Share News

శాంతి కెరటాలు..!

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:27 AM

అద్భుతం, మహాద్భుతం అంటున్నవారున్నారు, కనీసం సంతకాలు అయ్యేదాకా నిలుస్తుందా? అని శంకిస్తున్నవారూ ఉన్నారు. ఇజ్రాయెల్‌ అధినేత మరోపక్క కస్సుబుస్సులాడుతూ కళ్ళు ఉరిమి చూస్తూంటే...

శాంతి కెరటాలు..!

అద్భుతం, మహాద్భుతం అంటున్నవారున్నారు, కనీసం సంతకాలు అయ్యేదాకా నిలుస్తుందా? అని శంకిస్తున్నవారూ ఉన్నారు. ఇజ్రాయెల్‌ అధినేత మరోపక్క కస్సుబుస్సులాడుతూ కళ్ళు ఉరిమి చూస్తూంటే, వందరోజులుగా సాగుతున్న ఓ సుదీర్ఘయుద్ధాన్ని ముగించేందుకు కుదిరిన ఈ పరిమిత అవగాహన మీద అనేక అనుమానాలు ఉండటం సహజం. అయినప్పటికీ, వందరోజులు దాటిన ఈ ఘర్షణ ముగింపు దిశగా ఇది తొలి అడుగు. మిగతా ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తున్న ఒప్పందానికి దారులు తెరుచుకోవడం కచ్చితంగా సంతోషించాల్సిన పరిణామం.

యుద్ధం ఆరంభించిన అమెరికా అధ్యక్షుడు ఇప్పటికి కనీసం ఓ నలభైసార్లు ఒప్పందానికి అడుగుదూరంలో ఉన్నామని, రేపోమాపో సంతకాలు అయిపోతాయన్నట్టుగా మాట్లాడటం, ఇరాన్‌ ఆ వ్యాఖ్యలను తేలికగా తీసిపారేయడం చూశాం. ఈ మారు ఇరాన్‌, మధ్యవర్తి పాకిస్థాన్‌ కూడా ఔను నిజమే అన్నందువల్ల ప్రపంచానికి నమ్మకం కలిగింది. ఒప్పందంలోని నిబంధనలు ఇవే అంటూ ఇరాన్‌ చెబుతున్నవాటికీ, విజయం నాదేనంటూ వీరంగం వేస్తూ ట్రంప్‌ అంటున్నదానికీ చాలా తేడాలు న్నాయి. లెబనాన్‌ సహా ఇరాన్‌ మిత్రపక్షాలపై తక్షణం యుద్ధం నిలిపివేయడం, అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ముగించడం, ఇరాన్‌ చమురుపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తివేసి మొత్తం సొమ్ము దానికే దక్కేట్టు చూడటం, ఇరాన్‌ పునర్నిర్మాణానికి 300 బిలియన్‌ డాలర్ల ప్రణాళికను అమెరికా ఆమోదించడం, స్తంభింపచేసిన సొమ్ములో సగం చర్చలకు ముందే ఇచ్చేయడం వంటివి ఈ అవగాహనకు ప్రాతిపదికలని ఇరాన్‌ చెబుతోంది. తమదే పైచేయిగా కనిపించడానికి ఉభయపక్షాలు తమ అనుకూలమైన అంశాలనే ప్రచారంలోకి తెస్తున్నాయి. ఇరాన్‌ కోరికల్లో తక్షణం అమలు చేయగలిగేవి కొన్ని నెరవేరుతున్న సూచనలతో పాటుగా, చమురు స్వేచ్ఛగా ప్రవహించనీ అంటూ ఘర్షణలకు ఏ మాత్రం తావులేని వాతావరణం కల్పిస్తున్నట్టుగా ట్రంప్‌ మాటలూ, చేతలూ ఉన్నాయి. అయితే, సదరు ముసాయిదాలో మూడుచోట్ల, మూడు సందర్భాల్లో లెబనాన్‌ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయాన్ని ఇరాన్‌ మరీమరీ గుర్తుచేస్తోంది. హిజ్బొల్లామీద ఈగవాలినా పరిస్థితి మొదటికొస్తుందనీ, అందువల్ల, ఈ అవగాహనలకూ, ఒప్పందాలకూ, మొత్తంగా యుద్ధాన్ని ముగించడానికీ బద్ధవ్యతిరేకి అయిన ఇజ్రాయెల్‌ అధినేత నెతన్యాహూను నియంత్రించాల్సిన బాధ్యత పూర్తిగా అమెరికా అధ్యక్షుడిదేనని ఇరాన్‌ హెచ్చరిస్తోంది. ఇక, టోల్‌ వసూలు చేస్తే తోలు తీస్తానని ట్రంప్‌ ఎన్ని ప్రగల్భాలకు పోయినా, సుంకాలు లేని స్వేచ్ఛాయుత సరఫరాలు అంటూ ఇప్పుడు ఏదో చెబుతున్నా, నిర్వహణ, పర్యావరణం ఇత్యాది ఖర్చుల పేరిట హోర్ముజ్‌ వసూళ్ళు కొనసాగుతాయన్నది ఇరాన్‌ ప్రకటన సారాంశం. ఇక, ఆ అరవైరోజుల చర్చాకాలమే అసలైనదీ, సంక్లిష్టమైనదీ. యురేనియం నిల్వలు, రాతలూ కోతలూ, మూడోపక్షం దగ్గర ఉంచడాలు, క్షిపణుల లెక్కలు, నియంత్రణలూ వంటి యుద్ధకారణాలైన అంశాలు తేలాల్సింది ఆ అరవైరోజుల్లోనే.


