Share News

మన రైతును కాపాడాల్సిందే!

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:55 AM

జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానమంత్రిగా తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు భారత్‌ శ్రేయోభిలాషి ఒకరు ‘మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి?’ అని అడిగితే 40 కోట్లు అని ఆయన ...

మన రైతును కాపాడాల్సిందే!

జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానమంత్రిగా తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు భారత్‌ శ్రేయోభిలాషి ఒకరు ‘మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి?’ అని అడిగితే 40 కోట్లు అని ఆయన గంభీరంగా సమాధానమిచ్చారు. ‘సమస్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో కెల్లా ఘనమైనదిగా ప్రశంస పొందుతున్న అమెరికా–భారత్‌ వాణిజ్య ఒప్పందం అమలులోకి రానున్న తరుణంలో, ఈ సరికొత్త ఆర్థిక పరిణామం పట్ల ప్రస్తుత భారత జనాభా 150 కోట్ల మందీ సంతోషిస్తున్న పరిస్థితి ఉన్నదా? లేదు. భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ వెన్నెముకగా ఉన్న వ్యవసాయరంగం శ్రేయస్సుకు అమెరికాతో వాణిజ్య ఒప్పందం తోడ్పడదని అత్యధికులు సంశయిస్తున్నారు. ఈ భయాలు, భరోసాలను నిశితంగా, నిష్పాక్షికంగా తరచి చూడవలసిన అవసరమున్నది.

అమెరికా, యూరోప్‌తో జరిగే వాణిజ్య చర్చలకు అంతిమంగా వ్యవసాయమే కేంద్ర బిందువు అవుతుంది. రైతుల ప్రయోజనాలు కాపాడి తీరుతామని మన వాణిజ్య మంత్రులు హామీ ఇస్తారు; కొత్త కష్టాలు వాటిల్లడం ఖాయమని మన అన్నదాతలు ఆందోళన చెందుతారు; ఆహార భద్రత గురించి యావద్భారతీయులూ గోసపడతారు! నిజానికి మన సమస్య స్వేచ్ఛా వాణిజ్యం కాదు, అత్యధికులు తమ జీవనోపాధికి వ్యవసాయరంగం పైనే ఆధారపడి ఉండడమే. అవును, 70 కోట్ల మంది భారతీయులకు సేద్యమే జీవనాధారం. దేశ శ్రామిక శక్తిలో ఇంచుమించు సగం మందికి వ్యవసాయమే ఉపాధి కల్పిస్తోంది. అయినా దేశ స్థూల దేశియోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా కేవలం 15 శాతం మాత్రమే. మరి మనతో స్వేచ్ఛా వాణిజ్యానికి ఆరాటపడుతోన్న సంపన్న దేశాలలో ఆహారోత్పత్తి పరిస్థితులు భిన్నమైనవి. అక్కడి పంట క్షేత్రాలు అధిక దిగుబడుల నిస్తాయి. పంట సిరులను సృష్టించే కృషీవలులు అమెరికా కార్మిక శక్తిలో 1.2 శాతం, యూరోప్‌లో 1.6 శాతం మాత్రమే. పూర్తిగా భిన్నమైనది మన పరిస్థితి. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేకనే దేశ జనాభాలో సగం మంది అనివార్యంగా వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. ఈ కారణంగానే సంపన్న దేశాలు తమ వ్యవసాయ వాణిజ్య విధానాలలో యథాలాపంగా చేసే మార్పులు, చేర్పులు గ్రామీణ భారతంలో లక్షలాది కుటుంబాల జీవన పరిస్థితులు దుర్భరమయ్యేందుకు దారితీస్తున్నాయి. అత్యధికులు వ్యవసాయంపై ఆధారపడే అగత్యాన్ని తొలగించాలి. ఈ ఆవశ్యక పరివర్తనను సాధించకుండా సంపన్న దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల ప్రయోజనముండదు. సేవలు, తయారీ రంగాలను ఇతోధికంగా అభివృద్ధిపరచుకుని వ్యవసాయమే జీవనాధారమయ్యే పరిస్థితిని అంతే గణనీయంగా తగ్గించాలి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం అందుకు దోహదం చేసేదిగా ఉండాలి.


ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల మాటను హేతుయుక్తంగా సంశయించడం ఎంత అవసరమో, అహేతుకంగా వ్యతిరేకించడం అంతే అవాంఛనీయం. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో ఈ పౌర ధర్మాలు ఎలా సువ్యక్తమవుతున్నాయి? ‘ఈ ఒప్పందంతో 30 లక్షల కోట్ల డాలర్ల అమెరికా విపణి మన ఎగుమతిదారులకు అందుబాటులోకి వస్తుంది. రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అపార ప్రయోజనాలు సమకూరుతాయి’ అని వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ‘ప్రభుత్వం చెప్పుతున్న మాటలో నిజం లేదని, వ్యవసాయ, పాడి ఉత్పత్తుల రంగాలు తీవ్ర నష్టాలతో కుదేలయిపోతాయి’ అని ప్రధాన ప్రతిపక్షం విమర్శిస్తోంది. తమ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను అడ్డూ అదుపులేకుండా అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు గట్టిగా కోరుతున్నారు. ఏ దేశమూ తన రైతులకు ఇవ్వనంతగా భారీ సబ్సీడీలతో అమెరికా రైతాంగాన్ని ఆదుకుంటున్న వాషింగ్టన్‌ ప్రభువులు భారత ప్రభుత్వం తన వ్యవసాయదారులకు సమకూరుస్తున్న కనీస మద్దతు ధర, పంట ఉత్పత్తుల సేకరణ సదుపాయాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు! ఇదే జరిగితే పేద భారతీయ రైతులు తమ సంక్షేమాన్ని మరచిపోయి సమృద్ధ సబ్సిడీ సంపన్న అమెరికా రైతులను మళ్లీ గొప్పవాళ్లని చేయడమే అవుతుంది.

మన అన్నదాతలు ఎందుకీ త్యాగం చేయాలి? మన ఆహార భద్రతను మనకు మనమే దెబ్బతీసుకుని మళ్లీ ఒకనాటి ‘నౌక నుంచి నోటికి’ తరహా దుర్దినాలకు ఎందుకు తిరోగమించాలి? పౌర సమాజ సంస్థలు ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. సబబే. అయితే రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆరాటపడుతున్నవారు ఒక వాస్తవాన్ని విస్మరించకూడదు. సేవలు, తయారీ రంగాన్ని సర్వ సమగ్రంగా అభివృద్ధిపరచుకోవల్సిన ఆవశ్యకత, అందుకు అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్యం చేయగల దోహదాన్ని ఉపేక్షించకూడదు. సమస్త ప్రజలకు తన శ్రమతో ఆహారాన్ని సమకూర్చే రైతు పొలంలో నాగలితో నిలవగలగాలి. అయితే పాత కాలపు జీవనాధారాలే ఎప్పటికీ మంచి బతుకులకు ఆలంబనగా ఉండేలా వాటిని సంక్షించడం ద్వారా కాకుండా, తదుపరి తరానికి అంతకంటే మెరుగైన కొత్త జీవనాధారాలు సృష్టించడం వల్లే జాతులు నాగరికతా ఔన్నత్య శిఖరాలను అధిరోహిస్తాయి అన్న ఒక విజ్ఞుడి మాటను, అందులోని నిర్దేశాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి. ఔదలదాల్చాలి. ఇటువంటి వివేకమూ దాని ఔచిత్యమూ సగటు ఓటర్ల మాటా మంతీ, పిచ్చా పాటీలో భాగమయితే మన ప్రజాస్వామ్యానికీ జాతి ఆర్థికాభ్యుదయానికీ అంతకంటే కావల్సిందేముంది?

ఇవి కూడా చదవండి..

'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

Updated Date - Feb 10 , 2026 | 12:55 AM