ఏడేళ్లుగా అదే అన్యాయం
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:44 AM
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించాలంటూ అసెంబ్లీలో చర్చ ప్రారంభానికి కొద్దిగంటలముందు, దానిని అనుమతించవద్దంటూ ఇద్దరు ఉన్నతాధికారుల నుంచి స్పీకర్‌కు ఒక లేఖ...
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించాలంటూ అసెంబ్లీలో చర్చ ప్రారంభానికి కొద్దిగంటలముందు, దానిని అనుమతించవద్దంటూ ఇద్దరు ఉన్నతాధికారుల నుంచి స్పీకర్‌కు ఒక లేఖ అందింది. ఈ అంశం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున సదరు తీర్మానాన్ని చేపట్టకూడదంటూ జమ్మూకశ్మీర్ చీఫ్ సెక్రటరీ అటల్ దులూ, లా సెక్రటరీ అచల్ సేఠీ విడివిడిగా స్పీకర్‌కు లేఖలు రాశారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతించిన మూడురోజులకు, సభ సిద్ధపడుతున్న తరుణంలో ఉన్నతాధికారులు ఇద్దరినుంచీ ఈ హెచ్చరిక వచ్చింది. సభా కార్యక్రమాలను అడ్డుకొనేందుకు ఉద్దేశించిన ఈ లేఖలను, సంబంధిత మంత్రి ఆమోదం లేకుండా వారిరువురూ అసెంబ్లీ సెక్రటేరియేట్‌కు పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. శాసనసభ కార్యకలాపాల్లో అధికారయంత్రాంగం జోక్యం చేసుకోవడమేమిటన్న అధికారపక్షం ఆగ్రహాన్ని అటుంచితే, న్యాయశాఖమంత్రి కూడా అయిన ఒమర్ అబ్దుల్లాకు ఈ లేఖలు పెద్ద షాక్ ఇచ్చాయి. స్పీకర్‌గారూ, నేను న్యాయమంత్రినీ, ముఖ్యమంత్రిని కూడా. కానీ, నా తీర్మానాన్ని అడ్డుకోమంటూ నా అధికార యంత్రాంగం నాకు తెలియకుండా మీకు లేఖలు రాయడం పెద్ద విషాదం. అది ఎవరి ఆదేశాల మేరకు జరిగిందో నాకు తెలియదు. కానీ, ముఖ్యమంత్రి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే, బ్యూరోక్రసీ దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ఈ దేశంలో ఎన్నడైనా చూశామా? ఇది వేరెక్కడైనా జరుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు.
ఈ కేంద్రపాలిత ప్రాంతానికి పూర్తిస్థాయి రాష్ట్రహోదా పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ తీర్మానించడం ఇదేమీ తొలిసారి కాదు. అటువంటి తీర్మానం చేయడం అక్రమమని స్పీకర్‌ను, మంత్రివర్గాన్ని అధికారులు హెచ్చరించడం మాత్రం న్యాయనిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రస్తుత తీర్మానంమీద, అందులో వాడిన పదజాలంమీద విపక్ష బీజేపీకి ఏవో అభ్యంతరాలు ఉన్నందున అది దానిని అడ్డుకొనేందుకు ప్రయత్నించడం, సభనుంచి వాకౌట్ చేయడం సహజం. గతకాలపు తీర్మానాలు, మరీముఖ్యంగా పాతికేళ్ళనాటిది ఇందులో ప్రస్తావించడం ఆ పార్టీకి అభ్యంతరకరంగా తోచింది. ఆర్టికల్ 370, 35ఏ పునరుద్ధరణ సహా స్వయంప్రతిపత్తితో కూడిన రాష్ట్రహోదా ఇవ్వాలని ఈ తీర్మానంలో మిగతా పార్టీలన్నీ కోరడం బీజేపీకి నచ్చలేదు. చర్చను అడ్డుకొనేందుకు పలువిధాల ప్రయత్నించిన 29మంది బీజేపీ ఎమ్మెల్యేలు సభనుంచి వాకౌట్ చేసిన తరువాత, పూర్తిస్థాయి రాష్ట్రహోదాను కోరుతూ అసెంబ్లీ తీర్మానించింది.
2023 డిసెంబరులో ఆర్టికల్ 370రద్దును సమర్థిస్తూనే, జమ్మూకశ్మీర్‌కు వీలైనంత త్వరగా రాష్ట్రహోదా పునరుద్ధరించాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం ఆ విధంగా హామీ పడిన మేరకు కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవి. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా తగ్గించివేయడమన్నది జమ్మూకశ్మీర్ విషయంలోనే జరిగింది. డెబ్బయ్యేళ్ళ ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేసి, కేంద్రపాలితప్రాంతంగా కుదించి ఏడేళ్ళు పూర్తయిన ఈ కాలంలో రాష్ట్రహోదా పునరుద్ధరిస్తామంటూ కేంద్రపాలకులు లెక్కకుమించినన్నిసార్లు హామీలు ఇచ్చారు. 2019 అక్టోబర్‌లో అంటే, ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేసిన రెండునెలల్లోనే ‘సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే’ అంటూ అమిత్‌షా హామీపడ్డారు. చాలాసార్లు అలా మాట ఇచ్చాక, ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన జరిగి, ఎన్నికలయ్యేంతవరకూ ఓపిక పట్టమన్నారు. 2024సెప్టెంబర్‌లో ఎన్నికలకు నాలుగునెలల ముందే ప్రచారం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఈ ఎన్నికలయ్యాక రాష్ట్రప్రతిపత్తి ఖాయమని ప్రజలకు మాట ఇచ్చారు. గతానికి పూర్తిభిన్నంగా, బహిష్కరణ పిలుపును ఏ మాత్రం ఖాతరుచేయకుండా ఆ ఎన్నికల్లో ప్రజలు భారీసంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 64శాతం ఓటింగ్ జరిగిన ఆ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయాన్ని బీజేపీ అడ్డుకోలేకపోయింది. కానీ, ఉగ్రవాద సంఘటనలేమీ లేకుండా, ఒక్క బుల్లెట్ కూడా పేలకుండా మూడుదశాబ్దాలుగా చూడనిరీతిలో అత్యంత శాంతియుతంగా ఆ ఎన్నికలు జరిగాయి. అప్పటికి ఐదేళ్ళుగా అనుభవించిన కష్టాలు, జరిగిన అన్యాయాలను పక్కనబెట్టి ప్రజలు మళ్ళీ తమ విశ్వాసాన్ని ప్రకటిస్తే, కేంద్రప్రభుత్వం మాత్రం తన హామీని గాలికి వదిలేసి, ప్రజాతీర్పును అపహాస్యం చేస్తోంది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఏలుబడిలో ఉన్న అక్కడి వ్యవస్థ ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధులను కనీసం తీర్మానాలు కూడా చేయనివ్వకుండా అడ్డుపడుతోంది.
ఈ వార్తలూ చదవండి
సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్