ఈ ఒప్పందానికి ప్రప్రథమంగా సంతోషించాల్సింది నెతన్యాహూయే, ఇరాన్‌ దగ్గర అణ్వస్త్రం గనుక ఉండివుంటే కేవలం రెండుగంటల్లో నాశనమయ్యేది తొలిగా ఆయన దేశమేనంటూ ట్రంప్‌ ఓ వ్యాఖ్య చేశారు. అణ్వస్త్రం పేరిట తనను యుద్ధంలోకి లాగిన నెతన్యాహూపై ఎప్పటిలాగానే ఆగ్రహిస్తున్నట్టుగా ట్రంప్‌ కనిపిస్తున్నారు. లెబనాన్‌ సహా అని ట్రంప్‌ అంగీకరిస్తే, అది ఒప్పందంలో లేదనీ, ఉన్నా మాకు నిమిత్తం లేదనీ నెతన్యాహూ మంత్రులు మాట్లాడుతున్నారు. మాది ఆషామాషీ బనానా రిపబ్లిక్‌ కాదు, లెబనాన్‌, గాజా, సిరియాలనుంచి ఒక్క ఇజ్రాయెలీ సైనికుడు కూడా కదలడంటూ రక్షణమంత్రి సహా అక్కడి మితవాదులు, మతవాదులూ హెచ్చరికలు చేస్తున్నారు. చర్చలంటూ ఆరంభమే కాని ఉద్రిక్త వాతావరణాన్ని దాటి, మధ్యలో విఫలమైనా మళ్ళీ కొనసాగి, ఎట్టకేలకు ఈ దశకు చేరడం ప్రశంసనీయం. రెండు నెలలుగా కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ, లెబనాన్‌ మీద ఇజ్రాయెల్‌ విరుగుబాటు కారణంగా పలుమార్లు ఉల్లంఘనలు జరగడం, ఇరాన్‌ను లొంగదీసే క్రమంలో అమెరికా కూడా గతవారం దాడులు చేయడం తెలిసిందే. శుక్రవారం జెనీవాలో సంతకాలు జరిగి, అరవైరోజుల చర్చల్లో సంక్లిష్టమైన అంశాలన్నీ కొలిక్కివచ్చి, యుద్ధభూమి నుంచి కాలువెనక్కుతీసుకోవాలన్న ట్రంప్‌ కోరిక ఎట్టకేలకు తీరాలని ఆశిద్దాం. మూడునెలల క్రితం యుద్ధానికి దిగుతూ ఆయన ప్రకటించిన లక్ష్యాల్లో ఏదీ నెరవేరకపోగా, ఆయన తెచ్చిపెట్టిన ఈ విపత్తుతో నిండామునిగిన మిగతా ప్రపంచం శాంతికోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది.

ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 16 , 2026 | 01:27 AM