Share News

నవ నేపాల్‌

ABN , Publish Date - Mar 11 , 2026 | 02:16 AM

ఇది జెన్‌జీ విజయం అంటున్నారంతా. నేపాలీలు గత పాలకులపట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో బాలెన్‌షా ఘనవిజయం స్పష్టంగా తెలియచెబుతోంది. ఒక పార్టీ మూడింట రెండువంతుల మెజారిటీతో...

నవ నేపాల్‌

ఇది జెన్‌జీ విజయం అంటున్నారంతా. నేపాలీలు గత పాలకులపట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో బాలెన్‌షా ఘనవిజయం స్పష్టంగా తెలియచెబుతోంది. ఒక పార్టీ మూడింట రెండువంతుల మెజారిటీతో అధికారంలోకి రావడమన్నది ఆ దేశం ఎన్నడూ చూడనిది. పదిహేడేళ్ళ ప్రజాస్వామ్య చరిత్రలో ‍, చివరకు 2008లో ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన మావోయిస్టులకు కూడా దక్కనంత అపూర్వమైన ప్రజాదరణ రాష్ట్రీయ స్వతంత్రపార్టీకి లభించింది. ఆ పార్టీ అధ్యక్షుడు రబీ లామిచేని, కాబోయే ప్రధాని బాలెన్‌షాలను భారతప్రధాని నరేంద్రమోదీ అభినందించి, పరస్పర సహకారంతో కలసి సాగుదామనడం, వారిద్దరూ చక్కగా, సానుకూలంగా ప్రతిస్పందించడం బాగుంది.

సినిమా ఆఖరుఘట్టంలో దుష్టనాయకులను జనం తరిమితరిమికొట్టినట్లుగా నేపాల్‌ ప్రజలు తమకు నచ్చనివారిని అవమానకరమైన రీతిలో దింపేశారు. ఇది క్షణికావేశమనీ, సోషల్‌మీడియా నిషేధం ద్వారా ఖడ్గప్రసాద్‌ శర్మ ప్రభుత్వం కొరివితో తలగోక్కుందని అంతా అనుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసిన సోషల్‌ మీడియా సంస్థలను చూసీచూడనట్టుగా వదిలివేసి ఉంటే నేపాల్‌లో ఏ మార్పూ ఉండేది కాదా? అన్నది అటుంచితే, ప్రజల్లో ఏళ్ళతరబడి గూడుకట్టుకొని ఉన్న నిరాశానిస్పృహలు ఒక్కసారిగా పెల్లుబుకడానికి ఆ నిషేధం దోహదం చేసింది. పాలకులు తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నా, వీధుల్లోకి వచ్చిన జనం నాయకులను దించేసేవరకూ వెనక్కుపోలేదు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్నవారిని ఒక మహోద్యమంతో స్వల్పకాలంలోనే గద్దెదించేసిన ప్రజలు తగిన విచక్షణతో సరైనవారిని ఎన్నుకోగలరా? అన్న ప్రశ్నకు సమాధానంగా నేపాలీలు ఇప్పుడు బాలెన్‌షాను ముందుకు తెచ్చారు. పాతతరాన్ని వెనక్కునెట్టి, నవనాయకత్వాన్ని అధికారంలో కూచోబెట్టుకున్నారు.


బాలెన్‌ సారథ్యంలో నేపాల్‌ ఒక కొత్త ప్రయాణం ఆరంభించింది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, పహాడీలు, మధేశీలు అంటూ ఒక విభజన ఉండేది. ఇప్పుడు కొండ, లోయ ప్రాంతాలవారిద్దరూ ఒక్కటిగా బాలెన్‌కు పట్టం కట్టారు. మధేశీ, మైథిలీ మూలాలున్న వ్యక్తి ప్రధాని కావడం కూడా ఇదే మొదటిసారి. జెన్‌జీ ఉద్యమానికి నాయకత్వం వహించి నేపాలీలందరినీ ఏకతాటిపై నిలబెట్టడమేకాక, ఎన్నికలకు రెండునెలల ముందే ఆర్ఎస్‌పితో చేయి కలిపి దానికి ఘనవిజయాన్ని చేకూర్చడం విశేషం. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఇతరత్రా చిన్నా చితకా పార్టీలన్నీ ఒక్కటై బాలెన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాయన్న భయం కూడా ప్రజల్లో ఉన్నందునే ఆయనకు ఇంతటి ఘన విజయం చేకూరి ఉంటుంది. జెన్‌జీ ఉద్యమం దెబ్బకు కకావికలైన నాయకులంతా తిరిగి ఎన్నికల బరిలో నిలవడం, పార్టీ అంతర్గత సంస్కరణల పేరిటా, హామీల పేరిటా మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేయడంతో, ఎన్నికల అనంతరం వీరంతా ఒక్కటై తమ నెత్తిన కూచోకుండా ప్రజలు ముందుగానే జాగ్రత్తపడ్డారని అర్థం.

అనాదిగా సంకీర్ణ ప్రభుత్వాలనే అనుభవిస్తూ వచ్చిన నేపాలీలు ఇకపై ఆ అవసరమే లేని ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఆయా రాజకీయపార్టీల మధ్య కుట్రలకు, వాటి నాయకుల మధ్య వెన్నుపోట్లకు తావులేకుండా చేశారు. అత్యంత కీలకమైన, విధానపరమైన నిర్ణయాలకు మోకాలడ్డుతూ తమదే పై చేయి కావడంకోసం ప్రజావ్యతిరేకంగా వ్యవహరించే పార్టీలకు స్వస్తిపలికారు. దశాబ్దంన్నరకు పైగా ఏ ఒక్క ప్రభుత్వమూ ఐదేళ్ళకు మించి నిలవని దేశంలో ఒక పార్టీకి కనీవినీ ఎరుగనంత మెజారిటీ కట్టబెట్టి సుస్థిరత సాధించుకున్నారు.

ఒక గాయకుడు, ఒక టీవీస్టార్‌ చేయీచేయీ కలిపి అధికారంలోకి రావడం బాగున్నది కానీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించడమే పెద్ద సవాల్‌. పాలనానుభవం లేని ఈ యువనాయకుల మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. పదిహేడేళ్ళుగా తమను మోసం చేస్తున్న నాయకుల మాదిరిగా వీరు వ్యవహరించబోరని, తమను అష్టదరిద్రాలనుంచి బయటపడవేస్తారని జనం ఆశిస్తున్నారు. ప్రజలు ఎక్కువ కాలం ఓపికగా నిరీక్షించలేరన్న మాట నిజమే కానీ, వారి ఆశలన్నీ నెరవేర్చలేకపోయినా, అవినీతి, ఆశ్రితపక్షపాతాలకూ ఖర్చుదారీ విధానాలకూ దూరంగా ఉంటూ దేశాన్ని క్రమంగా గాడినపెట్టడానికి వీరిద్దరూ ప్రయత్నిస్తే అంతే చాలు. అధికారంలోకి రావడంకోసం అతివేగంగా ఒక్కటైన ఈ నాయకులు ఇద్దరూ రేపటిరోజుల్లో తమ మధ్య తలెత్తే విభేదాలను త్వరితంగా పరిష్కరించుకుంటూ ఐదేళ్ళూ కొనసాగడం మరింత ముఖ్యం.

ఇవి కూడా చదవండి..

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం... ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమల్ ఖరాజీ

నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 11 , 2026 | 02:16 AM