Share News

చిగురించిన మైత్రి

ABN , Publish Date - Nov 25 , 2026 | 02:39 AM

నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా అతివేగంగా తన భారత పర్యటన ముగించారు. మార్చిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏడాది పాటు స్వదేశం వదిలి ఎక్కడకూ ...

చిగురించిన మైత్రి

నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా అతివేగంగా తన భారత పర్యటన ముగించారు. మార్చిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏడాది పాటు స్వదేశం వదిలి ఎక్కడకూ పోయేది లేదని తీర్మానించుకున్న ఆయన ఆర్థిక అవసరాల రీత్యా ఆ ఒట్టు తీసి గట్టుమీద పెట్టారు, తన తొలి విదేశీ పర్యటన భారత్‌లోనే జరిపి సంప్రదాయాన్ని గౌరవించారు. మూడురోజుల పర్యటనను ఒకరోజుకు పరిమితం చేసుకున్నప్పటికీ, భారత్‌నుంచి భారీ సాయాన్నే అందుకున్నారు. ప్రధాని మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతించడం, రాష్ట్రపతి భవనంలో గౌరవవందనం అందుకోవడం, ద్రౌపది ముర్ముతో మర్యాదపూర్వక భేటీ ఇత్యాది స్వాగత సత్కారాలన్నీ బాలేన్‌కు చక్కగానే దక్కాయి. కొంతకాలంగా ఉభయదేశాల మధ్యా ఉన్న ఎడం ఈ పర్యటనతో తొలగిపోయిందని రాజకీయ విశ్లేషకులు సంతోషిస్తున్నారు.

వరదలతో దెబ్బతిన్న నేపాల్‌కు అడిగినంత కాకపోయినా భారత్‌ బాగానే సాయం చేసిందని విదేశీపత్రికలు సైతం మెచ్చుకుంటున్నాయి. నేపాల్‌ సివిల్‌ సర్వీసెస్‌, పోలీసు, ఫోరెన్సిక్‌ రంగాల్లో శిక్షణలు, అక్కడ ఐఐటీ క్యాంపస్‌ ఏర్పాటు వంటి చర్యలు బాలేన్‌ను బలంగా ఎన్నుకున్న నేపాలీ యువత భవితకు ఉపకరిస్తాయి. ఉత్తరాఖండ్‌–నేపాల్‌ సరిహద్దులో రోడ్డువంతెన, పెట్రోలియం పైప్‌లైన్‌ రెండవదశ ఆరంభం, జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన వంటి కార్యక్రమాలు ఆ దేశాభివృద్ధికి ఉపకరిస్తాయి. కాండ్లా ఓడరేవును నేపాల్‌ను వాడుకోనివ్వడం దాని అంతర్జాతీయ వాణిజ్యం పెరుగుదలకు ఉపకరిస్తుంది. ‘వికసిత భారత్‌–సమున్నత నేపాల్‌’ పేరిట విడుదల చేసిన ఉమ్మడి దార్శనిక పత్రం ఇరుదేశాల మధ్య సహకారానికి బాటలు వేస్తుంది. ఇక, మోదీ పరిభాషలో చెప్పాలంటే రాముడినీ సీతనూ కలిపే అయోధ్య–జనక్‌పూర్‌ రైలు సర్వీసు ఉభయదేశాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాన్ని బలోపేతం చేస్తుంది. గత పాలకుడు కేపీ శర్మ ఓలీ తన భారతవ్యతిరేక చైనాఅనుకూల రాజకీయాలకోసం సీత పేరును సైతం వాడుకున్న విషయం తెలిసిందే.


