Share News

మహిళా రైతుకు ‘మహా’పథం

ABN , Publish Date - Jul 28 , 2026 | 01:05 AM

రైతు అన్నప్పుడు మనకు సహజంగా పొలంలో హలంతో దున్నుతున్న, కొడవలితో పంట కోస్తున్న పురుషుడే స్ఫురిస్తాడు. ఈ పురుష పక్షపాత మనోవైఖరి మనకు ఆనువంశికంగా సంక్రమిస్తూ వస్తోంది. రైతును గురించి...

మహిళా రైతుకు ‘మహా’పథం

రైతు అన్నప్పుడు మనకు సహజంగా పొలంలో హలంతో దున్నుతున్న, కొడవలితో పంట కోస్తున్న పురుషుడే స్ఫురిస్తాడు. ఈ పురుష పక్షపాత మనోవైఖరి మనకు ఆనువంశికంగా సంక్రమిస్తూ వస్తోంది. రైతును గురించి ‘సైరికా! భారతక్ష్మాతలాత్మ/ గౌరవ పవిత్రమూర్తివి, శూరమణివి’, అన్న మహాకవుల కీర్తిగానం విన్నప్పుడు కూడా నాట్లు, కోతలు, నూర్పిళ్ల శ్రమ చేసే మహిళ మన మనోదర్పణంలో కనిపించనే కనిపించదు. నిజానికి వ్యవసాయ పనులలో చాలా వాటిని నిర్వర్తిస్తున్నది మహిళలే అన్నది మనం ఇంకా గుర్తించని ఒక వాస్తవం. ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటున్న మహిళల్లో 80శాతం మంది సేద్య రంగంలోనే క్రియాశీలంగా ఉంటున్నారు. ఆహారోత్పత్తిలోను, గ్రామీణ సంపద సృష్టిలోను కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు భూ యాజమాన్య హక్కులు లేని కారణంగా తీవ్ర వివక్షకు గురవుతున్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ అన్యాయాలను సరిచేసేందుకే మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘మహారాష్ట్ర మహిళా రైతు సాధికారత చట్టం–2026’ను ఆమోదించింది. కుటుంబ కమతాలలో సాగుదారులుగా, జీవనోపాధికి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న లక్షలాది మహిళలకు ఇది సాధికారత కల్పించింది. ఇదొక చరిత్రాత్మక పథ నిర్దేశక చట్టం.

వ్యవసాయ విధానాల విషయంలో ప్రభుత్వ వైఖరి వ్యవసాయదారుల శ్రేయస్సుకు దోహదం చేయడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించడంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఫలితంగా రైతులు తమ పంట దిగుబడులకు సరైన ధర పొందలేకపోతున్నారు. దీనివల్ల వ్యవసాయరంగంలోని మహిళలు అమితంగా నష్టపోతున్నారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతను సమకూర్చడంలో మహిళల మౌలిక పాత్రకు సరైన గుర్తింపు లేదు. అందుకే, వ్యవసాయ ఆహార వ్యవస్థలలో మహిళలకు సాధికారత కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా పాటిస్తోంది. ఐరాస లక్ష్యసాధనకు దోహదం చేసే కృషిలో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం మహిళా రైతుల సాధికార చట్టాన్ని తీసుకువచ్చింది. ఎమ్‌ఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సహకారంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది.


జాతీయ రైతు విధానం (2007)కు అనుగుణంగా మహారాష్ట్ర చట్టం ‘వ్యవసాయం’, రైతు’కు విశాల నిర్వచనం ఇచ్చింది. పంటలసాగు, పాడి, మత్స్య, కోళ్ల పెంపకం పశు పోషణ, పట్టు పరిశ్రమ, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం, వ్యవసాయ–అడవులు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాథమిక ప్రాసెసింగ్‌లో యజమానిగానో లేదా పనివాళ్లుగానో పాల్గొనే వారందరూ రైతు కిందకే వస్తారు. ఈ ప్రస్తావిత కార్యకలాపాలు దేనిలోనైనా పాల్గొనే మహిళలు అందరూ రైతులేనని ఆ చట్టం పేర్కొంది. ఈ మహిళలకు మహిళా రైతు ధ్రువీకరణ పత్రం (ఉమన్‌ ఫార్మర్‌ సర్టిఫికెట్‌) జారీ చేయడం తప్పనిసరి. భూయాజమాన్య హక్కులతో నిమిత్తం లేకుండా ప్రతి మహిళా రైతుకు గ్రామ సభ వారికి ఈ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. ఈ సర్టిఫికెట్‌ ఉన్న మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందుకోవడానికి జిల్లా, తాలూకా స్థాయిలో మహిళా రైతు సహాయక అధికారులను నియమించాలని ఆ చట్టం నిర్దేశించింది. మహిళా రైతుల ప్రయోజనార్థం ఒక కేంద్రీకృత డేటాబేస్‌తో పాటు ప్రత్యేక మహారాష్ట్ర మహిళా రైతు నిధినేర్పాటు చేయాలని కూడా ఈ విశిష్ట చట్టం నిర్దేశించింది. ఈ చట్టం అమలును ఉన్నతస్థాయిలో పర్యవేక్షించే మహిళా రైతుల సాధికారత మండలికి ముఖ్యమంత్రి అధ్యక్షుడుగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో భూములు, నీటి వనరులు, ఇతర సహజ సంపదల లభ్యత విషయంలో తీవ్రంగా ఉన్న అసమానతలను తొలగించేందుకు ఈ చట్టం దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. భర్తలు జీవనోపాధికై పట్టణాలకు వలస వెళ్లడం అనివార్యమైన పరిస్థితుల్లో కుటుంబ ఆహార భద్రతకు మరింతగా శ్రమించవలసివస్తున్న మహిళలకు ఈ సాధికారత చట్టం సహాయకారి కాగలదు.

ఈ ప్రశస్త చట్టాన్ని అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అధ్యయనం చేసి దాని స్ఫూర్తితో తదనుగుణమైన చట్టాలు తీసుకురావల్సిన అవసరమున్నది. రైతుకు విశాల నిర్వచనమిచ్చిన నేపథ్యంలో సంబంధిత కార్యకలాపాలలో పాల్గొంటున్న విభిన్న సంప్రదాయ సామాజిక శ్రేణులకు చెందిన మహిళలందరికీ గౌరవపూర్వకంగా రైతమ్మ అనే ఉమ్మడి గౌరవ నామవాచకాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన అవసరమున్నది. ఇటువంటి ప్రగతిశీల చట్టాలను చర్చించేందుకు, వాటిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని రైతు హితులు, పౌరసమాజ సంఘాలు, ప్రస్తుత, పూర్వ ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపాలి.

Also Read:

చికెన్‌ 65 అనే పేరు ఎలా వచ్చింది?

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు.. నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

Updated Date - Jul 28 , 2026 | 01:05 AM