పొంగిన ప్రేమలు!
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:41 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఒకే ఒక్కరోజు ఇజ్రాయెల్ పర్యటనతో ఇరుదేశాల సంబంధాల్లో నవశకానికి నాందిపలికారని మీడియా చర్చల్లో కొందరు విశ్లేషకులు మురిసిపోతున్నారు. ‘సేమ్ పించ్’ అంటూ...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఒకే ఒక్కరోజు ఇజ్రాయెల్ పర్యటనతో ఇరుదేశాల సంబంధాల్లో నవశకానికి నాందిపలికారని మీడియా చర్చల్లో కొందరు విశ్లేషకులు మురిసిపోతున్నారు. ‘సేమ్ పించ్’ అంటూ దేశాధినేతలు ఇద్దరూ జోకులు వేసుకోవడం నుంచి దేశాల మధ్య సాన్నిహిత్యం వరకూ స్నేహం ఒక్కసారిగా అనేకమెట్లు ఎక్కిందని సంతోషిస్తున్నారు. ఇరుదేశాలూ తమబంధాన్ని అదనంగా ‘ప్రత్యేక’ చేర్చి వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయిని పెంచుకోవడమే కాక, రేపోమాపో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని కూడా చేసుకోబోతున్నాయి. మిత్రుడికంటే ఎక్కువ అని మోదీని నెతన్యాహూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. పర్యటన ఆరంభం నుంచి తిరిగి విమానం ఎక్కించే వరకూ మోదీని క్షణం కూడా విడిచిపెట్టలేదు. అంత గౌరవంగా చూసుకొని, ఎంతో ఘనంగా సత్కరించి పంపుతున్నప్పుడు మీరూ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ఆహ్వానించడం మర్యాద కనుక మోదీ అదే చేశారు.
వాణిజ్యం, వ్యవసాయం, విద్య, ఇంధనం, సైబర్‌స్పేస్ తదితర మొత్తం పదిహేడు రంగాల్లో ఉభయదేశాల మధ్యా ఒప్పందాలు కుదిరాయి. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ద్వారా మిలటరీ హార్డ్‌వేర్ రెండుదేశాలూ కలిసి అభివృద్ధిచేస్తాయి. దీర్ఘకాలిక భాగస్వామ్యం స్థాయి మరింత హెచ్చింది కనుక రక్షణరంగంలో ఇజ్రాయెల్ సహకారంతో పాటు వాటా కూడా హెచ్చుతుంది. కృత్రిమమేధ, క్వాంటమ్, కీలక ఖనిజాల రంగాల్లోనూ ఇజ్రాయెల్ సహకారం లభించబోతోంది. ఇక, శాంతి, స్థిరత్వం, ఘర్షణలు, ఉగ్రవాదం ఇత్యాది పదజాలంతో మోదీ చేసిన ప్రకటనలు నెతన్యాహూకు ఎంతో సంతృప్తి కలిగించి ఉంటాయి. డిసెంబరులోనే నెతన్యాహూ ఈ పర్యటన తేదీని ప్రకటించిన నేపథ్యంలో, మోదీ మద్దతు సాధించడానికి ఈ స్వల్ప సమయాన్ని నెతన్యాహూ ఎంతో ప్రణాళికాబద్ధంగా వినియోగించుకున్నట్టుంది. ఈ ఏడాది ఆయన ఎన్నికలు ఎదుర్కోబోతున్న తరుణంలో మిగతా దేశాధినేతల రాకపోకలు ఆయనకు అవసరం. ప్రపంచమంతా తనను హీరోగా చూస్తున్నదని చెప్పుకోవడం ముఖ్యం. మోదీ పర్యటన ఈ విషయంలో ఆయనకు రాజకీయంగా ఉపకరిస్తుంది. ఏడేళ్ళక్రితం పర్యటనలో కంటే మోదీని నెతన్యాహూ అధికంగా కీర్తించడం, ఆలింగనాలు చేసుకోవడం అందుకే.
గాజాను సంపూర్ణంగా నేలమట్టం చేసి, శాంతి ఒప్పందం అంటూ ఒకటి ఎట్టకేలకు కుదిరినప్పటికీ, ఇప్పటికీ పాలస్తీనియన్లకు తగినంత ఆహారం అందనివ్వకుండా, దాడులు కొనసాగిస్తున్న నెతన్యాహూతో నేరుగా భేటీ కావడానికి మిగతాదేశాధినేతలు సంకోచిస్తున్న తరుణంలో మోదీ పర్యటన జరిగింది. వేలాదిమంది పాలస్తీనియన్లను సంహరించి, లక్షలాదిమందిని తరిమికొట్టి, మహామారణకాండకు కారకుడైన నెతన్యాహూ గాజా తదనంతరం వెస్ట్‌బ్యాంక్ సంపూర్ణ దురాక్రమణకు కుట్రలకు తెరదీసిన నేపథ్యంలో, ముస్లిం దేశాలతో పాటు, యూరప్ కూడా తీవ్రంగా గర్హిస్తున్నది. అందరూ తనను వదిలేసిన ఈ పాడుకాలంలో మోదీ తనకు అండగా వచ్చినందుకు నెతన్యాహూకు సంతోషం కలగడం సహజం. అవినీతి మీద విచారణలు, కేసులు ఒకపక్క ఉండగా, మరోపక్క ౨023నాటి ఘటనలో భద్రతావైఫల్యం కూడా నెతన్యాహూ పీకకు చుట్టుకుంది. తనవద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీలను హమాస్ అప్పగించిందే తప్ప, సుదీర్ఘయుద్ధంలో నెతన్యాహూ సైన్యాలు ఎవరినీ విడిపించింది లేదు. హమాస్ అంతుచూస్తానన్న ఆయన శపథం కూడా నెరవేరలేదు. యుద్ధాన్ని సాగదీసి ఇజ్రాయెలీ ప్రజలకు, సైన్యానికి, ఖజానాకు తీవ్ర నష్టం కలిగించాడన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, హమాస్ ఉగ్రదాడిని ప్రస్తావించి, ఆ ఘోరకలిలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం పట్ల భారత్ తన బాధను పంచుకుంటున్నదంటూ ప్రకటించిన మోదీ, తదనంతరం నెతన్యాహూ సాగించిన మారణకాండలో డెబ్బైరెండువేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయిన ఊసెత్తకపోవడం ఇజ్రాయెల్ ప్రధానికి నచ్చింది. పశ్చిమాసియాలో శాంతి మీద భారత ప్రయోజనాలు ఆధారపడివున్నాయని అంటున్న భారత ప్రధాని అక్కడి మిగతాదేశాలతో సత్సంబంధాల గురించి పెద్దగా పట్టించుకోకుండా, ఇజ్రాయెల్ పక్షాన గట్టిగా నిలబడతామని హామీ ఇచ్చినందుకు నెతన్యాహూ తెగ సంతోషించివుంటారు. మిగతాదేశాలు తనను యుద్ధపిపాసిగా వెలివేస్తే, అంతర్జాతీయ న్యాయస్థానం యుద్ధనేరస్తుడిగా ముద్రవేస్తే, మోదీ వచ్చి పలుమార్లు ఆలింగనం చేసుకున్నందుకు నెతన్యాహూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. విమానం ఎక్కబోతున్న మోదీని ఏకంగా ముద్దాడేంత ప్రేమ పొంగుకొచ్చింది అందుకే.
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్