Share News

పొదుపు ‘మంత్రం’...!

ABN , Publish Date - May 15 , 2026 | 01:16 AM

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో, దేశప్రజలకు పొదుపు చర్యలను సూచించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఆచరించడం ఆరంభించారు. రెండే వాహనాలతో ఆయన ఢిల్లీ వీధుల్లో ప్రయాణిస్తున్న...

పొదుపు ‘మంత్రం’...!

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో, దేశప్రజలకు పొదుపు చర్యలను సూచించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఆచరించడం ఆరంభించారు. రెండే వాహనాలతో ఆయన ఢిల్లీ వీధుల్లో ప్రయాణిస్తున్న దృశ్యాలను టెలివిజన్‌ చానెళ్ళు పదేపదే ప్రదర్శిస్తున్నాయి. తన కాన్వాయ్‌ను కుదించడడమే కాక, అందులో ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలని, అలా అని కొత్తవాహనాలను కొనరాదని ప్రధాని ఆదేశించారట. ఆయన ఆదర్శంగా, డబుల్‌ ఇంజన్‌ సర్కార్లున్న రాష్ట్రాల్లోనే కాదు, విపక్షపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సైతం కాన్వాయ్‌ తగ్గించుకుంటున్నారు. ఇంతకాలమూ భారీ వరుస వాహనాలతో రయ్‌రయ్‌ మని దూసుకుపోయిన తమ నాయకులందరూ ఒక్కసారిగా పొదుపరులుగా అవతరించినందుకు దేశం తెగ సంతోషిస్తోంది.

పదిహేను వాహనాల కాన్వాయ్‌ చిన్నదైపోయిన ఆ దృశ్యం ప్రభావమే వేరు. ప్రధానిని స్ఫూర్తిగా తీసుకొని కొందరు మంత్రులు బస్సుల్లోనూ, మెట్రోరైళ్ళలోనూ ప్రయాణిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా ద్విచక్రవాహనం మీద విధానసభకు ప్రయాణించారు. ఎక్కువ వాహనాలతో కనిపించిన చిన్నాచితకా నేతలపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చర్యలు కూడా అమలవుతున్నాయి. మంత్రివర్గ సమావేశానికి రెండువాహనాల్లో వచ్చిన ప్రధాని తన సహచరులతో ప్రభుత్వం వ్యయంలో కోతపెట్టడం తన ఉద్దేశం కాదని, అనవసర వ్యయాన్ని నియంత్రిస్తూ, ప్రజాధనాన్ని తెలివిగా ఖర్చుపెట్టడమే లక్ష్యమని స్పష్టంచేశారట. చమురు వినియోగాన్ని తగ్గించి, విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడుకోవడమే తప్ప, అభివృద్ధి, సంక్షేమపథకాలకు కోత విధించే ఉద్దేశం లేదని అన్నారట. రెండునెలలుగా పశ్చిమాసియా యుద్ధం దేశం మీద తీవ్రంగా ప్రభావం చూపుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసేవరకూ మోదీ కాచుకుకూర్చున్నారని, ఇప్పుడు పొదుపు చర్యల పేరిట ఆంక్షలు, నియంత్రణలకు తెరదీశారని విపక్షనేతల విమర్శ.


దేశప్రజలకు ప్రధాని ఆ ఏడు సూత్రాల పొదుపు చర్యల ప్రణాళికను సూచించడానికి కొద్దిరోజుల ముందు ఎన్నికల ప్రచారం ఏ స్థాయిలో సాగిందో చూశాం. ప్రధాని, ఆయన మంత్రులు, బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలతో, భారీ ర్యాలీలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తించారు. బెంగాల్‌లో అయితే ఏకంగా యుద్ధమే చేశారు. ఆ ప్రచారంలో ఎక్కడా కూడా అమెరికా–ఇరాన్‌ యుద్ధం ప్రభావం దేశం మీద ఉన్నదన్న సంకేతాలే లేవు. నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్‌ ఏలుబడిలో దేశం సర్వవిధాలా దిగజారితే తాము అన్ని రంగాల్లో దానిని ఉద్ధరించామని, డబుల్‌ ఇంజన్‌ సర్కార్లు్న్న రాష్ట్రాలు అద్భుతాలు చేస్తున్నాయని, వికసిత భారతం ప్రపంచస్థాయిలో ఆర్థికంగా వెలిగిపోతోందనే ప్రచారం సాగింది. అంతటి యుద్ధ బీభత్సంలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచకుండా ఈ దేశంలోని సామాన్యుడిని మోదీ రక్షించారని బీజేపీ నేతలు చెప్పుకున్నారే తప్ప, చమురు వాడకం తగ్గించమని అనలేదు. పైగా, దేశంలో తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయని, సరఫరా సమస్యలను సులువుగా అధిగమిస్తామని, దుష్ప్రచారాలను నమ్మవద్దని కూడా చెప్పారు. నిజానికి, ఈ ఇంధన పొదుపును దేశం ముందే ఆరంభించివుంటే, దిగుమతులకు సంబంధించిన కష్టనష్టాలతో పాటు, అధికధరలకు కొనాల్సిన బాధ కూడా తగ్గేదని నిపుణుల వాదన. ఈ రెండునెలల యుద్ధకాలంలో ప్రపంచ మార్కెట్లో రోజుకు పద్నాలుగు మిలియన్‌ బ్యారెళ్ళ చమురు తగ్గినందున, నిల్వలు గట్టిగా ఉన్న దేశాలు సైతం తక్షణమే ఇంధన పొదుపు చర్యలు ఆరంభించాయి. భారత ప్రభుత్వం ఇప్పుడు ఆ సంక్షోభ తీవ్రతను ఎదుర్కోక తప్పదని చెబుతున్నందున, మన ఆయిల్‌ కంపెనీలు రోజుకు వెయ్యికోట్ల నష్టాన్ని భరిస్తున్నాయన్న సత్యం కూడా ఇప్పుడే ప్రచారంలోకి వచ్చింది కనుక, అతిత్వరలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు కూడా రంగం సిద్ధం కావచ్చు.

విదేశీ మారకద్రవ్య నిల్వలు బాగా తగ్గి, ఏడాది కూడా రావంటున్న నేపథ్యంలో, వాటితో ప్రత్యక్షంగా ముడిపడిన పొదుపుచర్యలకు ప్రభుత్వం ఉపక్రమించడం అవసరమే. ప్రధాని సూచనల ప్రభావం ఆయా రంగాలమీద ఏ విధంగా ఉండబోతోందన్న మంచిచెడుల చర్చ కూడా నిపుణుల్లో లోతుగా సాగుతోంది. రూపాయి విలువ తీవ్రంగా పతనమైన నేపథ్యంలో, దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు, ఏయే రంగాల్లో అధిక ఎగుమతులతో లబ్ధిపొందవచ్చునో సూచిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో, అధికదేశాలు ఆదిలోనే ఆరంభించిన సంస్కరణలు, చర్యలకు మనం ఏ కారణాలచేతనైతేనేమి, ఆలస్యంగా ఉపక్రమించవలసి వస్తున్నది. భారత ఆర్థికవ్యవస్థకు ఈ ఏడాది ప్రతికూలంగా ఉండబోతున్న తరుణంలో, దేశం ఈ కష్టకాలాన్ని సవ్యంగా దాటడం ముఖ్యం.

ఇవీ చదవండి:

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

Updated Date - May 15 , 2026 | 01:16 AM