మళ్లీ మంటలు..!
ABN , Publish Date - May 27 , 2026 | 12:53 AM
మణిపూర్‌కు చెందిన యువ ఖగోళ భౌతికశాస్త్రవేత్త రోనాల్డో లైశ్‌రామ్, తన నాయకత్వంలో సాగిన ఒక అంతర్జాతీయ స్థాయి అన్వేషణలో, పన్నెండున్నర బిలియన్ సంవత్సరాల నాటి గలాక్సీలను కనుగొన్నందుకు...
మణిపూర్‌కు చెందిన యువ ఖగోళ భౌతికశాస్త్రవేత్త రోనాల్డో లైశ్‌రామ్, తన నాయకత్వంలో సాగిన ఒక అంతర్జాతీయ స్థాయి అన్వేషణలో, పన్నెండున్నర బిలియన్ సంవత్సరాల నాటి గలాక్సీలను కనుగొన్నందుకు మురిసిపోయి, స్వరాష్ట్రానికి చెందిన సరస్సు పేరు వాటికి పెట్టినట్టు వార్తలు వచ్చాయి. రోనాల్డో లైశ్‌రామ్ సరికొత్త ఆవిష్కరణతో విశ్వం ఆరంభంనాటి మరిన్ని రహస్యాలు వెలుగులోకి వస్తాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అంటున్నారు. మణిపూర్‌లోని లోక్టక్ లేక్ మాదిరిగా ఆ గలాక్సీలు తనకు కనిపించాయనీ, అందుకే ఆ పేరు పెట్టానంటూ సదరు శాస్త్రవేత్త పక్కపక్కనే ఆ ఫోటోలను పోస్టుచేసి సంతోషం వ్యక్తం చేశాడు. బిష్ణుపూర్‌జిల్లాలోని ఈ అతిపెద్ద మంచినీటి సరస్సు తమ రాష్ట్రానికి జీవనాధారమని, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దీనిని ఇప్పుడు ఖగోళచిత్రపటం మీద నిలిపానని ఆనందించాడు ఆయన. గత కొన్నేళ్ళుగా దేశవిదేశాల్లో మణిపూర్ పేరు మరో విధంగా వినబడుతున్న తరుణంలో ఇటువంటి వార్తలు సంతోషం కలిగిస్తాయి. కష్టాలు, కన్నీళ్ళకు నిలయంగా, నిరంతర ఉద్రిక్తతలకు మారుపేరుగా మిగిలిన తన రాష్ట్రాన్ని రోనాల్డో ఇలా స్మరించుకున్నాడు.
కొత్త ముఖ్యమంత్రి రాకతో మణిపూర్‌లో పరిస్థితులు గాడినపడతాయన్న ఆశ ఎక్కువకాలం నిలవలేదు. మూడేళ్ళపాటు మీతీ, కుకీల మధ్య తీవ్ర హింస చూసిన రాష్ట్రం ఇప్పుడు నాగా, కుకీ హింసతో రగులుతోంది. రాష్ట్రంలో నాలుగోవంతు ఉన్న నాగాలు ఇంతకాలం మీతీ–కుకీ హింసకు దూరంగా ఉన్నారు. కానీ, ఫిబ్రవరినుంచి నాగా–కుకీ వైరం పుంజుకొని, మళ్ళీ గృహదహనాలు, దోపిడీలతో రాష్ట్రం ఉడుకుతోంది. గత మూడునెలల్లో దాదాపు ఇరవై హింసాత్మక సంఘటనల్లో పదిహేనుమంది కన్నుమూశారు. గతవారం ఈ ఇరు తెగలకు చెందిన నలభైమంది అపహరణకు గురై మరింత రక్తపాతం జరిగింది. కొందరు విడుదలైనప్పటికీ, ఉభయపక్షాలూ ఇంకా కొందరిని బందీలుగా ఉంచుకున్నారు. ఒక బహిరంగస్థలంలో మద్యం తాగుతున్న కొందరు కుకీ యువకులను అటుగా పోతున్న నాగా ఉపాధ్యాయుడు దూషించడం ఈ ఘర్షణలకు మూలకారణమట. ఈ కుకీ యువకులు స్థానికంగా హింస, దోపిడీలకు పాల్పడుతున్నారని, వారికి మిలిటెంట్లతో సంబంధాలున్నాయని నాగాల ఆరోపణ. తమ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందిగా తంగుల్ నాగా తెగవారు ఆదేశించడంతో కుకీలు తిరగబడ్డారు. మిగతా నాలుగు తెగల నాగాలూ రంగప్రవేశం చేయడంతో స్థానికంగా మొదలైన ఘర్షణ అన్ని ప్రాంతాలకు విస్తరించింది. కుకీలు సైతం ఇదే విధమైన ఆరోపణలు చేస్తూ నాగాలమీద విరుచుకుపడుతున్నారు.
నాగా–కుకీ మధ్య వైరం అనాదిగా ఉన్నందున ఈ పరిణామాలు అధికారులను భయపెడుతున్నాయి. 1992లో ఈ రెండు తెగల మధ్య ఘర్షణలు రేగి, ఐదేళ్ళు సాగి, వెయ్యిమంది మరణించారు, వేలాదిమంది నిరాశ్రయులైనారు. గృహదహనాలు, అఘాయిత్యాలు యథేచ్ఛగా సాగాయి. ఇప్పటి ఘర్షణకు బలమైన, నిర్దిష్టమైన కారణమేదీ పైకి కనబడకపోయినా, పరస్పర అవిశ్వాసం, భూమి హక్కు ఇత్యాదివి పనిచేసినట్టు కనిపిస్తోంది. లోయప్రాంత మీతీలతో సుదీర్ఘకాలం పోరాడిన కొండప్రాంత కుకీలు తమకు స్వయం పాలన కావాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇది నాగాల్లో తీవ్ర అపనమ్మకాన్ని, అభద్రతను పెంచిందని ఓ వాదన. కుకీలకు స్వయంపాలన దక్కితే, వారు నాగాల భూములను లాక్కుంటారన్న ప్రచారం ఒకటి నిరంతరం సాగుతూ, హింస ఆరకుండా చేస్తోంది. ఉభయపక్షాలకు చెందిన మిలిటెంట్ గ్రూపులు ఇందుకు నాయకత్వం వహించడమే కాక, నాగా మిలిటెంట్లలో చీలికవర్గాలు తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం దీనిని అవకాశంగా తీసుకున్నాయి. మీతీలతో ఘర్షణల సందర్భంగా కొండప్రాంతాలకు తరలిన కుకీలు, నాగా ప్రాంత వనరులపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ప్రచారం సాగుతోంది. మూడేళ్ళపాటు మీతీ–కుకీ వైరాన్ని రగల్చిన బీరేన్‌సింగ్‌ను తప్పించి, ఏడాది కాలం రాష్ట్రపతిపాలనలో ఉంచిన తరువాత మణిపూర్ కాస్తంత చల్లబడింది. మూడునెలల క్రితం ముఖ్యమంత్రి అయిన ఖేమ్‌చంద్ యుమ్నమ్ మీతీ–కుకీల మధ్య సయోధ్యకోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో కొత్త యుద్ధం ఆరంభమైంది. దీని వెనుక కూడా రాజకీయ కుట్రలున్నాయేమో తెలియదు కానీ, ఈ సరిహద్దు రాష్ట్రం నిత్యం రగులుతూనే ఉండటం విషాదం, ప్రమాదకరం.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