Share News

సమాధానం లేని ప్రశ్నలు!

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:31 AM

అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా ఆశ్చర్యకరమైన పరిణామం. అభిశంసన ప్రక్రియ జోరందుకుంటున్న దశలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన...

సమాధానం లేని ప్రశ్నలు!

అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా ఆశ్చర్యకరమైన పరిణామం. అభిశంసన ప్రక్రియ జోరందుకుంటున్న దశలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన అధికారిక నివాసం అగ్నిప్రమాదానికి గురై, అగ్నిమాపక సిబ్బందికి కాలిన నోట్లకట్టలు దొరికిన విషయం తెలిసిందే. తీవ్ర సంచలనం రేపిన ఈ ఉదంతంపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ఖన్నా ముగ్గురు న్యాయమూర్తులతో ఒక అంతర్గత విచారణ కమిటీని నియమిస్తే, నోట్లకట్టల వ్యవహారం నిజమేనని ఆ కమిటీ నిర్థారించింది. ఆ దశలోనే రాజీనామాకు సీజేఐ సూచించినా యశ్వంత్‌ వర్మ తిరస్కరించారు. ఆ స్టోర్‌ రూమ్‌లో నగదు తమది కాదు, తాము దాచలేదని, అది పేరుకు అధికారనివాసంలో ఉన్నప్పటికీ, అందులోకి ఎవరైనా ప్రవేశించగల అవకాశాలున్నాయని ఆయన ప్రకటించారు. ఇది తనపై ఎవరో చేసిన కుట్ర అన్నది ఆయన వాదన సారాంశం. కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సైతం ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దానిని తిరస్కరించడమే కాక, వర్మపై అభిశంసనకు సిఫార్సుచేస్తూ రాష్ట్రపతికీ, ప్రధానికీ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ లేఖలు కూడా రాశారు. వర్మను తొలగించడానికి పార్లమెంటు సభ్యులు సంకల్పించారు. ఈ రాజీనామాతో అభిశంసన ఆగిపోయినప్పటికీ, జవాబులు లేని ప్రశ్నలైతే అనేకం ఉన్నాయి.

గత ఏడాది మార్చిలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వర్మ, ఆయన కుటుంబీకులు ఇంట్లో లేకపోవడం వల్లనే నోట్లకట్టల గుట్టు వెలుగులోకి వచ్చిందన్నది అనేకుల నమ్మకం. మరోపక్క, తాను ఢిల్లీలో లేనప్పుడు ఏదో కుట్ర జరిగిందని వాదించడానికి కూడా వర్మకు అవకాశం కలిగింది. తాను ఏ తప్పూ చేయలేదంటూ ఏడాది కాలంగా అనేక పోరాటాలు చేసి, ఎంతమంది చెప్పినా రాజీనామాకు ఒప్పుకోకుండా, చివరకు అభిశంసనను సైతం ఎదుర్కోవడానికి సిద్ధపడిన ఈయన ఇప్పుడు అస్త్రసన్యాసం చేయడం ఆశ్చర్యమే. సాంకేతికంగా ఆ ప్రక్రియ ముగిసిపోవడంతో ఆయనకు ఒక మాజీ న్యాయమూర్తికి దక్కాల్సిన గౌరవాలు, భత్యాలకు లోటేమీ ఉండదు. అభిశంసన జరిగివుంటే ఇవేమీ దక్కకపోగా, దేశచరిత్రలో దానికి గురైన ఏకైక న్యాయమూర్తిగా ఆయన పేరు నిలిచిపోయేది. ఆ పరిస్థితి రాకముందే కుర్చీనుంచి దిగిపోవడంతో, ఇటువంటివారి కోసం రాజ్యాంగం నిర్దేశించిన ప్రక్రియ నుంచి తప్పించుకున్న మరో న్యాయమూర్తిగా ఆయన పేరు మిగిలిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, నగదు దొరకడం నుంచి ఏడాదికాలంగా జరిగిందంతా చెరిగిపోయి, ఒక మాజీ న్యాయమూర్తి జాబితాలోకి ఆయన కూడా చేరిపోతాడు.


ఆయన అవినీతికి పాల్పడ్డారా లేదా, ఆ డబ్బు ఆయనది కానప్పుడు ఎవరిది, అక్కడకు ఎందుకు వచ్చింది, ఎలా చేరింది వంటి ప్రశ్నలు సమాధానం లేకుండా మిగిలిపోవడం సరికాదు. ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ నివేదికలోని తీవ్రమైన అంశాల ఆధారంగానే చీఫ్‌ జస్టిస్‌ అప్పట్లోనే ఈయనను రాజీనామా చేయమన్నారు. ఆ స్టోర్‌రూమ్‌ పూర్తిగా వర్మ కుటుంబీకుల వాడకంలో, నియంత్రణలో ఉన్నదనీ, బయటివ్యక్తులు రాగలిగే అవకాశాలు లేవని, అందులో కట్టలుగా ఉంచిన నోట్లు పెద్దమొత్తంలో తగలబడిన తరువాతే మిగతావాటిని బయటకు తరలించారని ఆ నివేదిక నిర్ధారించింది. న్యాయమూర్తుల కమిటీ యాభైఐదుమంది సాక్షులతో మాట్లాడి, పదిరోజుల పాటు శ్రమించి తయారుచేసిన నివేదిక అది. ఆ తరువాత అభిశంసనకు సిఫార్సు చేస్తూ చీఫ్‌జస్టిస్‌ రాసిన లేఖలోనూ అనేక విషయాలు ఉండివుంటాయి. గత ఏడాది ఆగస్టులో లోక్‌సభ స్పీకర్‌ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ శుక్రవారం నుంచి వర్మ తరఫు వాదనలు వినబోతున్న తరుణంలో ఆ ప్రక్రియ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. గతంలో ఈ కమిటీని సైతం కోర్టులో సవాలు చేసి భంగపడ్డారు. ఆ నోట్లతోనూ, ఆ గదితోనూ తనకేమి సంబంధమని వర్మ వాదిస్తున్నా, డబ్బు అక్కడే దొరికింది నిజం కనుక, అది ఎవరిదన్న ప్రశ్న మిగిలేవుంటుంది. అది లంచమా, లేక అటువంటి దురభిప్రాయం కలిగించడానికి ఒక నిప్పులాంటి న్యాయమూర్తిమీద ఎవరైనా పన్నిన కుట్రా? అన్నది తేలవలసి ఉంది. ఆయన రాజీనామా చేసినంతమాత్రాన తప్పు ఒప్పుకున్నట్టు కాదు. అభిశంసన ప్రక్రియ అటకెక్కినంతమాత్రాన కథ కంచికి చేరినట్టూ కాదు.

ఈ వార్తలూ చదవండి:

200 మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్ అదృశ్యం!

ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్

Updated Date - Apr 11 , 2026 | 05:31 AM