మమత ‘సర్’ పోరు
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:43 AM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు సుప్రీంకోర్టులో ప్రత్యక్షమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను సవాల్ చేస్తూ, తన రాష్ట్రంలో...
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు సుప్రీంకోర్టులో ప్రత్యక్షమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను సవాల్ చేస్తూ, తన రాష్ట్రంలో దానిని తక్షణం ఆపివేయాలంటూ ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. సర్ అమలు న్యాయబద్ధం కాదంటూ ఆమెపార్టీ ఇటీవల కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. విచారణ నేడు జరుగుతున్న నేపథ్యంలో, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ఆమెకు కోర్టుకూడా వ్యక్తిగత హాజరుకు అనుమతించడంతో ఢిల్లీలోనే ఉన్న మమత వచ్చి సర్ మీద తన అభ్యంతరాలను స్వయంగా విన్నవించుకుంటారని మీడియా అంటోంది.
మమతా బెనర్జీ తన ‘సర్’ వ్యతిరేకపోరాటాన్ని దేశరాజధానికి మార్చి రాజకీయంగా మంచి ఎత్తు వేశారని విశ్లేషకుల అంచనా. సోమవారం సీఈసీతో భేటీకోసం ఆమె ఆదివారం ఢిల్లీలో ఒక పెద్ద బృందంతో కాలూనారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నినాదాలు, నిరసనల హడావుడి ఎలాగూ ఉండగా, సర్‌తో నష్టపోయినవారంటూ కొందరిని ఆమె తనతోపాటు ఢిల్లీ తీసుకువచ్చారు. నిరసన ఘాటుగా ఉండాలంటే నల్లబాడ్జీలు సరిపోవని అనుకున్నారేమో, సదరు సర్ బాధితులతో పాటు తాను కూడా నల్లశాలువా కప్పుకొని ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ఎంత అమానుషమైనదో వివరించారు. సీఈసీతో జరిపిన గంటన్నర భేటీలోనూ ఏమి జరిగిందన్నది మనకు స్పష్టంగా తెలియదు కానీ, ఉభయపక్షాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం మీద ఆమె తీవ్ర ఆరోపణలు చేశారని, తాము జవాబు చెబుతున్నప్పుడు మాత్రం తృణమూల్ నాయకులు ఉద్దేశపూర్వకంగా పదేపదే అడ్డుతగిలారని అధికారుల విమర్శ. గట్టిగా మాట్లాడుతూ మమత పలుమార్లు టేబుల్‌ను బలంగా చరిచారనీ, సమాధానం పూర్తిగా వినకుండానే ఆగ్రహంగా వెళ్ళిపోయారని వారంటున్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ అహంకారనీ, జమీందారులాగా ప్రవర్తిస్తూ తృణమూల్ బృందాన్ని అవమానించారని మమత ఆరోపణ. ఎప్పటిలాగానే ఆయనను బీజేపీ బ్రోకర్ అని ఆడిపోసుకున్నారామె. జగ్‌దీప్ ధన్‌కర్‌కు పట్టిన గతే జ్ఞానేశ్‌కూ పడుతుందని ఆమె జోస్యం చెప్పారు. ఢిల్లీలోని బంగభవన్‌కు రక్షణగా స్వరాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో పోలీసులను తెచ్చుకున్న ఆమె, ఢిల్లీ పోలీసులను కూడా అక్కడ మోహరించినందుకు మండిపడుతున్నారు.
బెంగాలీల పేర్లు, ఇంటిపేర్ల స్పెల్లింగులో స్వల్ప తేడాలు సర్వసాధారణమనీ, అయినా వాటిని బూచిగా చూపి లక్షలాది పేర్లు తొలగిస్తున్నారని మమత ఆరోపణ. పాత జాబితాలను డిజిటలైజ్ చేసే క్రమంలో కృత్రిమమేధ వినియోగం లక్షలాది ఓటర్లకు అన్యాయం చేసిందని, మైక్రో అబ్జర్వర్ల పేరిట ఎనిమిదివేలమందిని రంగంలోకి దించడం కూడా ఈసీ–బీజేపీ సంయుక్త కుట్రని ఆమె అంటున్నారు. ఓటరు జాబితాలో ఉన్న వృద్ధులను సైతం ఆస్పత్రిలో పురుడుపోసుకున్న ఆధారాన్ని ఈసీ అడుగుతోందని, నరేంద్రమోదీకి సైతం ఇది సాధ్యమేనా అని ఆమె ప్రశ్న.
బిహార్‌లో సర్ సందర్భంగా, ఆధార్‌ను సైతం కాదన్న ఎన్నికల సంఘం చివరకు సుప్రీంకోర్టు ఒత్తిడికి లొంగి సరేనన్నప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి లక్షలాదిపేర్లు గల్లంతైనాయి. పశ్చిమబెంగాల్‌లో సర్ ప్రక్రియను ఉద్దేశించి పక్షంరోజులక్రితం కూడా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. రెండు దశాబ్దాలనాటి జాబితాలతో కుస్తీపడుతున్న అధికారులు అనుభవిస్తున్న ఒత్తిడిని, పౌరులు ఓట్లు కోల్పోయే ప్రమాదాన్ని గమనించి కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా, పిల్లలూ వారి తల్లిదండ్రుల పేర్లు ఇంటిపేర్లలో స్వల్పతేడాలు, వేర్వేరు స్పెల్లింగులు, నమ్మశక్యం కానంత వయసు అంతరాలు వంటివి పరిష్కరించడానికి వీలుగా కోటీపాతికలక్షలమంది పేర్లను ఆయా గ్రామపంచాయతీలు, బ్లాక్, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించాలనీ, జవాబు చెప్పుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలని, విచారణ సమయంలో తగినంత సిబ్బందిని నియమించి, ప్రతీదశలోనూ రసీదులు ఇవ్వాలనీ, తుది నిర్ణయానికి కారణాలు తెలియచేయాలని కోర్టు మార్గనిర్దేశనం చేసింది. పాత జాబితాలను ప్రక్షాళించే బృహత్ కర్తవ్యాన్ని ఎన్నికల సంఘం నెత్తినెత్తుకోవడాన్ని ఎవరూ ఆక్షేపించడం లేదు. కానీ, ఎన్నికలు ముంచుకొస్తున్న రాష్ట్రాల్లో దానిని హడావుడిగా అమలుచేయడమే విమర్శలకు కారణమవుతున్నది. తీవ్రమైన ఒత్తిళ్ళు, గడువుల మధ్య బీఎల్‌వోలు పలురకాల తప్పులు చేయడంతోపాటు, అనేకమంది తీవ్ర అనారోగ్యం పాలైనారు. సర్ మంచిచెడులను మొదట్లోనే నిర్థారించి, నిలువరించాల్సిన న్యాయస్థానాలు ఆ పని చేయని కారణంగా ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రక్రియను గాడినపెట్టవలసి వస్తున్నది.
ఇవీ చదవండి:
సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు