Share News

వలసజీవులపై దృష్టిపెట్టాలి

ABN , Publish Date - May 13 , 2026 | 12:05 AM

జయజయధ్వానాలు ఇంకా మిన్నంటుతూనే ఉన్నాయి. ఇటీవలి ఎన్నికలలో చరిత్రాత్మక విజయాలు సాధించిన రాజకీయ పక్షాలు, మరీ ముఖ్యంగా ఉత్తర భారతావనిలో కొండ నుంచి కడలి (గంగోత్రి నుంచి గంగా సాగర్‌) దాకా...

వలసజీవులపై దృష్టిపెట్టాలి

జయజయధ్వానాలు ఇంకా మిన్నంటుతూనే ఉన్నాయి. ఇటీవలి ఎన్నికలలో చరిత్రాత్మక విజయాలు సాధించిన రాజకీయ పక్షాలు, మరీ ముఖ్యంగా ఉత్తర భారతావనిలో కొండ నుంచి కడలి (గంగోత్రి నుంచి గంగా సాగర్‌) దాకా సమస్త ప్రాంతాలూ తమ ఏలుబడిలోకి వచ్చినందుకు జాతీయ అధికార పక్షం, వాటి నాయక, అనుచరగణాలూ మహదానందపడిపోతున్నాయి. సబబే! వాటి ఉత్సాహం ఊరేగింపులుగా పల్లవిస్తోంది. అదీ సహేతుకమే! అయితే పదవీ బాధ్యతల స్వీకరణ లాంఛనాల తర్వాత కొత్త పాలకుల దృష్టి సామాన్యుడి శ్రేయస్సు పైనే కేంద్రీకృతమై ఉంటుందా అన్నదే ఇప్పుడు కీలకం. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెల్లగా ఒక హెచ్చరిక చేశారు: ‘ప్రపంచం ఇంధన విపత్తులో ఉన్నది.. భారత్ అపరిమితంగా నష్టపోతోంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ ప్రజలు మిత వ్యయాలను తప్పక అలవాటు చేసుకోవాలి’. మధ్యతరగతి ప్రజలు తలపంకించవచ్చుగానీ రెక్కాడితేగాని డొక్కాడని కష్టజీవులకు మోదీ మాటలకు స్పందించే అవకాశాలు తక్కువే. ఎందుకని? పశ్చిమాసియా పరిణామాల వల్ల దేశవ్యాప్తంగా పారిశ్రామిక, వ్యాపార కేంద్రాలు అయిన నగరాలు, పట్టణాల నుంచి పెద్ద ఎత్తున వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరుగుబాట పడుతున్నారు. మున్ముందు అదింకా పెరిగే అవకాశం ఉంది.

ప్రతి మూడో భారతీయుడూ ఒక అంతర్గత వలసదారుడే అని 2011 జనాభా గణన వెల్లడించింది. ఆరు సంవత్సరాల క్రితం కోవిడ్‌ విలయంలో ఈ వాస్తవం అందరికీ బాధాకరంగా తెలిసివచ్చింది. 2030 నాటికి మన పట్టణ, నగర జనాభా 63 కోట్లకు పెరుగుతుందని అంచనా. గ్రామాల నుంచి నగరాలకు వలసల వెల్లువే ఈ జనాభా. గత ఫిబ్రవరి చివరి రోజున ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభమైన దరిమిలా పశ్చిమాసియాలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల కారణంగా అవసరాల మేరకు ఎల్‌పీజీ (లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌) సరఫరాలో తీవ్ర అంతరాయం, ఇంధన ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతోంది. ఫలితంగా నగరాల నుంచి గ్రామాలకు తిరుగు వలసలు అనివార్యమవుతున్నాయి. కోవిడ్‌ కాలంలో వలే గందరగోళంగా కాకుండా ఈ తిరోగమన వలసలు నిశ్శబ్దంగా సాగుతున్నాయి. సంక్షోభం సమసిపోయిన తరువాత తిరిగి తమ జీవనాధార నెలవులకు తిరిగి రావాలని ఆశిస్తున్నారు. మరి ఈ బతుకు బాటసారుల కోరిక సమీప భవిష్యత్తులో తీరడమనేది ప్రశ్నార్థకమే. ప్రస్తుత ఇంధన విపత్తు తాత్కాలిక సంక్షోభం కాదని, అదొక నిర్మాణాత్మక మార్పును సూచిస్తుందని, ఇది ఊహించినదాని కంటే ఎక్కువ కాలం కొనసాగేందుకు అవకాశమున్నదని ఆర్థిక రంగ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ సూచించిన విధంగా ‘ఎనర్జీ లాక్‌డౌన్‌’ను అమలుపరచడంతో పాటు ఆర్థికపరమైన అంశాలలో సముచిత మార్పులు చేయనిపక్షంలో రాబోయే సంవత్సరం (2027–28)లో చెల్లింపుల మధ్య సమతూకం లోటు సమస్యను సైతం ఎదుర్కోవలసివస్తుందని కూడా వారు నిష్కర్షగా చెప్పుతున్నారు.


దేశ దేశాల ఆర్థిక వ్యవస్థలు అంతర్జాతీయ ఒప్పందాలతో పరస్పరం అనుసంధానమై ఉన్నకారణంగా ప్రపంచ భౌగోళిక రాజకీయ సుస్థిరతపై దేశీయ ఆర్థిక వ్యవస్థల పురోగతి, సామాజిక సుస్థిరత ఆధారపడి ఉంటాయని ప్రస్తుత ఇంధన సంక్షోభం స్పష్టం చేసింది. ఇరాన్‌ యుద్ధంతో అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ సుస్థిరతకు తీవ్ర విఘాతం కలగడం మన కాలపు ఒక కఠోర వాస్తవం.

మరి విషమించనున్న ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని వలస కార్మికులు గ్రామాల బాట పట్టకుండా చర్యలు తీసుకోవాలి. వారి కోసం ఒక పటిష్ఠ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించి అమలుపరచాలి. 5 కిలోల మినీ, 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాను క్రమబద్ధీకరించి సబ్సిడీపై వారికి అందజేయాలి. దీనివల్ల వలస కార్మికులు, వీధి విక్రేతలు, హోటళ్లు, చిన్న పరిశ్రమలకు ఇతోధిక మేలుజరుగుతుంది. రాజస్థాన్‌, కేరళలో ఇప్పటికే అమలో ఉన్న ఇందిరాగాంధీ పట్టణ ఉపాధి హామీ, అయ్యంకాళి పట్టణ ఉపాధి హామీ తరహాలో దేశవ్యాప్తంగా పట్టణ పేదలకు ఒక పటిష్ఠ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించి అమలుపరచాలి.

నిలకడ లేని ప్రపంచ రాజకీయాల వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థలో వాటిల్లే సంక్షోభాలకు ప్రథమ బాధితులు అంతర్గత వలస కార్మికులే అన్న సత్యాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. అప్పుడు మాత్రమే రాబోయే సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడమూ, మానవీయంగా అధిగమించడమూ సుసాధ్యమవుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 12:05 AM