Share News

అణు‘సంధి’లో అవని

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:05 AM

మూడుదశాబ్దాలుగా అణుయుద్ధాన్ని వెనక్కునెట్టగలిగిన ఒక ఒప్పందం గడువుతీరి గాలికికొట్టుకుపోయినప్పుడు ప్రపంచానికి వెన్నులో భయం పుట్టడం సహజం. అమెరికా, రష్యాలను ఇంతకాలం...

అణు‘సంధి’లో అవని

మూడుదశాబ్దాలుగా అణుయుద్ధాన్ని వెనక్కునెట్టగలిగిన ఒక ఒప్పందం గడువుతీరి గాలికికొట్టుకుపోయినప్పుడు ప్రపంచానికి వెన్నులో భయం పుట్టడం సహజం. అమెరికా, రష్యాలను ఇంతకాలం కాలుదువ్వకుండా కట్టడి చేసిన ‘న్యూస్టార్ట్‌’ ఒప్పందం ఫిబ్రవరి 5న కాలగర్భంలో కలిసిపోయింది. భూమిమీద ఉన్న అణ్వాయుధాల్లో దాదాపు 90శాతం తమ ఆయుధగిడ్డంగుల్లో దాచుకున్న ఈ రెండుదేశాల మధ్య ఒక చట్టబద్ధమైన అడ్డంకి తొలగిపోయినందున ఇక అణుయుద్ధం తప్పదా? అని మీడియా అదేపనిగా అడుగుతోంది. అణ్వాయుధ నిల్వలపై పరిమితులు తొలగిపోయాయి కనుక, పరస్పరం పోటీపడుతూ ఆయుధాలు పోగేసుకొనే అవకాశాలు అధికం. ఒప్పందాన్ని మరో ఏడాది కొనసాగించడానికి అమెరికా గనుక ముందుకు వస్తే, తామూ సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆర్నెల్లముందే ఓ మాటన్నారు కానీ, అమెరికా అధ్యక్షులవారు నోరువిప్పలేదు. సరైన సమయంలో ఆయన సముచిత నిర్ణయాన్ని తీసుకుంటారని వైట్‌హౌస్‌ ప్రపంచానికి హామీ ఇచ్చింది కానీ, ఒప్పందం కాలగర్భంలో కలిసిపోవడానికే ట్రంప్‌ సాయపడ్డారు.

గడువు తీరినప్పటికీ, అమెరికా హద్దులు దాటనంతవరకూ తాము న్యూస్టార్ట్‌ పరిమితులు, నియమనిబంధనలకు లోబడే నడుచుకుంటామని రష్యా విదేశాంగమంత్రి బుధవారం కూడా మాటిచ్చారు. ట్రంప్‌ తెంపరితనం తెలిసిందే కనుక ప్రపంచానికి ఆయనమీదే అనుమానం. గత ఏడాది పుతిన్‌ ఎంతో చక్కగా ఒప్పందాన్ని కొనసాగించే ప్రతిపాదన చేస్తే, చైనాను చేర్చితేనే కొత్త ఒప్పందాలు, కొనసాగింపుల గురించి ఆలోచిస్తానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చైనా వెంటనే ఆ వ్యాఖ్యలను తిరస్కరించింది. పుతిన్‌ ప్రతిపాదించిన మరో ఏడాది గడువుకు రష్యా కట్టుబడివుంటుందని, అయితే, అమెరికా కూడా సదరు ఒప్పందం ఇంకా అమల్లో ఉన్నట్టుగానే వ్యవహరించాలని రష్యా అంటోంది. అబుదాభీలో గతవారం జరిగిన చర్చల్లో అమెరికా–రష్యాలు ఈ ఒప్పందాన్ని మరో ఆర్నెల్లు అనధికారికంగా పొడిగించాలని అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించే ప్రయత్నంలో భాగంగా అబుదాభీలో వరుసభేటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఒప్పందానికి అనధికారికంగా కట్టుబడటం జరిగేపని కాదని, అణ్వాయుధాల విషయంలో రాతకోతలు ఉండితీరాల్సిందేనని విశ్లేషకుల వాదన.


