ఫ్రెంచ్ రణవిహంగాలు!
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:05 AM
మరో నూటపద్నాలుగు రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం, ప్రస్తుత వాతావరణంలో సముచితమైనది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని కొనుగోళ్ళ...
మరో నూటపద్నాలుగు రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం, ప్రస్తుత వాతావరణంలో సముచితమైనది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని కొనుగోళ్ళ మండలి (డీఏసీ) ఈ ప్రతిపాదనకు ఆమోదముద్రవేసిందంటే, పూర్వరంగం పూర్తిగా సిద్ధమైనట్టే. డీఏసీ ఆమోదం తెలిపిన మూడున్నర లక్షలకోట్ల విలువైన మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోళ్ళలో రఫేల్ యుద్ధ విమానాలతో పాటు క్షిపణులు, చిన్నస్థాయి నిఘా విమానాలు, యాంటీ ట్యాంక్ మైన్ల మరమ్మతులు ఇత్యాది ప్రతిపాదనలు ఉన్నాయి. రఫేల్‌కోసం ప్రత్యేకించి ఎంత ఖర్చుచేయబోతున్నారు? అన్నది ప్రభుత్వం చెప్పకపోవడంతో మూడులక్షలకోట్లనీ, కాదు, మూడున్నరలక్షలకోట్లనీ మీడియా లెక్కలు కడుతోంది. భారత్–ఫ్రాన్స్ మధ్య బాగా బలపడిన బంధానికి ఈ యుద్ధవిమానాల కొనుగోలు నిర్ణయం నిదర్శనం. ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నేటినుంచి జరపబోతున్న రెండురోజుల భారత పర్యటనలో వ్యవహారం ఖరారు కాబోతున్నదని అంటున్నారు.
భారత రక్షణరంగంకోసం ఇంతటి భారీ కొనుగోళ్ళు చేయడం ఇటీవలికాలంలో జరగలేదు. 18 విమానాలు ఫ్రాన్స్‌లోనే తయారై నేరుగా భారత్ వచ్చివాలుతాయని, మిగతా 96 భారత్‌లోనే తయారవుతాయట. స్వదేశీ తయారీ ఇంతటి భారీగా ఉన్నది కనుక, మీడియా గతాన్ని కూడా ఓ మారు గుర్తుచేస్తోంది. 2016లో మోదీ సర్కారు ముప్పై ఆరు విమానాలకోసం ఒక కొత్త ఒప్పందాన్ని కుదర్చుకోవడం, అందులో తొలివిడతగా ఐదు రఫేల్ విమానాలు ఆరేళ్ళక్రితం అమృత్‌సర్‌లో వాలిన సందర్భంలో దేశరక్షణను మించిన ఘనమైన కర్తవ్యం వేరొకటి లేదని ప్రధాని సంస్కృతంలో ట్వీట్ చేయడం సహా అనేక పరిణామాలను మీడియా నెమరువేసుకుంటోంది. 1990ల్లోనే అత్యుత్తమమైన మీడియం మల్టీరోల్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఎంఆర్‌సీఏ)కోసం ప్రపంచవ్యాప్తంగా సాగిన అన్వేషణ నుంచి 126 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు కోసం కాంట్రాక్టు కుదరడం, మోదీ ప్రభుత్వం దానిని రద్దుచేసి, ముప్పై ఆరు విమానాలను నేరుగా దిగుమతిచేసుకోవడానికి సిద్ధపడటం వరకూ అనేకం గుర్తుకువస్తున్నాయి.
మల్టీరోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఆర్‌ఎఫ్‌ఏ) కింద కుదరబోయే కొత్త ఒప్పందాన్ని గతానికి కొనసాగింపుగానే అనేకమంది రక్షణరంగనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పటి ఒప్పందాన్ని మధ్యలో తుంచి, ఇంతకాలానికి మళ్ళీ అటే మళ్ళడం కంటే, దానినే యథాతథంగా కొనసాగించి, చిన్నచిన్న అతుకులతో, చర్యలతో ముందుకు తీసుకుపోయివుంటే ఇప్పటికంటే ఎక్కువ విమానాలే ప్రస్తుతం మనదగ్గర సిద్ధంగా ఉండేవనివారి అభిప్రాయం. 126 విమానాలలో, పద్దెనిమిది ఎగిరివచ్చిన స్థితిలో, మిగతా 108 పూర్తి లైసెన్సుతో దేశీ తయారీ కనుక సాంకేతికతల బదలాయింపు, పరిశ్రమలకూ ఉపాధికీ ఊతం ఈపాటికే దక్కేవని వారి వాదన. ఎన్డీయే ప్రభుత్వం పాత ఒప్పందాన్ని రద్దుచేసి, కొత్తది కుదర్చుకున్నప్పుడు, ఒక్కోదానికీ 526కోట్లకు బదులు 1670కోట్లు చెల్లించారనీ, హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ స్థానంలోకి దివాలాతీసిన అనిల్ అంబానీని తెచ్చారని కాంగ్రెస్ నానాయాగీ చేసిన విషయం తెలిసిందే. అత్యాధునిక అస్త్రశస్త్రాలు పొట్టన నింపుకొని యుద్ధానికి సిద్ధంగా వాలబోతున్న విమానాలనే కొనుగోలు చేశాం కనుక ధర పెరిగిందని బీజేపీ ఆ ఆరోపణలను కొట్టివేసింది. భారీ అవినీతి జరిగిందంటూ ‘చౌకీదార్ చోర్‌హై’ అన్న నినాదాన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాస్త్రంగానూ వాడింది. రాజీవ్‌గాంధీని రాజకీయంగా బోఫోర్స్ కుంభకోణం దెబ్బతీసినట్టుగా మోదీ తిరగరాసిన ఆ ఒప్పందాన్ని ప్రయోగించి ఆయన ప్రతిష్ఠ దిగజార్చవచ్చునని రాహుల్ అనుకొనివుంటారు. రఫేల్ సామర్థ్యాన్నీ, సమర్థతను ఎవరూ అనుమానించనక్కరలేదు, దాని కొనుగోలునూ ప్రశ్నించనక్కరలేదు. ఇటీవలి ఆపరేషన్ సిందూర్‌లో అది నిర్వహించిన పాత్ర, దానిని అప్రదిష్ఠపాల్జేసేందుకు పాకిస్థాన్, చైనాలు చేసిన కుట్రలు తెలిసినవే. పొరుగుదేశాలన్నీ పక్కలో బల్లెంలాగా తయారైన ఈ కీలకతరుణంలో ఇప్పటికే మన అమ్ములపొదిలో చేరిన రఫేల్ విమానాలకు తోడుగా మరిన్ని సిద్ధంకాబోతున్నాయన్న వార్త కచ్చితంగా ధైర్యాన్ని ఇస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News