Share News

మాటలో మార్పు

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:03 AM

అమెరికా రాయబారి సెర్గియో గోర్ తన తొలి కశ్మీర్‌ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు విశేషప్రాధాన్యం ఉంది. కశ్మీర్‌ భారతదేశంలో ముఖ్యమైన ప్రాంతం అని పేర్కొనడంతోపాటు, జమ్మూకశ్మీర్‌కు అమెరికా ఇప్పటివరకూ...

మాటలో మార్పు

అమెరికా రాయబారి సెర్గియో గోర్ తన తొలి కశ్మీర్‌ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు విశేషప్రాధాన్యం ఉంది. కశ్మీర్‌ భారతదేశంలో ముఖ్యమైన ప్రాంతం అని పేర్కొనడంతోపాటు, జమ్మూకశ్మీర్‌కు అమెరికా ఇప్పటివరకూ వర్తింపచేసిన ‘లెవల్‌ ఫోర్‌ ట్రావెల్‌ అడ్వయిజరీ’ హెచ్చరికను పునఃపరిశీలించే ఆలోచన కూడా తమకు ఉన్నట్టుగా వ్యాఖ్యానించారాయన. ఈ పర్యటనలో వాణిజ్య సంస్థలూ, ఇతర సంఘాలతోనూ ఆయన సమావేశం కావచ్చునన్న వార్తలను, తత్సంబంధిత ప్రయోజనాలను అటుంచితే, గోర్‌ వ్యాఖ్యలు అమెరికా వైఖరిలోనూ, కశ్మీర్‌ విషయంలో దాని దృక్కోణంలోనూ వచ్చిన మార్పుకు సంకేతమని విశ్లేషకుల నమ్మకం.

జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేసి, దాని రాష్ట్ర స్థాయిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కుదించిన ఆరేళ్ళకు అమెరికా రాయబారి ఒకరు అక్కడ కాలూనినందున గోర్‌ కశ్మీర్‌ పర్యటనకు ప్రాధాన్యం ఉంది. దీనికి ముందు 2018లో అప్పటి అమెరికా రాయబారి కెనెత్‌ జస్టర్‌ మహబూబా ముఫ్తీ ప్రభుత్వం కూలిన నేపథ్యంలో గవర్నర్‌తో భేటీ అయ్యారు.

గత ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలో పాతికమంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడి, ప్రతీకారంగా భారత్‌ నిర్వహించిన అపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌–పాక్‌ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో గోర్‌ పర్యటనకు ప్రాధాన్యం ఉన్నది. కశ్మీర్‌ అందాలను ఘనంగా పొగుడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశపు ఈ ముఖ్య ప్రాంతాన్ని క్షేమంగా ఉంచుతున్నాయంటూ ప్రశంసించారాయన. భారత్‌–పాకిస్థాన్‌ల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యగా మాత్రమే కశ్మీర్‌ను చూస్తూ, దానిని అదేరీతిలో సంబోధిస్తూ వస్తున్న అమెరికా వైఖరిలో ఈ వ్యాఖ్యలు మార్పును సూచిస్తున్నాయి. కశ్మీర్‌లో శాంతిని కాపాడుతున్నారని అనడం ద్వారా ఆయన మోదీ చేపట్టిన చర్యలను సమర్థించారన్న విస్తృతార్థాలు, విశ్లేషణలను అటుంచితే, అక్కడ అంతా సవ్యంగా, భద్రంగా ఉన్నదన్న కేంద్రప్రభుత్వ వాదనకు అనుగుణంగానే ఈ వ్యాఖ్యలు ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేసినప్పటినుంచి, అక్కడకు వెళ్ళిన విదేశీపెద్దలంతా ఇదే అంటున్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు ఎంతో బాగున్నాయని భావించినపక్షంలో అమెరికా ఆ ట్రావెల్‌ అడ్వయిజరీని ఉపసంహరించుకోవాలని మెహబూబా ముఫ్తీ వంటివారు డిమాండ్‌ చేస్తున్నారు. పర్యాటకాదాయం మీదే ప్రధానంగా ఆధారపడిన ఈ కేంద్రపాలిత ప్రాంతానికీ, మిగతా ప్రపంచానికీ మధ్య అడ్డుగోడలాగా ఈ గరిష్ఠస్థాయి ప్రయాణ హెచ్చరిక ఉన్నదని, కశ్మీర్‌లో ఉగ్రవాదం–పౌర అశాంతి రెండూ లేవని గోర్‌ నమ్ముతున్నందున వాటి పేరిట జారీ చేసిన ఆ హెచ్చరికకు ఇక విలువేలేదని వారి వాదన.


భారత్‌–పాకిస్థాన్‌లు చర్చలతో జమ్మూకశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అంటుంది. అవసరమైతే తాను మధ్యవర్తిగా ఉంటానని డోనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఓ వ్యాఖ్య చేయగానే భారత్‌ దానిని తిరస్కరించింది. ఉభయదేశాల మధ్యా గత ఏడాది తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న దశలో, కశ్మీర్‌ను పరిష్కరించడానికి ఒక తటస్థ ప్రదేశంలో చర్చలు జరుగుతాయని కూడా అమెరికా విదేశాంగమంత్రి అప్పట్లో అన్నారు. కశ్మీర్‌ భారత్‌ అంతర్భాగమని భారత్‌ అనాదిగా స్పష్టం చేస్తోంది. ఇప్పుడు గోర్‌ వ్యాఖ్యలు అమెరికా వైఖరి భారత్‌కు అనుకూలంగా మారుతోందన్న భావనకు తావిస్తున్నాయి. ఆయన దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా అధ్యక్షుడి ప్రత్యేకదూతగా కూడా వ్యవహరిస్తున్నందున ప్రతీ మాటకు అధికవిలువ ఏర్పడటం సహజం.

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిని అమెరికా రాయబారి కలుసుకోవడం కూడా పదిహేనేళ్ళ తరువాత ఇదే ప్రథమం. ఈ కారణంగానే, ఆయనతో భేటీకి ముందే ఒమర్‌ అబ్దుల్లా ఓ మాటన్నారు. జమ్మూకశ్మీర్‌ ఎదుర్కొంటున్న సమస్యలను వాషింగ్టన్‌ పరిష్కరించదని, న్యూఢిల్లీతో తేల్చుకోవలసిన సమస్యలను విదేశీ దూతల ముందు ప్రస్తావించే అలవాటు తనకు లేదన్నారాయన. సంతోషించవలసిందే కానీ, రాష్ట్రహోదా పునరుద్ధరించేవరకూ నిద్రపోనని ఎన్నికలవేళ హామీ ఇచ్చి గద్దెనెక్కిన ఒమర్‌ కేంద్రంతో పూర్తిగా రాజీపడిపోయారన్న విమర్శలు మాత్రం ఆయన ఎదుర్కోకతప్పడం లేదు.

ఇవి కూడా చదవండి..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..

పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

Updated Date - Aug 20 , 2026 | 05:03 AM