Indore Water Contamination: విషధార..
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:32 AM
ఒకటా, రెండా... ఏకంగా ఏడుసార్లు ‘క్లీన్‌సిటీ’ అవార్డు అందుకున్న ఇండోర్‌లో ఇంతటి ఘోరవిషాదం సంభవించడం ఆశ్చర్యం. నేలకింద నీరు కాదు, విషం పారుతోందన్న నిజాన్ని బేఖాతరుచేస్తూ...
ఒకటా, రెండా... ఏకంగా ఏడుసార్లు ‘క్లీన్‌సిటీ’ అవార్డు అందుకున్న ఇండోర్‌లో ఇంతటి ఘోరవిషాదం సంభవించడం ఆశ్చర్యం. నేలకింద నీరు కాదు, విషం పారుతోందన్న నిజాన్ని బేఖాతరుచేస్తూ, ఉపరితలంలో కనిపిస్తున్నదానికే మురిసిపోతూ ఈ నగరానికి ఇన్నిసార్లు అవార్డులు ఇచ్చేశారా? స్వచ్ఛత పురస్కారాలకు, ఎంపిక ప్రాతిపదికలకే కళంకం తెచ్చే ఘటన ఇది. మెరిసిపోతున్న రోడ్లకింద మంచినీటితో పారుతున్న ఆ పైపుల్లో మలమూత్రాలు కలగలసి అనేకమంది ప్రాణాలుపోయాయి. ఆస్పత్రుల్లో చేరినవారిలో కొందరి పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. వందలాదిమంది ఆరోగ్యాలు ఇంకా కుదటపడలేదు. పేదలు నివసించే భగీరథపురలో జరిగిన ఈ ఘటన తాగేనీటి హక్కులోనూ ఆర్థిక తారతమ్యాలు ఉంటాయని తెలియచెప్పింది.
ఈ దురదృష్టకరఘటన తరువాత, ఈ అవార్డుల నగరానికి అన్నీఇన్నీ మరకలు కావంటూ పలు ప్రత్యేక కథనాలు వెలుగుచూస్తున్నాయి. నీటి నాణ్యత బాగోలేదని, కలుషిత నీటిమీద ఫిర్యాదులు వస్తున్నా పరిష్కారానికి నెలలు పడుతోందని, ట్యాంకులు, పైపుల నిర్వహణ సక్రమంగా లేదని, అనేక ప్రాంతాలకు స్వచ్ఛమైన నీరు అందడం లేదని కాగ్ గతంలోనే చీవాట్లు పెట్టిందట. ఇండోర్‌లో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుర్తించి, హెచ్చరించిన యాభైఎనిమిది కలుషితనీటి ప్రమాదం గల ప్రాంతాల్లో భగీరథపురా ఒకటి. అందువల్ల, ఇది అనూహ్యమైనదీ కాదు, ఆకస్మికంగా జరిగిపోయినదీ కాదు. మూలాలు తెలియకుండా, ఊహకు అందకుండా ఊడిపడ్డ ప్రమాదమేమీ కాదు. ఈ ఘోరం ఎలా, ఎందుకు జరిగిందో అర్థమైన నేపథ్యంలో, ఇంతమంది ప్రాణాలు పోయేవరకూ ఎందుకు ఊరుకున్నారన్నదే అసలు ప్రశ్న. కనీసం స్థానికుల మొర ఆలకించినా ప్రమాదం నివారించగలిగేవారేమో. తాము తాగుతున్న మంచినీటి రంగు, రుచి, వాసన బాగా మారిపోయాయంటూ వారంరోజులుగా స్థానికులు చేస్తున్న ఫిర్యాదులు మీడియాలో సైతం ప్రముఖంగా వచ్చాయి. పేదల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నామని తెలిసికూడా ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించడం అమానుషం. పరిస్థితి పూర్తిగా విషమించి, కొందరి ప్రాణాలు పోతేగానీ అధికారుల్లో చలనం రాకపోవడం, రంగంలోకి దిగకపోవడం దురదృష్టకరం. మంచినీటి పైపుల్లోకి మురుగునీరు ప్రవేశించే అవకాశమూ, ప్రమాదమూ అత్యధిక నగరాల్లో ఉంది. మరీ ముఖ్యంగా, రెండు పూర్తి భిన్నమైన లక్ష్యాలకు ఉద్దేశించిన ఈ పైప్‌లైన్లు ఒకదానికి ఒకటి దూరంగా కాక, పక్కపక్కనే సాగుతూంటే, అవిదశాబ్దాలనాటివి కూడా అయితే ప్రమాదం మరీ ఎక్కువ. నీటిసరఫరా లేని వేళల్లో మంచినీటి పైపుల్లోకి చేరిన మురుగునీరు ఆ తరువాత జనం గొంతుల్లోకి విషంగా దిగుతుంది, అత్యంత ప్రమాదకర వ్యాధులతో వారిని మంచాన పడవేస్తుంది, ప్రాణాలు హరిస్తుంది. అనేక పాతనగరాల్లో మాదిరిగా ఇండోర్‌లోనూ వందేళ్ళకు పైబడిన మంచినీటి పైపులనే ఇప్పటికీ మరమ్మత్తులు చేస్తూ నెట్టుకొస్తున్నారట. వలసపాలనకాలంలోనో, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లోనో వేసిన పైపులే ఇప్పటికీ చాలా నగరాలకు దిక్కు.
ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు రాజకీయనాయకుల మాటల యుద్ధానికి అంతం ఉండదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విపక్షనేతలు ఆంటారు. మహా విషాదాన్ని రాజకీయం చేయవద్దని అధికారపక్షం అంటుంది. నేడు ఇండోర్‌లో మరింత తీవ్రంగా ఉండవచ్చును గానీ, పలు నగరాల్లో తాగేనీరు ప్రాణాంతకంగా పరిణమించిన సందర్భాలు గత రెండేళ్ళకాలంలోనే అనేకం చూశాం. అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతలేనితనం దీనికి ప్రధాన కారణం. వందలకోట్ల ఖర్చుతో ఏకంగా నదులనే ప్రక్షాళిస్తామంటున్న పాలకులు ప్రజలకు మంచినీళ్ళను సక్రమంగా అందించలేకపోతున్నారు. స్వచ్ఛభారత్, జల్‌జీవన్ వంటివి దూకుడుగా అమలవుతున్నప్పటికీ, సామాన్యజనానికి ఈ నీటి బాధలు తప్పడం లేదు. స్మార్ట్‌సిటీలు, క్లీన్‌సిటీలు అంటూ సాగుతున్న హడావుడినీ, అవార్డులనూ, రివార్డులనూ ఇండోర్ ఘటన ప్రశ్నిస్తోంది. తాగేనీటిని విషంగా మార్చుతున్న వ్యవస్థాగత వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఉపరితలంలో కనిపిస్తున్నదీ, మెరుస్తూ మనలను మురిపిస్తున్నదీ నిజం కాదని, కాళ్ళకింద నేలలో కాలకూటం ఉన్నదనీ హెచ్చరిస్తోంది.
Also Read:
చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!