‘బిగ్‌ బ్రదర్‌’ వ్యతిరేక నేపాలీ రాజకీయాల్లో బాలెన్‌ పర్యటనమీద విమర్శలు సహజం. పర్యటనకు ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకులతో, అధ్యక్షుడితో భేటీ అయి, భారత్‌తో ఏయే అంశాలు చర్చించాలో బాలెన్‌ నిర్ణయించలేదన్నది ఆరోపణ. ముఖ్యంగా, కాలాపానీ, లిపులేఖ్‌, లింపియథురా, సుస్తా వంటి సరిహద్దు వివాదాలను భారత ప్రధాని సమక్షంలో లేవనెత్తనందుకు బాలెన్‌ను అవి తప్పుబడుతున్నాయి. ఆర్థికసాయం, అభివృద్ధి ప్రాజెక్టుల ముసుగులో నేపాల్‌ సార్వభౌమాధికారానికి సంబంధించిన కీలకాంశాలను ఈయన వెనక్కునెట్టేశారన్నది విమర్శ. ఆరునెలల క్రితం, నేపాల్‌ పార్లమెంట్‌లో భారతదేశంతో ఉన్న సరిహద్దు వివాదాలమీద చర్చ జరుగుతున్న సందర్భంలో, భారత్‌ మాత్రమే నేపాల్‌ భూభాగాలు ఆక్రమించలేదని, నేపాల్‌ సైతం పలుచోట్ల భారత్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్ళిందన్న అర్థంలో బాలెన్‌ వ్యాఖ్యానించి అక్కడి విపక్షాలు, విద్యార్థి సంఘాలు, మీడియా విమర్శలకు గురైన విషయం తెలిసిందే. వివాదాస్పద ప్రాంతాలన్నింటినీ కేపీశర్మ ఓలీ ప్రధానిగా ఉన్నప్పుడు నేపాల్‌ అధికారిక మ్యాపులో చేర్చితే, తాము ఎంతో ఘనంగా ఎన్నుకున్న ప్రస్తుత పాలకుడు భిన్నంగా మాట్లాడటం నేపాలీలకు రుచించలేదు. పార్లమెంట్‌లో మిగతావారంతా భారత్‌ను బూచిగా చూపుతూంటే, ఈయన మాత్రం సరిహద్దువివాదాలన్నీ సంక్లిష్టమైనవనీ, చారిత్రక అంశాలతో ముడిపడివున్నవనీ ఏదో చెప్పబోయి ఎదురుదెబ్బతిన్నారు. ఎన్నికల ప్రచారంలో ఈయన కూడా దూకుడుగా భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినవాడే. ఖాట్మండూ మేయర్‌గా ఉన్నప్పుడు భారత్‌ భూభాగాలను చేర్చి గ్రేటర్‌ నేపాల్‌ మ్యాప్‌ను ప్రదర్శించినవాడే. భారత్‌కు తాను సన్నిహితం కాదని అనిపించుకోవడానికి ఇంతకాలం ఇక్కడ కాలూనలేదు కానీ, వరదసాయం అవసరపడింది. సమానహోదాలో ఉన్నవారితోనే భేటీ అవుతానంటూ గతంలో భారత విదేశాంగశాఖ కార్యదర్శికి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ఆయన ప్రస్తుత పర్యటన నష్టనివారణకు ఉపకరించవచ్చు. తాను చదువుకున్న బెంగుళూరుతో పాటు, మరో రెండు రాష్ట్రాల్లో పర్యటించాలని ముందుగా అనుకున్నప్పటికీ, ప్రధాన ద్వైపాక్షిక చర్చలు జరిగే దేశ రాజధానికే తన పర్యటనను పరిమితం చేసుకున్నాడు ఆయన. అట్టహాసాలకు ఆడంబరాలకు దూరంగా ఉంటూ భారత్‌తో రాసుకుపూసుకు తిరిగినట్టుగా కనిపించకుండా, అతితక్కువ సమయంలోనే ఎక్కువ రాబట్టుకొని వెళ్ళిన బాలెన్‌ క్విక్‌టూర్‌ బాగుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ పంచాయతీ ఎన్నికలకు పోలీసులతో భారీ భద్రత.. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణలో రూ.10 వేల కోట్ల ప్రణాళిక: మంత్రి ఉత్తమ్

Updated Date - Nov 25 , 2026 | 02:39 AM