Share News

ఏనాటి బంధమో ఇది..!

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:03 AM

స్వదేశంలో నెహ్రూను తీవ్రంగా విమర్శించే ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఇండోనేషియా పార్లమెంట్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భారత తొలిప్రధాని పేరు ప్రస్తావించారు. ఏ మాత్రం కష్టపడకుండా...

ఏనాటి బంధమో ఇది..!

స్వదేశంలో నెహ్రూను తీవ్రంగా విమర్శించే ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఇండోనేషియా పార్లమెంట్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భారత తొలిప్రధాని పేరు ప్రస్తావించారు. ఏ మాత్రం కష్టపడకుండా ఇండోనేషియా అత్యున్నత గౌరవపురస్కారాన్ని మోదీ దక్కించుకున్నారన్న అర్థంవచ్చేలా కాంగ్రెస్‌ ఓ విమర్శ చేసింది కానీ, ఉభయదేశాల సంబంధాలకు పునాదిపడిన అలనాటి రోజులనూ, అప్పటి పరిస్థితులను కాస్తంతైనా ప్రస్తావించకుండా, కారకుడైన నెహ్రూను స్మరించకుండా వర్తమానంలో బలమైన బంధం నెలకొల్పడం సాధ్యం కాదని మోదీకి తెలుసు. ఆయన తన ప్రసంగంలో బాండుంగ్‌ కాన్ఫరెన్సు గురించీ, అలీన విధానానికి సుకర్ణో–నెహ్రూల బలమైన పునాదుల గురించి ప్రస్తావించారు. రెండేళ్ళ తేడాలో స్వాతంత్య్రాన్ని పొందిన ఈ రెండు దేశాలూ తమ వలసవాద వ్యతిరేక పోరాటంతో అనేక దేశాలకు స్ఫూర్తినిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆగస్టు 17, 1945లో డచ్‌ పాలననుంచి ఇండోనేషియా స్వాతంత్ర్యం ప్రకటించుకోగానే, ప్రధాని సుతాన్ జహ్రీర్‌, ఉపాధ్యక్షుడు మహ్మద్‌ హట్టాలను డచ్‌సైన్యం గృహనిర్బంధంలో ఉంచితే, భారత వైమానిక దళంలో పైలట్‌గా పనిచేస్తున్న బిజూ పట్నాయక్‌, కోపైలట్‌ అయిన తన భార్య జ్ఞానవతీ పట్నాయక్‌తో కలిసి ఒక డకోటా విమానంలో ఇండోనేషియా వెళ్ళి వారిని రక్షించిన ఘట్టాన్ని కూడా మోదీ గుర్తుచేశారు. నెహ్రూ ఆదేశాల మేరకు బిజూభాయ్‌ అత్యంత సాహసోపేతంగా ఈ కర్తవ్యాన్ని పూర్తిచేసిన విషయం తెలిసిందే. డచ్‌తో ఇండోనేషియా తీవ్రంగా పోరాడుతున్న ఆ కాలంలో, అక్కడ నిర్బంధంలో ఉన్న ఈ ఇండోనేషియా కీలకనేతలిద్దరినీ రక్షించే క్రమంలో విమానాన్ని కూల్చివేస్తామన్న డచ్‌ సైన్యం హెచ్చరికలను సైతం బిజూ పట్నాయక్‌ లక్ష్యపెట్టలేదు. తన ఈ చిన్న విమానానికి ఏ మాత్రం హాని జరిగినా దానిని భారతదేశం మీద దాడిగా భావిస్తామని బెదిరించి మరీ ఆ నేతలిద్దరినీ సింగపూర్‌ మీదుగా ఢిల్లీ చేర్చారు బిజూభాయ్‌. 1950లో భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా విచ్చేయడం ఇరుదేశాల స్నేహబంధానికి నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు. సుకర్ణో కుమార్తెకు మేఘావతి అని నామకరణం చేసింది కూడా బిజూ పట్నాయకేనని అంటారు. ఇండియా–ఇండోనేషియా బంధానికి ఉన్న బలమైన పునాదిని వివరించే క్రమంలో కొన్ని ఉద్దేశపూర్వకమైన విస్మరణలు జరిగినప్పటికీ, ఎనిమిది దశాబ్దాలనాటి ఆ సంఘటనలను ఉపరితలంలోనైనా ప్రస్తావించినందుకు మోదీని అభినందించాల్సిందే.


ఇండోనేషియా పార్లమెంట్‌ను ఉద్దేశించి భారతప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి. ఉభయదేశాల భాగస్వామ్యంలో ఒక సువర్ణ అధ్యాయం ఆరంభమవుతోందన్నారు మోదీ. భారతప్రధాని పర్యటనలో యుద్ధవిమానాలు, ఎర్రతివాచీల స్వాగతాల నుంచి అడుగడుగునా ఆ దేశం కనబరచిన గౌరవం బలమైన పునాదికి నిదర్శనం. నరేంద్రమోదీ తనకు ఆదర్శమనీ, ఆయన పథకాలను కాపీకొడతానని చమత్కరించి మరీ ఎంతో ఆత్మీయతను ప్రకటించారు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబవో సుబియాంతో. ఆపరేషన్‌ సిందూర్‌లో కీలకపాత్ర పోషించిన ‘బ్రహ్మోస్‌’, ‘అస్త్ర’ క్షిపణుల కొనుగోలుకు ఇండోనేషియా నిర్ణయించుకోవడం విశేషమైన పరిణామం. దాదాపు ఎనిమిదేళ్ళుగా చర్చోపచర్చలు జరుగుతూ, సైనికరంగ ప్రముఖుల రాకపోకలు సాగుతూవచ్చిన అంశమిది. రక్షణలోనే కాదు, నౌకాయానం, కీలక ఖనిజాలు,అంతరిక్షం, ఆహారభద్రత, ఔషధాలు ఇత్యాది చాలా రంగాల్లో సహకారం మెండుగా ఉండబోతోంది. అండమాన్‌–నికోబార్‌ దీవులకు సమీపంగా ఉన్న సబాంగ్‌ ఓడరేవును ఉమ్మడిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన వ్యూహాత్మకంగా ఉపకరిస్తుంది. ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థతో మన యూపీఐ అనుసంధానం ఆర్థికబంధంలో కీలకమైన అడుగు. రెండుదేశాల తీరరక్షకదళాలు సమష్టిగా పనిచేయాలన్న నిర్ణయం మన భద్రతకు ఉపకరిస్తుంది. హిందూమహాసముద్రాన్ని పసిఫిక్‌ మహాసముద్రంతో కలిపే నాలుగు జలసంధుల మధ్య ఇండోనేషియా ఉన్నందున ఒక వ్యూహాత్మక భాగస్వామిగా దాని సహకారం మనకు ఎంతో అవసరం. నికెల్‌ నిలువలు అత్యధికంగా ఉన్న ఈ దేశంతో ఉత్పత్తి, శుద్ధి, ఎగుమతుల విషయంలో ఇచ్చిపుచ్చుకోవడం మన విద్యుత్‌ వాహనాల తయారీకి తోడ్పడుతుంది. మోదీ పర్యటనలో కుదిరిన పద్నాలుగు ఒప్పందాలూ అవగాహనలూ ఉభయదేశాల మధ్యా సాన్నిహిత్యాన్నీ సహకారాన్నీ మరింత పెంచుతాయి.

ఇవీ చదవండి:

ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు

ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్‌ రైల్ ప్లాన్

Updated Date - Jul 09 , 2026 | 04:03 AM