Share News

మరో మహా సంకల్పం

ABN , Publish Date - Aug 18 , 2026 | 03:37 AM

ఎర్రకోటమీద నరేంద్రమోదీ ప్రసంగమే కాదు, ఆయన ఆహార్యం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏటా కొత్తరకం తలపాగాతో, దానికి అతికేట్టుగా ఆకట్టుకొనే దుస్తులతో ప్రధాని దర్శనమిస్తుంటారు. 80వ స్వాతంత్ర్యదినోత్సవం...

మరో మహా సంకల్పం

ఎర్రకోటమీద నరేంద్రమోదీ ప్రసంగమే కాదు, ఆయన ఆహార్యం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏటా కొత్తరకం తలపాగాతో, దానికి అతికేట్టుగా ఆకట్టుకొనే దుస్తులతో ప్రధాని దర్శనమిస్తుంటారు. 80వ స్వాతంత్ర్యదినోత్సవం సంఖ్యరీత్యా మరింత విశేషమైనది కనుక, ఆయన ఈమారు ఎర్రని రాజస్థానీ తలపాగా, జతగా తెల్లటి కుర్తా, చాక్లెట్‌ బ్రౌన్‌ వెస్ట్‌కోట్‌తో కనిపించారు. దేశభక్తిని చాటేలా ఎంతో ముచ్చటపడి మువ్వన్నెల పాకెట్‌ స్క్వేర్‌ను ధరిస్తే, దాని అమరికలో తేడాలవల్ల కాబోలు విపక్షాలకు, గిట్టనివారికీ అది ఐర్లాండ్‌ జెండాను స్ఫురింపచేసింది. ఇక, ఆయన ఎప్పటిలాగానే అద్భుతంగా ప్రసంగించారని మెచ్చుకుంటున్నవారూ, అందులో బొద్దింకల ఉద్యమం ప్రభావం చూస్తున్నవారూ కూడా ఉన్నారు.

‘యే హోతీ హై రఫ్తార్‌, యే హోతాహై విస్తార్‌’ అంటూ భారత్‌ సమస్తరంగాల్లో సాధించిన ప్రగతి అంతా గత పుష్కరకాలంలోనే జరిగిందన్న రీతిలో ఆయన ప్రసంగం సాగింది. దేశవిభజన కష్టాలు, కన్నీళ్ళ గురించి చేసిన ఆ ప్రస్తావన కూడా 2014కు ముందు అవితప్ప ఏమీ లేవని చెప్పడంగా విపక్షాలకు తోచింది. ఇక, సర్వరంగాల్లోనూ వేగంగా జరిగిన ఈ వృద్ధి తాను ఆశించిన వికసితభారతాన్ని ఆవిష్కరించిదంటూ, ప్రధానంగా జెన్‌జీని ఆకట్టుకొనే కొత్తకొత్త మాటలతో ప్రధాని ఆ ఎదుగుదలమీద చాలా చెప్పుకొచ్చారు. యువశక్తి, లబ్ధిదారులు అంటూ యువత లక్ష్యంగా ఆయన ప్రకటించిన కార్యక్రమాల మీద కాక్రోచ్‌ ఉద్యమం ప్రభావం ఉండివుండవచ్చు. కోటిమంది యువతకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ నిస్తామనడం, పోటీపరీక్షలకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్రకటన వంటివి మెచ్చవలసిన ఆలోచనలే. జనగణనలో యువత చురుకైన పాత్ర పోషించాలని కోరడమే కాక, దాని ఆధారంగా పథకాలు, విధానాలు రూపుదిద్దుకుంటాయని చెప్పడం వెనుక ఏదో లక్ష్యం ఉండేవుంటుంది. జనగణనలో చేయి కలిపితే మీ స్వప్నాలు సాకారమవుతాయి, దేశ సంపదంతా మీకే చెందుతుందన్న హామీ వెనుక, అనవసరంగా రోడ్డునపడి జంతర్‌మంతర్‌ ఉద్యమాలు చేయకండన్న అంతర్లీన సందేశం కూడా ఉన్నట్టుంది. సముద్రగర్భం నుంచి అనంతాకాశం వరకూ సర్వసమస్తాన్నీ వినియోగం చేసుకోగల ‘శక్తిసప్తధార’తో ఆయన మరో రెండు దశాబ్దాలకు సరిపడా రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. ఇక, మహిళా బిల్లుకు విపక్షాలు మోకాలడ్డుతున్నాయన్న విమర్శ అధికారపక్షం నుంచి ఉన్నదే కానీ, చట్టసభల్లోకి మహిళలను రానివ్వండి అంటూ విపక్షాలను అభ్యర్థించడానికి ఈ ఎర్రకోట ప్రసంగాన్ని కూడా ప్రధాని వాడుకున్నారు.


సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించి, దేశాన్ని పెనుసంక్షోభం నుంచి విముక్తిచేశామని చెప్పుకోవడంతో ప్రధాని సరిపెట్టలేదు. వారి స్థానంలో ‘దిమాగీ నక్సల్స్‌’ను దేశానికి కొత్త శత్రువులుగా ఎర్రకోటమీద నుంచి ప్రకటించి, నేరుగా గురిపెట్టడం విశేషం. సాయుధ నక్సల్స్‌ కనుమరుగైనా వీళ్ళు ఇంకా మిగిలే ఉన్నారన్న హెచ్చరికలో, రాబోయేకాలంలో మరింత విస్తృతంగా చేపట్టబోయే ప్రత్యేక ఏరివేతల కార్యక్రమం ఏదో ఉన్నదన్న సందేశం వినిపిస్తోంది. ‘హథియారీ నక్సల్స్‌’ ‘దిమాగీ నక్సల్స్‌’ అంటూ ఏకవాక్యంలో ఇరువురినీ ప్రస్తావించి, ఆయుధాన్నీ ఆలోచననూ ఒకేగాటన కట్టారు, రెండూ అంతే ప్రమాదమంటున్నారు. అసమ్మతి ప్రకటిస్తున్నవారినీ, భిన్నభావజాలం ఉన్నవారినీ తుపాకీ పట్టుకున్నవారితో సమం చేసి, దేశానికి అదేస్థాయి ప్రమాదకారులని యువతని హెచ్చరిస్తున్నారు. ‘దిమాగీ నక్సల్స్‌’ నిర్వచనంలోకి కొత్తగా ఎవరెవరు వచ్చిచేరారో తెలియదు కానీ, దేశ అంతర్గత శత్రువులుగా వీరిని ఆయన చిత్రీకరించిన తీరు, మిగతా ప్రసంగమంతా దేశాన్ని అద్భుతంగా అభివర్ణించినదానికి పూర్తి భిన్నమైంది. వికసితభారతానికి ఇంధనాన్నికూర్చేది యువతేనంటూ ఆలోచనాశక్తినీ, ప్రశ్ననూ, విమర్శనూ ప్రమాదకరమైనవిగా, దేశాభివృద్ధికి శత్రువులుగా చిత్రీకరించడం విచిత్రం. ‘శక్తిసప్తధార’ దారిలో తాను రెండు దశాబ్దాల్లో లక్ష్యిస్తున్న వికసిత భారతానికి వినూత్న ఆలోచనలు, విశేషమైన మేధాసమర్థతలు అత్యంత కీలకమని ప్రధానికి తెలియకపోదు. ఇక, స్కిల్‌ ఇండియా, యంగ్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా ఇత్యాది నినాదాలు, లక్షలాది స్టార్టప్పులు, లక్షకోట్ల ఇన్నోవేషన్‌ ఫండ్‌, అటల్‌ టింకరింగ్‌ ల్యాబుల వంటి పథకాలు వింటున్నవే, చూస్తున్నవే. సరికొత్త అలంకరణలకంటే వాటిని విస్తృతంగా ఆచరణలో పెట్టినప్పుడే ఉద్దేశించిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 03:37 AM