Share News

మళ్లీ మొదటికి..!

ABN , Publish Date - Jun 02 , 2026 | 02:25 AM

ఇరాన్‌–అమెరికా మధ్య శాంతి ఒప్పందం ప్రయత్నాలు ఇప్పటివరకూ కనీసం రెండు అడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కు తరహాలోనైనా కదులుతున్నందుకు ప్రపంచం సంతోషిస్తుంటే, ఇకపై ఆ మాత్రం....

మళ్లీ మొదటికి..!

ఇరాన్‌–అమెరికా మధ్య శాంతి ఒప్పందం ప్రయత్నాలు ఇప్పటివరకూ కనీసం రెండు అడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కు తరహాలోనైనా కదులుతున్నందుకు ప్రపంచం సంతోషిస్తుంటే, ఇకపై ఆ మాత్రం కదలిక కూడా ఉండబోదని ఇరాన్‌ ప్రకటనతో తేలిపోయింది. ఒప్పందాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు సాగిస్తోందన్న వాదనే చివరకు నిజమైంది. ఈ దాడులు ఆగేవరకూ అమెరికాతో చర్చలు సాగవని ఇరాన్‌ తేల్చేసింది. మధ్యవర్తుల ద్వారా పరోక్షంగా జరుపుతున్న చర్చలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతోపాటు, యుద్ధం కొనసాగితే తాను ఏమి చేయబోతున్నదీ ఇరాన్‌ ప్రకటించింది. ఇరాన్‌తో పాటు, యెమెన్‌, లెబనాన్‌, ఇరాక్‌లోని భాగస్వామ్య కూటమి అంతా కలిసికట్టుగా హోర్ముజ్‌, బాబ్‌ ఎల్‌ మాండేబ్‌ సముద్ర మార్గాలను మూసివేయాలని నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. హోర్ముజ్‌ దిగ్బంధంతో అంతర్జాతీయంగా ఇంధనధరలు పెరిగిన తరుణంలో, ఇప్పుడు మాండేబ్‌ నియంత్రణ ద్వారా సూయిజ్‌ కాలువవైపు వెళ్ళే రవాణాను కూడా ‘రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ అడ్డుకున్నపక్షంలో ప్రపంచ ఆర్థికం బాగా దెబ్బతింటుంది.

లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నా కూడా ఇజ్రాయెల్‌ దాడులను ఆపలేదు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్‌ వీరంగం వేస్తున్నా ట్రంప్‌ నోరుమెదపడం లేదు. ఏ ఒక్క దిశగా ఉల్లంఘన జరిగినా, అది కూడా ఇలా ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా జరిగినప్పుడు ఒప్పందం మొత్తం కుప్పకూలినట్టే అని ఇరాన్‌ అంటోంది. గాజా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్‌ తన పాశవికమైన దాడులను తక్షణమే నిలిపివేసి, లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి అది తన సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలన్నది ఇరాన్‌ డిమాండ్‌. దాడులు ఆగితేనే చర్చలు సాగుతాయన్న ఇరాన్‌ వాదనలో తప్పుబట్టాల్సిందేమీ లేదు. ఇరాన్‌ ప్రతీకార దాడులకు తాళలేక, గల్ఫ్‌లోని మిత్రదేశాలకు తీవ్ర నష్టం ఒనగూరుతున్న కారణంగా చేయగలిగిందేమీ లేక తాత్కాలిక ఒప్పందం కోసం అమెరికా, ఇజ్రాయెల్‌ దిగివచ్చాయి. నిబంధనలకు కట్టుబడి ఒప్పందాన్ని కుదర్చుకున్నాక వాటిని ఉల్లంఘించడమే కాక, ప్రశ్నించిన ఇరాన్‌ మీద కయ్యానికి కాలుదువ్వుతున్నదంటూ ఎదురుదాడులు చేయడం అన్యాయం. ఆరువారాల క్రితం లెబనాన్‌తో కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ వీసమెత్తు గౌరవించలేదు. హిజ్బొల్లాను తుదముట్టించే పేరిట వేలాదిమంది సామాన్యులను హతమార్చి లక్షలమందిని నిరాశ్రయులను చేయడమే కాక, ఇప్పుడు గాజా తరహాలో లెబనాన్‌లోకి పూర్తిగా చొరబడి, దక్షిణ లెబనాన్‌లోని కీలకప్రాంతాలను దురాక్రమించుకొనే ఆలోచనలో నెతన్యాహూ ఉన్నారు. ఏప్రిల్‌ 17న ఎంతో ఘనంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్‌, తాను ఇజ్రాయెల్‌ దాడులను అడ్డుకున్నానని కూడా అప్పట్లో గొప్పలకు పోయారు. కానీ, ఐడీఎఫ్‌ ఏ మాత్రం వెనక్కుతగ్గని కారణంగా ఇప్పటికే, చాలాప్రాంతాలు ఇజ్రాయెల్‌ అధీనంలోకి వచ్చాయి. గాజాలో కూడా మరో పదిశాతం భూభాగాన్ని అధీనంలోకి తీసుకోవలసిందిగా ఐడీఎఫ్‌ను నెతన్యాహూ ఆదేశించారు.


నేడో, రేపో ఒప్పందం ఖాయం అని గతవారం ఒకటికి రెండుసార్లు ప్రకటిస్తూనే, మరిన్ని డిమాండ్లతో కొత్త ప్రతిపాదనను ఇరాన్‌కు పంపిన ట్రంప్‌, తదనుగుణంగా ఒత్తిడిపెంచేందుకు సరికొత్తదాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా అమెరికన్‌ సైనికస్థావరాల మీద ఇరాన్‌ దాడులు చేసింది. శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నప్పుడల్లా అమెరికా, ఇజ్రాయెల్‌ కూడబలుక్కొని ఆ వాతావరణాన్ని చెడగొడుతున్నాయి. శాంతికీ, సయోధ్యకు ఇరాన్‌ సిద్ధపడితే అంతకంటే సంతోషించాల్సిందేమీ లేదని ట్రంప్‌ ఒకవైపు ప్రవచిస్తూంటారు, మరోపక్క కాల్పుల విరమణ సవ్యంగా సాగనివ్వకుండా నెతన్యాహూతో కలిసి ఇరాన్‌నీ, దాని మిత్రశక్తులనూ రెచ్చగొడుతూంటారు. నిలిచిన చర్చలు తిరిగి ఆరంభమయ్యేట్టు చూడాల్సిన బాధ్యత అంతిమంగా ఈ విషమ పరిస్థితులను సృష్టించినవారిమీదే ఉంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ఆరంభిస్తూ, తాను ప్రకటించిన లక్ష్యాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదనీ, తాను సాధించిందేమీ లేదని ట్రంప్‌ ఇప్పటికైనా గుర్తించాలి.

ఈ వార్తలనూ చదవండి:

పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు..

Updated Date - Jun 02 , 2026 | 02:25 AM