Share News

మరో బుల్డోజర్‌..!

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:52 AM

విదేశీ విరాళాల చట్టం సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని, పార్లమెంట్‌లో దానిని మూకబలంతో ముందుకు నెట్టే ప్రయత్నాలు చేయవద్దని...

మరో బుల్డోజర్‌..!

విదేశీ విరాళాల చట్టం సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని, పార్లమెంట్‌లో దానిని మూకబలంతో ముందుకు నెట్టే ప్రయత్నాలు చేయవద్దని విపక్షం కోరుతోంది. దేశభద్రత రీత్యా విదేశీవిరాళాలను నియంత్రించే, క్రమబద్ధీకరించే అధికారాలు కేంద్రానికి ఉన్నప్పటికీ, ఈ బిల్లుద్వారా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలు సహేతుకమైన పరిధిని దాటి, విపరీతమైన నియంత్రణకు, మితిమీరిన దుర్వినియోగానికీ వీలుకల్పిస్తున్నాయని విపక్షాల వాదన. పార్టీలే కాదు, ప్రభుత్వేతర సంస్థల నుంచి పౌరహక్కుల సంఘాలవరకూ అంతా అభ్యంతరపెడుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా ముందుకు పోతోంది.

ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం చేపట్టబోయే ఒక ప్రక్రియపట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. కేంద్రప్రభుత్వం ఏ కారణంచేతనైనా రిజిస్ట్రేషన్‌ నిలిపివేసిన, రద్దుచేసిన లేదా పొడిగించకుండా వదిలేసిన ఒక స్వచ్ఛంద సంస్థ అప్పటివరకూ సేకరించిన విదేశీ నిధులతో ఏర్పాటు చేసుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు ఈ బిల్లు రంగాన్ని సిద్ధం చేస్తోంది. సదరు ఎన్జీవో ఆస్తిపాస్తుల స్వాధీనం, నిర్వహణ, విక్రయం ఇత్యాది సర్వాధికారాలను దఖలుపరుచుకున్న శక్తిమంతమైన అథారిటీ ఒకటి ఏర్పడబోతోంది. సర్వసాధారణంగా పూర్తి విదేశీనిధులతోనే ఎన్జీవోల ఆస్తులు ఏర్పడవు. ఇక్కడి సమాజం నుంచి సేకరించిన విరాళాలు కూడా అందులో ఉంటాయి. కానీ, ఒక సంస్థ ఆస్తిపాస్తులను మొత్తంగా చేపట్టగల అధికారం ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి దక్కితే స్థానిక ఆస్తులకు కూడా రక్షణలేకుండా పోయినట్టే. న్యాయప్రక్రియలు, పర్యవేక్షణలు లేకుండా, ఆస్తులను స్వాధీనం చేసుకోగల విశేషాధికారాలను ఈ బిల్లు ద్వారా కేంద్రం దఖలుపరుచుకోబోతోంది.


అవును, విదేశీ నిధులతో ఈ దేశంలో బలవంతపు మతమార్పిడులకు పాల్పడేవారికీ, విరాళాలు తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవిస్తున్నవారికీ ఈ బిల్లు ప్రమాదకరమైనదే అని కేంద్రమంత్రి నిత్యానంద రాయ్‌ ఒక కఠినమైన, ప్రజాకర్షక వ్యాఖ్య చేశారు. మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న, దేశప్రయోజనాలకు విరుద్ధమైన పనులు చేస్తున్న సంస్థలమీద చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోక కొత్తవి తెస్తున్నారట. గత పదేళ్ళకాలంలో ప్రభుత్వేతర సంస్థలతో నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంత నిర్దయగా, నిరంకుశంగా వ్యవహరించిందో తెలిసిందే కనుక, ఈ బిల్లు మీద ఉన్న భయాలను అర్థం చేసుకోవచ్చు. ఎఫ్‌సిఆర్‌ఏ చట్టానికి ఆరేళ్ళనాటి సవరణలతో మరింత పదునుబెట్టి దానిని ప్రభుత్వం ఏ విధంగా వాడుతోందో ఇటీవలి సోనమ్‌వాంగ్‌చుక్‌ ఉదంతంలో చూశాం. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దుచేసి, దానిని కేంద్రపాలితప్రాంతంగా మారుస్తున్నప్పుడు లద్దాఖ్‌కు ఇచ్చిన హామీలు, కల్పించిన ఆశలు తదనంతరం పాలకులు గాలికివదిలేయడంతో ఈ విద్యావేత్త, ప్రజాశాస్త్రవేత్త తన ప్రజల పక్షాన ఉద్యమించాడు. ఆయన దీక్షలను భగ్నం చేసి, అభ్యర్థనలను లక్ష్యపెట్టకపోవడమే కాక, తమకు శత్రువుగా మారిన ఆయన మీద ఈ విదేశీ విరాళాల చట్టాన్నే కేంద్రం ప్రయోగించింది. ఆ సంస్థను రద్దుచేయడంతో పాటు, దేశవ్యతిరేక కార్యకలాపాలకోసం విదేశీ నిధులను వినియోగించాడంటూ దేశద్రోహిగా ముద్రవేసి జైలుకు పంపింది. ప్రస్తుత సవరణతో ప్రభుత్వం మరో అడుగుముందుకు వేసి, తాము అనుమతించని సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడుతోంది. నిర్దిష్టగడువులోగా రిజిస్ర్టేషన్‌ రెన్యువల్‌ కాకపోయినా, సదరు సంస్థ తన ఆస్తులను ఈ అథారిటీకి అప్పగించవలసి ఉంటుంది. ప్రభుత్వేతర సంస్థల పనితీరులో పారదర్శకతను పరిరక్షించడం, ఆర్థిక దుర్వినియోగాన్ని అరికట్టడం ఇత్యాది పేర్లతో 2010నాటి చట్టాన్ని కనీసం నాలుగుసార్లు సవరించడం ద్వారా ఇప్పటివరకూ పాతికవేల స్వచ్ఛంద సంస్థల విదేశీ విరాళాల లైసెన్సులను ప్రభుత్వం రద్దుచేసిందని ఈ రంగంలో పనిచేస్తున్న వారి వాదన. పాలకుల అభీష్ఠానికి అనుగుణంగా నడుస్తూ, వారి సిద్ధాంతాలనూ భావజాలాన్నీ ప్రచారం చేసే సంస్థలు తప్ప, వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే, నిరసించే హక్కుల సంస్థలు ఈ కొత్త బుల్డోజర్‌కు బలికాక తప్పదు. మైనారిటీ స్వచ్ఛంద సంస్థల దాతృత్వ, విద్యా, సంక్షేమ కార్యకలాపాలన్నీ ఈ కొత్త నిబంధనలతో కాలక్రమేణా తమ ఉనికినే కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి..

యూసీసీ అమలు, లవ్ జిహాద్‌కు చెక్.. అస్సాంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో

దేశంలో ఇంధన పరిస్థితి అదుపులో ఉంది: మోదీ

Updated Date - Apr 01 , 2026 | 01:53 AM