Share News

కూలిన న్యాయం

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:52 AM

మణిపూర్‌ ఘోరకలిలో సామూహిక అత్యాచారానికి గురైన ఒక యువతి ఇటీవల మరణించింది. కుకీ తెగకు చెందిన ఈమెను 2023 మే 15న మీతీ తెగకు చెందిన నలుగురు యువకులు...

కూలిన న్యాయం

మణిపూర్‌ ఘోరకలిలో సామూహిక అత్యాచారానికి గురైన ఒక యువతి ఇటీవల మరణించింది. కుకీ తెగకు చెందిన ఈమెను 2023 మే 15న మీతీ తెగకు చెందిన నలుగురు యువకులు జీపులో అపహరించుకుపోయి బిష్ణాపూర్‌ కొండల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆమెను తమ తెగకు చెందిన అరంబాయ్‌ తెంగోల్‌ అనే మిలిటెంట్‌ గ్రూప్‌కు అప్పగించారు. వారు ఆ రాత్రంతా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తెల్లవారిన తరువాత బాత్‌రూమ్‌కు వెళ్ళడానికి వారిలో ఒకడు ఆమె కట్లు విప్పడంతో ఎలాగో తప్పించుకొని కూరగాయల ఆటోలో దాక్కొని వెనక్కు రాగలిగింది. సమస్త వ్యవస్థలు మీతీల ఆధిపత్యంలో ఉంటూ, శాంతిభద్రతలు అత్యంత క్షీణదశలో ఉన్న కారణంగా ఆమె ఎటూ కదల్లేకపోయింది. రహస్యంగా కుకీల ఆశ్రయంలో ఉంటూ, నాగాలాండ్‌లోని ఒక ఆస్పత్రిలో కొంతకాలం చికిత్స తీసుకున్న తరువాత ఆమె స్వరాష్ట్రంలో తనపై జరిగిన ఘోరంపై జూలై 21న కొంతమంది సాయంతో ఫిర్యాదు చేసింది. నిందితులకోసం తీవ్రంగా గాలిస్తున్నామని, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని నెలరోజుల తరువాత ప్రకటించిన పోలీసులు ఇప్పటికీ అదేమాటమీద నిలబడ్డారు. భౌతికంగానూ, మానసికంగానూ కుంగిపోయిన ఆమె తనకు న్యాయం చేకూర్చని ఈ లోకం నుంచి నిష్క్రమించింది.

ఈ మూడేళ్ళలో ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సహా వివిధ ఆస్పత్రుల్లో ఆమెకు చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. గాయాల ప్రభావంతో, తీవ్ర మనోవేదనతో ఆమె జీవచ్ఛవంలాగా మారిపోయింది. తరచుగా స్పృహతప్పి పడిపోయేదని, కన్నుమూసే ఆఖరుక్షణంవరకూ ఆ ఘోరాన్ని మరిచిపోలేదని, అవమానభారంతో పాటు, నిందితుల్లో ఒక్కరినీ ఇప్పటివరకూ అరెస్టుచేయకపోవడం ఆమెను మరింత కుంగదీసిందని తల్లి బాధపడుతోంది. చలాకీగా, నవ్వుతూ గలగలామాట్లాడే తన కుమార్తె తనతో తప్ప మిగతావారితో మాట్లాడటం మానేసిందని, ఒంటరిగా గదిలో ఉంటూ వొణికిపోయేదని ఆ తల్లి ఆవేదన చెందింది. మణిపూర్‌లో మే తొలివారంలో మంటలు రేగి, అనతికాలంలోనే ఉధృతంగా సాగిన నేరాలూ ఘోరాలమీద ఎవరూ నోరువిప్పని, ఏ వ్యవస్థలూ అడ్డుపడని వాతావరణం ఎంతోకాలం యథేచ్ఛగా కొనసాగింది. ఇద్దరు కుకీ యువతులను మీతీ తెగకు చెందినవారు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి వెలుగుచూస్తే కానీ, అక్కడి తీవ్రత బాహ్య ప్రపంచానికి తెలియరాలేదు. కానీ, దీనికి నెలరోజుల ముందే నార్త్‌ అమెరికన్‌ మణిపూర్‌ ట్రైబల్‌ అసోసియేషన్‌ వంటి సంస్థలు జాతీయ మహిళా కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో మొత్తం ఆరు దారుణాలను ప్రస్తావిస్తే అందులో ఈ ముగ్గురు మహిళలకు సంబంధించిన రెండు ఘటనలూ ఉన్నాయి. మణిపూర్‌లో జరుగుతున్నదేమిటో తెలిసి కూడా ఢిల్లీ పెద్దలతో పాటు, అత్యున్నత సంస్థలు, వ్యవస్థలు స్పందించలేదన్నది నిజం.


కుకీ, మీతీ తెగల మధ్య సుదీర్ఘకాలం సాగిన ఆ ఊచకోతల్లో వందలమంది మరణించారు, అనేకమంది మహిళలు అత్యాచారాలకు గురైనారు. మీతీ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ ఒక పథకం ప్రకారం కుకీ–జోలపై ఈ హింసను అనుమతించి, మీతీలకు ఆశీస్సులతో పాటు ఆయుధాలు సైతం అందించి తీవ్రంగా అప్రదిష్టపాలైనా బీజేపీ పెద్దలు ఆయనను తప్పించడానికి ఇష్టపడలేదు. చివరకు సుప్రీంకోర్టు అక్షింతలు వేశాక, అవిశ్వాస తీర్మానంలో బీరేన్‌ ఓటమి ఖాయమని తేలడంతో దించేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని మణిపూర్‌ సందర్శించినా, అక్కడ ఏమీ జరగనట్టు, తానేమీ ఎరగనట్టుగా ప్రవర్తించి వచ్చేశారు. మణిపూర్‌ను రాష్ట్రపతి పాలనలోకి తెచ్చి వచ్చేనెలకు ఏడాది అవుతోంది. అయినా, బాధిత కుటుంబాల వారికి అదే నిర్లక్ష్యం, నిర్లిప్తత, బాధ్యతారాహిత్యం ఎదురవుతున్నాయి. ఇప్పుడు కన్నుమూసిన యువతి కేసు సహా ఇలా జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినవేవీ ముందుకు కదల్లేదని, నిందితులను గుర్తించడం, పట్టుకోవడం జరగలేదని మీడియా విశ్లేషిస్తోంది. స్థానిక పోలీసు స్టేషన్లనుంచి సీబీఐ చేతుల్లోకి పోయిన కేసుల్లో ఈమెది కూడా ఒకటి. కేసులు తేల్చకుండా, మూయకుండా ఒక నిస్సిగ్గు నాటకం అలాగే కొనసాగుతోంది. ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదిపేసింది కనుక, దానికి కారకులైనవారిలో కొందరిని మాత్రం అరెస్టుచేసి సీబీఐ కేసులు పెట్టింది. బిష్ణాపూర్‌ కొండల్లోనూ, మీతీ మిలిటెంట్ల చేతుల్లోనూ సామూహిక అత్యాచారానికి గురైన ఈ కుకీ యువతికి మరణానంతర న్యాయమైనా చేకూర్చమని కుకీ జో సంఘాలు చేస్తున్న డిమాండ్లు, ప్రార్థనలు ఫలిస్తే సంతోషం.

ఇవి కూడా చదవండి

8 యుద్ధాలను ఆపాం.. దావోస్‌లో ట్రంప్ పాతపాట

విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం.. బాధితులను స్టేషన్‌కు పిలిస్తే అధికారులదే బాధ్యత

Updated Date - Jan 22 , 2026 | 03:52 AM