ఒకపక్క ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతున్న తరుణంలో, అణుకట్టడికి దోహదపడుతున్న ఒక బలమైన ఒప్పందం లేకపోవడం భయం కలిగించే అంశం. 2010లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్‌ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. నిక్సన్‌, బ్రెజ్నేవ్‌ల మధ్య 1972లో సాల్ట్‌–1తో మొదలైన వరుస ఒప్పందాల్లో ఇది ఆఖరుది. ఈ న్యూస్టార్ట్‌ కింద చేరోదేశం 700కన్నా ఎక్కువ క్షిపణులు, 1500 కన్నా ఎక్కువ అణ్వస్త్రాలను వినియోగానికి సిద్ధంగా నిల్వ ఉంచకూడదు. ఈ హద్దులు పాటిస్తున్నదీ లేనిదీ పరస్పరం తనిఖీచేసుకొనే అధికారాలు కూడా వాటికి దఖలుపడ్డాయి. ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభమైన ఏడాదికి, 2023 ఫిబ్రవరిలో, అమెరికామీదా, నాటోమీద తీవ్ర ఆగ్రహంతో పుతిన్‌ ఈ ఒప్పందానికి వీడ్కోలు చెప్పినా, నిబంధనలకు కట్టుబడివుంటామని హామీ ఇచ్చారు. అదే పుతిన్‌ ఆర్నెల్ల ముందుగానే ‘న్యూస్టార్ట్‌’ కొనసాగింపు గురించి ప్రతిపాదన చేసినా, అమెరికా అధ్యక్షుడు నోరువిప్పడం లేదు. దీనికితోడు, అమెరికా మళ్ళీ అణుపరీక్షలకు సిద్ధం కావాలని వ్యాఖ్యానించి ఈ మధ్యనే ప్రపంచాన్ని భయపెట్టారు కూడా.

తమ దేశ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి అన్ని మార్గాలనూ వాడుకుంటామని ఉక్రెయిన్‌ దండయాత్రలో ఉన్న పుతిన్‌ కూడా అదేపనిగా హెచ్చరిస్తున్నారు. 2024లో అణ్వాయుధాలను సైతం వినియోగించగలిగే ఒక ఆదేశంమీద ఆయన సంతకం కూడా చేశారు. కొన్ని కొత్తరకం అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఉపరితలంలో అంత ప్రమాదం ఏమీలేనట్టు కనిపిస్తున్నా, రేపటిరోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం. శాంతి ఒప్పందం ఎన్నటికీ కుదరని, యుద్ధం ఎంతకూ ఆగని వాతావరణంలో అగ్గి మరింత రాజుకొని ఎవరైనా కట్టుతప్పవచ్చు. జూన్‌లోగా యుద్ధం ఆగిపోవాలని ట్రంప్‌ బలంగా కోరుతున్నట్టు ఉక్రెయిన్‌ అధినేత అంటున్నారు కానీ, అత్యంత కఠినమైన రష్యా డిమాండ్లను పశ్చిమదేశాలు అంగీకరించినప్పుడే అది ఆచరణ సాధ్యమవుతుంది. దశాబ్దాల భయంనుంచి ప్రపంచాన్ని బయటపడవేసిన న్యూస్టార్ట్‌ ఒప్పందం కూలిపోయి ప్రపంచం ప్రస్తుతం ఒక ప్రమాదకర దశలో ఉంది.

ఇవి కూడా చదవండి..

వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. జనగణమన కంటే ముందే వందేమాతరం ఆలాపన

ఎప్‌స్టీన్‌ను కలిసాను కానీ.. రాహుల్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పూరి

Updated Date - Feb 12 , 2026 | 02:05 AM