Share News

లక్నో విషాదం...!

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:24 AM

మూడువారాల్లో జరిగిన రెండు ఘోర అగ్నిప్రమాదాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఢిల్లీ తరువాత ఇప్పుడు లక్నో వంతు. ఎన్నో ఆశలతో మంచి భవిష్యత్తు కోసం వచ్చిన పదిహేను మంది విద్యార్థుల ప్రాణాలు ఈ ప్రమాదంలో...

లక్నో విషాదం...!

మూడువారాల్లో జరిగిన రెండు ఘోర అగ్నిప్రమాదాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఢిల్లీ తరువాత ఇప్పుడు లక్నో వంతు. ఎన్నో ఆశలతో మంచి భవిష్యత్తు కోసం వచ్చిన పదిహేను మంది విద్యార్థుల ప్రాణాలు ఈ ప్రమాదంలో పోయాయి. సదరు యానిమేషన్‌ కోచింగ్‌ సెంటర్‌ తగలబడిపోవడానికి కారణాలు ఏమైనా ఉండవచ్చును కానీ, ప్రమాదతీవ్రతకు దారితీసిన పరిస్థితులు మాత్రం ఎప్పటిలాగానే అవే. మృతుల్లో అత్యధికులు దట్టమైన పొగలో ఉక్కిరిబిక్కిరవుతూ ఊపిరాడక కన్నుమూశారు. భద్రతకు సంబంధించి ఏ జాగ్రత్తలూ తీసుకోకుండా ఒక నివాసగృహాన్ని కమర్షియల్‌ కాంప్లెక్స్‌గా వాడటం ఈ దారుణానికి కారణం.

అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఇటువంటి ప్రమాదాలకు దోహదం చేస్తాయి. నివాస భవనంగా అనుమతి పొంది, ఆ తరువాత కాలంలో ఆస్తి చేతులు మారాక అందులో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు మొదలైనాయి. మరోపక్క నాలుగేళ్ళ క్రితం నుంచి లక్నో మునిసిపాలిటీ ఈ భవనం నుండి కమర్షియల్‌ ప్రాపర్టీ టాక్స్‌ వసూలు చేస్తున్నదట. అయితే తదనుగుణంగా ఆ భవన నిర్మాణంలో జరగాల్సిన మార్పుచేర్పుల ఊసుమాత్రం సదరు అధికారులకు పట్టలేదు. ఆఫీసులు, ప్రధానంగా పెద్దసంఖ్యలో విద్యార్థులకు శిక్షణనిచ్చే ఈ కోచింగ్‌సెంటర్‌ వంటివి ఉన్నప్పటికీ, మున్సిపల్‌ అధికారులకు దాని లోపాలు పట్టలేదు. ఒక ఇరుకుమార్గం గుండా రాకపోకలు సాగుతూ, ఫైర్‌సేఫ్టీ అనుమతులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ వంటి ఏర్పాట్లకు తావులేని ఈ మూడంతస్థుల భవనం మృత్యునిలయంగా పరిణమించింది. భవనంపైకి పరిగెత్తేందుకు వీల్లేకుండా ఆ దారిని సైతం మూసివేశారు.


