ధి లేని చర్య
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:46 AM
దగ్గుమందు, ఇతర సిరప్‌ల అమ్మకాలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇటీవల కఠినతరం చేసింది. డాక్టర్ చీటీ లేనిదే ఇకపై వీటిని కొనుగోలుచేయడానికి వీలుండదు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, సిరప్‌ల దుర్వినియోగాన్ని...
దగ్గుమందు, ఇతర సిరప్‌ల అమ్మకాలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇటీవల కఠినతరం చేసింది. డాక్టర్ చీటీ లేనిదే ఇకపై వీటిని కొనుగోలుచేయడానికి వీలుండదు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, సిరప్‌ల దుర్వినియోగాన్ని నివారించడం ఇత్యాది పలు రకాల లక్ష్యాలు, ఆశయాలతో నిబంధనల్లో మార్పులు చేసినట్టుగా ప్రభుత్వం తెలియచేసింది. లైసెన్సు ఉన్న ఫార్మసీలు, మెడికల్ షాపుల ద్వారానే ఇకపై ఈ రకం సిరప్‌ల అమ్మకాలు జరుగుతాయి. మెడికల్ షాపులో నేరుగా అడిగితీసుకోగలిగే సిరప్ ఇకపై వైద్యుడు చీటీ లేనిదే కొనితెచ్చుకోవడానికి అవకాశం ఉండదు. కల్తీ దగ్గుమందుల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లోనూ, ఇక్కడనుంచి ఎగుమతి అయిన వివిధ దేశాల్లోనూ పలువురు చిన్నారులు మరణించిన నేపథ్యంలో, కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
దగ్గు, జలుబు సిరప్పులను వైద్యుడి సలహాలు సూచనలతో నిమిత్తం లేకుండా, ఆ అనారోగ్యస్థితి ఎందుకు ఏర్పడిందన్న అవగాహనసైతం లేకుండా నేరుగా మెడికల్ షాపునుంచి తెచ్చుకొని వాడేయడం మన దేశంలో అత్యధికులకు అలవాటే. ఈ చిన్నచిన్న సమస్యలకు కూడా డాక్టర్ వద్దకు ఎందుకన్న భావనతో పాటు, వైద్యుల దగ్గరకు వెళ్ళే ఆర్థిక స్థోమత లేకపోవడం కూడా ఓ కారణం. చీటీ లేకుండా అత్యధిక ఔషధాలను అమ్మడం, కొనడం మనదేశంలో అతిసులభం. ప్రభుత్వం ప్రస్తుత ఆదేశాలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాయని, ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ) అమ్మకాలకు వీల్లేకుండా చేయడం వల్ల ఈ సిరప్పుల దుర్వినియోగాన్ని నివారించడం సాధ్యపడుతుందని వైద్యులు, వైద్యసంఘాలు మెచ్చుకుంటున్నాయి. అనేకమంది పిల్లలు, పెద్దల ప్రాణాలను ఈ చర్య కాపాడుతుందని అసోసియేషన్లు అంటున్నాయి. అధికశాతం సిరప్పులు శరీరంపై అత్యంత తీవ్రమైన ప్రభావం చూపే పదార్థాలతో తయారవుతాయి కనుక, డాక్టర్ కనుక సూచిస్తే వాటిని వాడవచ్చునని అర్థం.
ఈ చర్య వెనుక కారణాలకు ఇది సరైనమందు కాదని తప్పుబడుతున్నవారూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో మధ్యభారతంలో దాదాపు ఇరవైమంది పిల్లల మృతికి కారణమైన కోల్డరిఫ్ అనే దగ్గుమందు వైద్యుడి చీటీమేరకు ఆ తల్లిదండ్రులు కొనుగోలు చేసిందే. అత్యంత హానికరమైన స్థాయిలో 48 శాతానికి పైగా డైఎథిలీన్ గ్లైకాల్ ఉపయోగించి తయారుచేసిన సిరప్ ఇది. పిల్లలు కన్నుమూసిన తరువాత, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగితే కాంచీపురంలోని శ్రేసన్ ఫార్మాలో ఈ మందు ఎలా తయారవుతున్నదో కళ్ళారాచూసి అధికారులు నిర్ఘాంతపోయారు. ఫార్మారంగంతో సంబంధం లేని కార్మికులు తుప్పుపట్టిన పరికరాలు వాడుతూ, గ్లౌజులు, మాస్కులు లేకుండా గ్యాస్‌స్టవ్‌లపైన రసాయనాలు వండుతున్నారనీ, అపరిశుభ్రమైన నీరు, దుమ్మూ ధూళి కలగలసిన వాతావరణంలో ఆ సిరప్పులు తయారవుతున్నాయని అధికారులు గమనించారు. ఈ మందులో వినియోగించే రసాయనాలను పెయింట్ పరిశ్రమ డీలర్లనుంచి కొనుగోలు చేసి, కచ్చితంగా తూచకుండా, చేతికి వచ్చినంత కలిపివేస్తున్నారని అధికారులు గ్రహించారు. కోల్డరిఫ్ తయారీలో ఈ సంస్థ నలభై అతికీలకమైన ఉల్లంఘనలకు పాల్పడిందని, వందలాది నిబంధనలను కాలదన్నిందని అప్పుడు తెలిసొచ్చింది. సదరు కంపెనీమీద తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేయడం వంటి తదనంతర ఉపరితల విన్యాసాలను అటుంచితే, ఈ సందర్భంగా వైద్యుల సంఘం వేసిన ప్రశ్న అత్యంత విలువైనది. ఒక అనుమతిపొందిన కంపెనీ తయారుచేసి, అన్ని అనుమతులూ ఉన్న గొలుసుకట్టు విధానం ద్వారా లైసెన్సున్న మందుల షాపుకు చేరిన ఈ దగ్గుమందును, ప్రభుత్వ గుర్తింపు గల ఒక వైద్యుడు చీటీమీద రాస్తే అతడిని ఎలా అరెస్టుచేస్తారని ఆ సంఘం ప్రశ్నించింది. చవుకబారు రసాయనాలతో, తప్పుడు విధానాలతో ఒక నాణ్యతలేని, అత్యంత హానికరమైన మందు తయారుచేసి, అత్యధికధరకు దానిని విక్రయిస్తున్న ఆ కంపెనీ తాను నొల్లుకున్న సంపాదనలో వైద్యులు, అధికారులకు అత్యధిక వాటా పంచుతున్నదని గుర్తించాలి. నాసిరకం రసాయనాల వాడకం నుంచి, తయారీ, పంపిణీ వంటి ప్రతీ దశా అక్రమాల పుట్ట. రాజకీయనాయకుల ఆశీస్సులు, అధికారుల సహకారంతో ఈ విషాలు తయారవుతూంటాయి. జమ్మూకశ్మీర్ సహా అనేక రాష్ట్రాల్లో చిన్నారులను ఈ తరహా మందులు చిదిమేసినా, ఆ తరువాత గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లోనూ మన దగ్గుమందు పెద్దసంఖ్యలో పసిప్రాణాలు తీసినా మనకు పట్టలేదు. అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిన తరువాత ఇప్పుడు చేపట్టిన దిద్దుబాటులో కూడా చిత్తశుద్ధిలేకపోవడం బాధాకరం.
ఇవి కూడా చదవండి..
దుర్గమ్మ భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలు: ఈవో శీనా నాయక్
యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి
Read Latest Telangana News And Telugu News