ఖేదం–మోదం!
ABN , Publish Date - Aug 19 , 2026 | 01:00 AM
ఝార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో పదహారురోజులుగా చేస్తున్న నిరాహారదీక్షను ముగించడం హేమంత్ సోరేన్ ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం. ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సి) నిర్వహించిన...
ఝార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో పదహారురోజులుగా చేస్తున్న నిరాహారదీక్షను ముగించడం హేమంత్ సోరేన్ ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం. ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సి) నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజిఎల్) పరీక్షను రద్దుచేయాలని సోమవారం ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, మహతో తన దీక్షకు స్వస్తిపలికారు. విద్యార్థి ఉద్యమానికి దారితీసిన, వారి ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఈ పరీక్ష రద్దుతో పాటు, 2014నుంచి వివాదాస్పద ప్రైవేటు సంస్థ నిర్వహించిన అన్ని పరీక్షలను, వాటి ఫలితాలను రద్దుచేయాలని కూడా రాష్ట్రప్రభుత్వం నిర్ణయించడం విశేషం. అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలన్న విద్యార్థుల డిమాండ్‌కు మాత్రం ప్రభుత్వం లొంగలేదు. ఇది నెరవేరేవరకూ ఉద్యమం కొనసాగించాలని ఒక విద్యార్థివర్గం నిర్ణయించుకుంటే, మహతో మాత్రం ప్రభుత్వం చర్యలపట్ల సంతృప్తిచెంది దీక్ష విరమించారు. వేయికళ్ళతో ప్రభుత్వాన్ని గమనిస్తూంటామని, పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగాలన్న తమ డిమాండ్ నెరవేర్చే విషయంలో తప్పటడుగులు వేస్తే మళ్ళీ ఉద్యమానికి దిగుమతామని హెచ్చరించి వదిలేయడంతో ప్రభుత్వం ప్రస్తుతానికి సంక్షోభం నుంచి బయటపడినట్టే.
ఉద్యమాన్ని మరికొంత కాలం సాగనిస్తే, కొత్త కొత్త డిమాండ్లు వచ్చిచేరి, చివరకు తమ పదవులకే ముప్పురావచ్చునని సోరేన్ ప్రభుత్వం గుర్తించినట్టుంది. సిఐడి, సిట్ విచారణల్లో పలు అక్రమాలు బయటపడ్డాయని, అయినా వాటిని ఇప్పుడు తాను బయటకు చెప్పకూడదని అంటున్న సోరేన్ మంచో, చెడో ఈ నిర్ణయానికి ముందుగానే రావల్సింది. సదరు ప్రైవేటు సంస్థను గత ఏడాది బ్లాక్‌లిస్టులో ఎందుకు పెట్టవలసి వచ్చిందో తెలియనిదేమీ కాదు. పరీక్ష అక్రమాలకు సంబంధించి మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వెలుగుచూస్తున్న విషయాలన్నీ నిజం కాకపోవచ్చును కానీ, మార్కుల్లో అక్రమాలు, ఓఎంఆర్ షీట్ల అవకతవకలవంటివి ఇప్పటికే రుజువైనాయి. ఈ నేపథ్యంలోనే, గత పన్నెండేళ్ళకాలంగా టిఎస్‌ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్–టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దుచేయడం, సీఐడీతో పాటు, రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక కమిటీతో వాటిపై విచారణ జరపడం, విద్యార్థుల ఫిర్యాదులను ప్రత్యేక పోర్టల్ ద్వారా స్వీకరించి నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించడం వంటి చర్యలనేకం ముఖ్యమంత్రి ప్రకటించారు. నియామక పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు బలమైన చట్టం చేశామని, నిర్వహణలో సంస్కరణలకోసం ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. విద్యార్థి నాయకులకు రాహుల్ మద్దతు ప్రకటించి, వారితో ఫోన్‌లో మాట్లాడటం, వెంటనే చర్చలు జరపాలంటూ సోరేన్‌కు సూచించడం బాగుంది.
దేవేంద్రమహతో వ్యాఖ్యానించినట్టుగా, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష రద్దుకు సోరేన్ ప్రభుత్వం నిర్ణయించడం సాహసమే. ఆ ప్రభావం కూడా వెంటనే కనిపించింది. ఒకపక్క, పరీక్ష రద్దుకోసం ఉద్యమించిన వేలాదిమంది దీక్షాస్థలిలో వేడుకలు చేసుకుంటే, మరోపక్క, ఆ పరీక్షలో ఇప్పటికే ఎంపికై, ఉద్యోగాల్లో చేరిన రెండువేలమంది కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, ఏజెన్సీ అక్రమాలపై సీఐడీ విచారణ సాగుతూ, రెండేళ్ళుగా ఈ పరీక్ష వివాదంలో నలుగుతున్నప్పటికీ, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు నియామకపత్రాలు అందుకున్న వారంతా ఇప్పుడు రోడ్లమీదకు వచ్చి పోరాటం ప్రారంభించారు. పుష్కరకాలంగా జరిగిన అన్ని పరీక్షల రద్దుపై అసంతృప్తితో ఉన్నవారెవరైనా న్యాయస్థానాలకు పోవచ్చునని ఆ రాష్ట్రమంత్రి చేసిన వ్యాఖ్యలో హెచ్చరికే ఉన్నదో, సూచనే ఉన్నదో తెలియదు కానీ, ఈ నిర్ణయంమీద రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయి పోరాటాలతో పాటు, న్యాయపోరాటాలు కూడా జరగడం ఖాయం. ఇక, జంతర్ మంతర్ ఉద్యమానికీ, ఝార్ఖండ్ ఉద్యమానికి ఎంతో తేడా ఉన్నదంటూ ఎవరికి నచ్చిన వ్యాఖ్యలు వారు చేస్తున్నారు. ఉన్నతస్థానాల్లో ఉన్నవారిని దూషించకుండా, సోషల్ మీడియాలో మీమ్స్‌తో రచ్చచేయకుండా రాంచీ ఉద్యమం సాగిందంటూ పరోక్షంగా జంతర్‌మంతర్ ఉద్యమాన్ని తప్పుబట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. కేవలం పక్షంరోజుల ఎడం ఉన్న ఈ రెండు విద్యార్థి ఉద్యమాల మధ్యా వ్యవహరణలో ఏవో తేడాలు ఉండవచ్చునుగానీ, అంతిమంగా ఈ రెండూ చెబుతున్నది ఒకటే, పరీక్షలను సక్రమంగా నిర్వహించకపోతే యువత ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం