Share News

నేపాల్‌ పాతవాదనలు

ABN , Publish Date - May 07 , 2026 | 02:20 AM

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని లిపులేఖ్‌ కనుమ ద్వారా నిర్వహించబోయే మానస సరోవర్‌ యాత్రమీద నేపాల్‌ వెలిబుచ్చిన అభ్యంతరాలను భారత్‌ ఖండించింది. సరిహద్దులను కృత్రిమంగా విస్తరించుకుంటూ...

నేపాల్‌ పాతవాదనలు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని లిపులేఖ్‌ కనుమ ద్వారా నిర్వహించబోయే మానస సరోవర్‌ యాత్రమీద నేపాల్‌ వెలిబుచ్చిన అభ్యంతరాలను భారత్‌ ఖండించింది. సరిహద్దులను కృత్రిమంగా విస్తరించుకుంటూ భూభాగాలపై హక్కులు ప్రకటించుకోవడం సరైన విధానం కాదని భారత్‌ గట్టిగా జవాబు ఇచ్చింది. జూన్‌ నుంచి ఆగస్టు వరకూ జరగబోయే కైలాస మానససరోవర్‌ యాత్ర విషయంలో తనను సంప్రదించకుండా భారత్‌–చైనాలు ఈ మార్గాన్ని ఖరారుచేసుకోవడం నేపాల్‌కు కోపం తెప్పించింది. మా భూభాగం నుంచి ఈ యాత్ర కొనసాగించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో, 1816నాటి సుగాలీ ఒప్పందం ప్రకారం లింపియథుర, లిపులేఖ్‌, తూర్పు కాలాపాని తమకు చెందినవని స్పష్టంచేస్తున్నట్టు నేపాల్‌ ప్రకటించింది. లిపులేఖ్‌ తన భూభాగమని నేపాల్‌ చేస్తున్న వాదనకు చారిత్రక ఆధారాలు లేవని, డెబ్బయ్యేళ్ళుగా ఇదే మార్గాన్ని ఈ యాత్రకు ఉపయోగిస్తున్న నిజం నేపాల్‌కు తెలియనిది కాదని భారత్‌ వ్యాఖ్యానించింది. యాత్ర జరగబోతున్నట్టు భారత్‌ ప్రకటించగానే నేపాల్‌ ఇలా అభ్యంతరం వెలిబుచ్చడం విశేషం. ఇది నామమాత్రమే కావచ్చును కానీ, పాత ఆలోచనలను, విధానాలను బద్దలుకొట్టి పాలనలోనూ, విదేశాంగవిధానంలోనూ కొత్త పుంతలు తొక్కుతానని ప్రకటించిన బాలెన్‌ షా ప్రభుత్వం పాత దారిలోనే నడవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కొవిడ్‌ నేపథ్యంలో 2020నుంచి నిలిచిపోయిన ఈ యాత్ర, ఆ తరువాత గాల్వాన్‌ ఘర్షణలతో భారత్‌–చైనా సంబంధాలు దెబ్బతినిపోయిన నేపథ్యంలో పునరుద్ధరణకు నోచుకోలేదు. ఆ తరువాత రష్యాలోని కజాన్‌లో మోదీ–జిన్‌పింగ్‌ భేటీలో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ దిశగా తీసుకున్న కొన్ని సానుకూల చర్యల్లో ఇది కూడా ఒకటి.

