వరుస విషాదాలు
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:42 AM
తమిళనాడు, కేరళంలో వరుసగా జరిగిన బాణాసంచా ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం కేరళంలోని త్రిస్సూర్‌లో ఒక తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో పదమూడుమంది...
తమిళనాడు, కేరళంలో వరుసగా జరిగిన బాణాసంచా ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం కేరళంలోని త్రిస్సూర్‌లో ఒక తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో పదమూడుమంది కన్నుమూశారు, మరో ముప్పైమంది వరకూ గాయపడ్డారు. పూరం ఉత్సవాలకోసం టపాసులు తయారు చేస్తున్న క్రమంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. రెండు ఎకరాల పొలంలో ఉన్న ఒక షెడ్డులో ఈ బాణాసంచా తయారీ జరుగుతోంది. మంటలను నియంత్రించడానికి అగ్నిమాపకశకటాలు అనేక గంటలు శ్రమించాల్సివచ్చింది. ప్రమాదం జరిగిన సమయానికి ఆ తయారీ కేంద్రంలో ఎంతమంది ఉన్నారన్నది లెక్కకు దొరక్క, మధ్యాహ్నం అక్కడకు సరఫరా చేసిన భోజనం ప్యాకెట్ల సంఖ్యను ఆధారం చేసుకున్నారట. సమీపంలో కొన్ని బాణాసంచా నిలువకేంద్రాలు ఉండటం వల్ల కూడా వరుస పేలుళ్ళతో ప్రమాదం తీవ్రత పెరిగింది.
దీనికి ముందు, తమిళనాడు విరుదునగర్‌లో జరిగిన ప్రమాదం ఆ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జరిగిన విపత్తుల్లో అత్యంత తీవ్రమైనది. పాతికమంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు, తీవ్రంగా గాయపడినవారి సంఖ్య అంతకు రెట్టింపు ఉంది. ఒకపక్క సహాయకచర్యలు జరుగుతూంటే, మరో పేలుడు సంభవించి అగ్నిమాపక సిబ్బంది సహా పదిహేనుమంది గాయపడ్డారు. సెలవుదినాన ఫ్యాక్టరీ పనిచేయడమే కాక, వరండాలో కూచొని ఓ పాతికమంది ప్రమాదకర రసాయనాలను కలుపుతున్న దశలో ఈ పేలుడు జరిగి, దాదాపు మొత్తం ఫ్యాక్టరీ కుప్పకూలింది. ప్రమాదం సంభవించినప్పుడు అక్కడ వందమంది వరకూ పనిచేస్తున్నారు. విడివిడిగా, దూరంగా షెడ్లన్నీ నిర్మించాల్సింది పోను, గదులన్నీ పక్కపక్కనే ఉండటం ఇంతటి ఘోరానికి కారణం. ఈ పరిశ్రమ పరిమాణం ప్రకారం కనీసం నాలుగు అత్యవసర ద్వారాలు అన్నివైపులా ఉండాలని నిబంధనలు సూచిస్తూంటే, యజమాని రెండింటితోనే సరిపెట్టాడు. నలుగురు మాత్రమే పనిచేయాల్సిన ప్రమాదకరమైన గదిలో ఆ క్షణంలో ఇరవైమంది ఉన్నారు. విస్ఫోటనం తీవ్రతకు పూర్తిగా మాడి మాంసపు ముద్దలైపోయిన మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తించి కుటుంబీకులకు అప్పగించాల్సివచ్చింది.
బాణాసంచా తయారీకి పుట్టినిల్లయిన తమిళనాడులో ఈ తరహా ప్రమాదాలు అనేకం పెద్దసంఖ్యలో సంభవిస్తున్నప్పటికీ, వాటిని పూర్తిగా నిలువరించలేకపోవడం విషాదం. ఆ రాష్ట్రంలో కనీసం పదిలక్షల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఈ రంగం నుంచి ఉపాధి పొందుతున్నారు. ఇంతటి పెద్దసంఖ్యతో పాటు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన శివకాశీ వంటివి కూడా అక్కడ ఉన్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టిపెట్టాలి. కానీ, ఎంతోకాలంగా ఓ కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోనప్పటికీ అధికారులకు పట్టకపోవడం ఆశ్చర్యం. మృతుల్లో అధికులు మహిళలే. ఎటువంటి భద్రతలు, ప్రత్యేక రక్షణలు, బీమా సదుపాయాల వంటివి లేకుండా కుటుంబం కోసం పనిచేస్తున్న ఈ పేదల ప్రాణాలను యజమానులు ప్రమాదంలోకి నెట్టేశారు.
రసాయనాలను కలపడం నుంచి, ఆయా దశలను వేరుచేయడం, వాటిని వేర్వేరు చోట్ల నిర్వహించడం వరకూ ప్రదర్శించే అజాగ్రత్త ఈ తరహా ఘోరాలకు కారణమవుతున్నాయి. పేలుడు పదార్థాల నిల్వలపై పరిమితులు కూడా సవ్యంగా అమలు కావడం లేదు. నిర్దిష్ట దశలో, ఆ ప్రదేశంలో పనిచేయాల్సిన కార్మికుల పరిమితి, ఒక గదిలో ఉంచకూడని ఇతరత్రా పదార్థాలు, కార్మికులు ఆయా రసాయనాలతో వ్యవహరించాల్సిన పద్ధతులు, వారికి అందించాల్సిన శిక్షణ తదితర విషయాల్లో ఉల్లంఘనలు అనేకం. పరిశీలనలు, పర్యవేక్షణలు సక్రమంగా లేకపోవడంతో యాజమాన్యాలదే ఇష్టారాజ్యంగా నడుస్తోంది. కాస్తంత లాభం కోసం కార్మికులను యజమానులు బాధ్యతారాహిత్యంతో ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇతరత్రా రంగాల్లో పేలుడు పదార్థాలతో వ్యవహరించే, రవాణా చేసే కార్మికులకు ప్రత్యేక శిక్షణలు ఉంటాయి. సంబంధిత లైసెన్సు లేనిదే వారికి ఉద్యోగాలు కూడా దక్కవు. కానీ, బాణాసంచా తయారీలో మాత్రం ఇవేమీ కనబడవు. ఫ్యాక్టరీ యజమానులు, నియంత్రణ సంస్థలు, పర్యవేక్షణాధికారులు, స్థానిక యంత్రాంగం పూర్తి సమన్వయంతో, ఉమ్మడి బాధ్యతతో నిర్వహించాల్సిన రంగం ఇది. రాబోయే అధిక ఉష్ణోగ్రతల కాలం మరింత ప్రమాదకరమైనది. భారీ పేలుళ్ళతో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం సంభవించాక ఢిల్లీ నుంచి గల్లీవరకూ వెలువడే సానుభూతి ప్రకటనలు, నష్టపరిహారాలు, దర్యాప్తులు, అరెస్టుల వంటి పైపూతలకంటే, ప్రమాదాల నివారణకు చేయాల్సినదానిపై ప్రధానంగా దృష్టిపెట్టాలి.
ఇవి కూడా చదవండి..
అది నాకు గర్వకారణం.. సీఎం స్టాలిన్ వీడియో సందేశం
విజిల్ రెవల్యూషన్‌కు పిలుపు.. టీవీకే చీఫ్ విజయ్ బహిరంగ లేఖ