ఈ ప్రమాదం మనలను తీవ్రంగా హెచ్చరిస్తున్న మరో అంశం ఎలక్ట్రానిక్‌ లాకింగ్‌ సిస్టమ్‌. బయోమెట్రిక్‌ లాక్‌ అనో, స్మార్ట్‌లాక్‌ అనో పిలుచుకొనే ఈ వ్యవస్థ అగ్నిప్రమాదం జరగ్గానే ఆ భవనాలను మరింత ప్రమాదకరంగా మార్చివేసి, మృతుల సంఖ్య అత్యధికంగా ఉండటానికి కారణమవుతున్నది. మండుతున్న భవనాల్లో ఈ ఎలక్ట్రానిక్‌ డోర్‌ లాక్‌లు సులువుగా జామ్‌ అయిపోవడంతో, లోపల చిక్కుబడిపోయి మరణిస్తున్నవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ సాంకేతికత కారణంగా కన్నుమూసిన వారి సంఖ్య దేశంలో ఈ ఆర్నెల్లలోనే డజన్లకొద్దీ ఉన్నందున ఈ అంశంపై లోతైన అధ్యయనం జరిపి, వాటి వినియోగాన్ని ప్రమాదరహితంగా మార్చుకోవాలి. అత్యధిక వేడిమికి తాళాలు జామ్‌ అయిపోయి తీవ్రతను పెంచుతున్న పరిస్థితుల్లో, ఆ సంక్లిష్టతను దాటగల మెకానిజం అందులో ఉండాలి. వేడి పెరిగి, సదరు ఎలక్ట్రానిక్‌ లాక్‌ విఫలం కాగానే అది జామ్‌ కావడానికి బదులు తెరుచుకోగలిగితే ఎంతో ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. ఎలక్ట్రానిక్‌ లాక్‌ల ఖరీదు క్రమంగా తగ్గిపోతూండటంతో ఇప్పుడు అనేక చోట్ల వాటిని విరివిగా వాడుతున్నారు. అందువల్ల, కొత్త టెక్నాలజీ ప్రమాదకారిగా పరిణమించకుండా, కష్టకాలంలో కాపాడేదిగా మనం దానిని మార్చుకోవాలి. ఒక మండుతున్న భవనంలో కేవలం ఈ తరహా వ్యవస్థ కారణంగా ఏ వ్యక్తీ కూడా భవిష్యత్తులో కన్నుమూయకుండా జాగ్రత్తపడాలి. ఈ కోచింగ్‌ సెంటర్‌ ప్రవేశమార్గంలో ఏర్పాటైన బయోమెట్రిక్‌ విధానమే పెద్దసంఖ్యలో విద్యార్థుల మరణానికి కారణమైన మాట వాస్తవం.

తప్పించుకొనే దారిలేక పలువురు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి కాపాడమంటూ అర్థించారట. స్థానికులు వీడియోలు తీయడంమీద పెట్టిన శ్రద్ధ, ఆర్తనాదాలు చేస్తున్న ఆ పిల్లలను కాపాడటంమీద పెట్టివుంటే ఎంతోమంది బతికిబయటపడివుండేవారని మరికొందరు వాపోయారు. ఇరవై అగ్నిమాపకయంత్రాలు, సహాయక బృందాలు సాధ్యమైనంత వెంటనే రంగంలోకి దిగి కూడా, ఇరుకైన మెట్లదారి వినా మరోమార్గం లేకపోవడంతో చాలామందిని కాపాడలేకపోయాయి. ఢిల్లీ మాలవీయనగర్‌లో ఇటీవల ఒక హోటల్‌ తగలబడిపోయి, ఇదే తరహాలో ప్రాణాలు పోయాయి. వ్యవస్థలన్నీ శ్రద్ధపెడితే కచ్చితంగా నివారించగల విషాదఘటనలు ఇవి. చదువులు, ఉద్యోగాలకోసం నగరాలకు తరలివస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నకొద్దీ భవన యజమానుల డబ్బుయావ హెచ్చుతోంది, మనిషి ప్రాణానికి విలువలేకుండా పోతోంది. లక్నో ఘటన దేశానికి మరో హెచ్చరిక. వివిధ విభాగాలన్నింటి సమన్వయంతో, సమాచార మార్పిడితో, తనిఖీలు నిఘాలు పెంచి, లోపాయికారీ వ్యవహారాలకు తావులేని రీతిలో వ్యవహరించి ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడాలి.

ఇవి కూడా చదవండి

వైభవ్ సూర్యవంశీ తమ్ముడు మరో భారీ సెంచరీ

80 ఏళ్ల వయసులో కళాకారుడి కష్టాలు.. వీడియో చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్ర..

Updated Date - Jun 25 , 2026 | 01:24 AM