దశాబ్దాల వివాదం ఇది. పదిహేనేళ్ళక్రితం భారత ప్రధాని చైనా పర్యటించినప్పుడు లిపులేఖ్‌ ద్వారా ఉభయదేశాల మధ్య వాణిజ్యం సాగించాలని ఒప్పందం జరగ్గానే నేపాల్‌ తన అభ్యంతరాన్ని ప్రకటించింది. మరో నాలుగేళ్ళకు కాలాపానీని భారతదేశపటంలో చూపినందుకు నేపాల్‌ అభ్యంతరపెట్టింది. 2020లో లిపులేఖ్‌లో 80 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని భారత్‌ ఆరంభించినప్పుడు నేపాల్‌ తీవ్రంగా ప్రతిస్పందించడమే కాక, పై మూడు భూభాగాలను తనవిగా చూపుతూ తన మ్యాప్‌ మార్చుకుంది. లిపులేఖ్‌ మీద నేపాల్‌ వరుస అభ్యంతరాలకు భారత్‌ చైనాలు ఎన్నడూ పెద్దగా స్పందించలేదు. అయితే, ఈ మారు భారత్‌ కాస్తంత గట్టిగా, సత్వరమే జవాబు ఇవ్వడానికి నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కారణం కావచ్చు. లిపులేఖ్‌ విషయంలో మన వైఖరిని స్పష్టంచేస్తూనే, నేపాల్‌తో చక్కని ద్వైపాక్షిక సంబంధాలకు భారత్‌ బలంగా కట్టుబడివుందని, సరిహద్దులతో సహా అన్ని అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నదని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ట్వీట్‌ చేశారు.


వారంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ నేపాల్‌ పర్యటన ఉండగా మానససరోవర యాత్రమీద మళ్ళీ వివాదం రేగింది. కొత్త ప్రధాని బాలెన్‌షాతో ఈయన భేటీకి మాత్రం అవకాశాల్లేవట. ఇతర దేశాల ప్రధానులు, ఆ పై స్థాయివారిని తప్ప మిగతావారితో భేటీ అయ్యేందుకు బాలెన్‌ అంగీకరించడం లేదట. ప్రధానిగా ప్రమాణం చేశాక భారత్‌లో పర్యటించే సంప్రదాయాన్ని కూడా బాలెన్‌ పాటించలేదు. ఏడాదిపాటు దేశం కదలకుండా పనిచేయాలని ఆయన అనుకున్నారని, దీనికితోడు, తన వందరోజుల పాలనపై నివేదిక సమర్పించే ఆలోచనలో ఆయన ఉన్నారని అంటారు. దీంతో బాలెన్‌ ప్రభుత్వం చాలా విషయాల్లో వేగంగా దూకుడుగా వ్యవహరిస్తోంది, విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. పాతతరం నాయకులకూ, పార్టీలకూ వ్యతిరేకంగా ఉద్యమించి, బాలెన్‌కు పట్టాభిషేకం చేసింది విద్యార్థులు, యువతరమే. ఈయన అధికారంలోకి రాగానే విద్యార్థి సంఘాలను రద్దుచేశారు. తొలినెలలోనే ఇద్దరు మంత్రులను సస్పెండ్‌ చేశారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్టును కోర్టు తప్పుపట్టడం బాలెన్‌కు తొలి ఎదురుదెబ్బ. అక్రమ నిర్మాణాల పేరిట నిరుపేదల నివాసాలను కూలుస్తున్నందుకు ఇతర పార్టీల నేతలతో పాటు జనం కూడా తప్పుపట్టడం మొదలైంది. సంస్కరణల పేరిట వివిధ ప్రభుత్వ విభాగాలను విలీనంచేయడం, అత్యధికం రద్దుచేయడం, పలు కార్పొరేషన్లను మూసివేయడం వంటి చర్యలు బాలెన్‌కు రాజకీయంగా ఉపకరిస్తాయో లేదో చూడాలి. విక్రమ్‌ మిస్రీ నేపాల్‌ పర్యటనతో పాటు, ఈ నెలాఖరులో ఆ దేశ విదేశాంగమంత్రి భారత్‌ పర్యటిస్తున్న తరుణంలో ఉభయదేశాలు గతకాలపు వ్యాఖ్యలు, వాదనలకు స్వస్తిచెప్పి, వివాదాల పరిష్కారం కోసం కృషిచేయడం అవసరం.

ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 07 , 2026 | 02:25 AM