Share News

‘లీకు’ చెప్పిన నిజం

ABN , Publish Date - May 23 , 2026 | 02:57 AM

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి పదవినుంచి ఇమ్రాన్‌ఖాన్‌ తొలగింపు వెనుక అమెరికా హస్తం ఉన్నదంటున్న ఇటీవలి రహస్య దౌత్య సమాచారం, ఆయన గతంలో చేసిన ఆరోపణలకు మరింత విలువనూ...

‘లీకు’ చెప్పిన నిజం

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి పదవినుంచి ఇమ్రాన్‌ఖాన్‌ తొలగింపు వెనుక అమెరికా హస్తం ఉన్నదంటున్న ఇటీవలి రహస్య దౌత్య సమాచారం, ఆయన గతంలో చేసిన ఆరోపణలకు మరింత విలువనూ, బలాన్నీ సమకూర్చింది. అమెరికా ఆదేశాలమేరకు పాకిస్థాన్‌ రాజకీయపార్టీలూ, సైన్యమూ, మిగతా కీలక వ్యవస్థలు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా పనిచేశాయన్నది మరోమారు స్పష్టమైంది. పాత్రికేయుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్వెస్టిగేటివ్‌ పత్రిక డ్రాప్‌సైట్‌లో ఈ తెరవెనుక కుట్రను ప్రపంచానికి తెలియచెప్పే రహస్య దౌత్య పత్రం ప్రత్యక్షం కావడంతో అటు అమెరికా, ఇటు పాకిస్థాన్‌ ప్రభుత్వాలు ఆత్మరక్షణలో పడిపోయాయి. ప్రభుత్వాలను మార్చడం పాకిస్థాన్‌ ప్రజలకు సంబంధించిన వ్యవహారం, మాకు దానితో ఏమి సంబంధమని త్రోసిపుచ్చిన అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఈ కథనం మీద అంతకుమించి మాట్లాడకుండా ఒక నామమాత్రపు ఖండనతో సరిపుచ్చారు. లీకైన ఆ దౌత్యపత్రంలో ఉన్న సమాచారం అబద్ధమనో, ఆ పత్రమే నకిలీదనో, ఇదంతా కుట్రపూరితమనో కాస్తంత గట్టిగా అనివుంటే ఈ ఖండనకు కాస్తంత విలువ వచ్చివుండేది. అలా గనుక అంటే, సదరు సంస్థ ఈ అంశాన్ని ఇక్కడితో సరిపెట్టదన్న అనుమానం కూడా అమెరికా అధికారులకు ఉన్నదేమో మరి.

లీకైన ఆ దౌత్యపత్రం ప్రకారం, అమెరికాలోని పాక్‌ రాయబారి మజీద్‌ఖాన్‌, అమెరికా అసిస్టెంట్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ డోనాల్డ్‌ లూ మధ్య జరిగిన ఓ సంభాషణ ఇమ్రాన్‌ భవిష్యత్తును నిర్ణయించింది. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇదే పునాది. ఫిబ్రవరి 24న ఇమ్రాన్‌ఖాన్‌ మాస్కోలో కాలూనారు. అదే రోజు ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభమైంది. దీనిని ఖండించాల్సింది పోయి, పుతిన్‌తో ఇమ్రాన్‌ఖాన్‌ చేయి కలపడం తనకు అత్యంత అవమానకరమైన చర్యగా, ధిక్కారంగా అమెరికా భావించింది. ఆ తరువాత మార్చి 7న జరిగిన భేటీలో పాకిస్థాన్‌ చేసిన పాపాలన్నీ ఇమ్రాన్‌ను పదవీచ్యుతుడిని చేయడంతో కొట్టుకుపోతాయని డోనాల్డ్‌ లూ తీవ్ర హెచ్చరికతో కూడిన హామీ ఇచ్చి, ఇమ్రాన్‌ జైల్లో ఉంటేనే ఇరుదేశాల సంబంధాలు బలపడతాయని స్పష్టంచేశారు. సరిగ్గా మరో ముప్పై మూడురోజుల్లో అమెరికా ఆదేశాలు అమలై ఇమ్రాన్‌ ప్రభుత్వం కూలిపోయింది. మరుసటి రోజు షాబాజ్‌ షరీఫ్‌ ప్రధాని అయ్యారు, మరో ఆర్నెల్లకు ఆసీమ్ మునీర్‌ కొత్త ఆర్మీచీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత సమస్త వ్యవస్థలూ ఇమ్రాన్‌మీద కత్తికట్టాయి. ఆయన పార్టీ ఎన్నికల గుర్తుకోల్పోవడంతో అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగా పోటీచేశారు. అత్యధికస్థానాలు గెలుచుకున్నప్పటికీ, షరీఫ్‌లు, భుట్టోలు కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అత్యంత సయోధ్యతో అధికారాన్ని పంచుకున్నారు. విస్తృత ప్రజాదరణ కలిగిన ఒక నాయకుడిపై వందలాది కేసులు కట్టి, చివరకు జైల్లోకి నెట్టారు.


తనను పదవినుంచి తొలగించేందుకు అమెరికా కుట్రచేస్తోందని ఒక భారీ ర్యాలీలో ఇమ్రాన్‌ఖాన్‌ ఒక కాగితాన్ని చూపుతూ ప్రకటించిన దృశ్యం పాకిస్థాన్‌ ప్రజలకు ఇప్పుడు మళ్ళీ స్ఫురణకు వచ్చివుంటుంది. తాము ఎన్నుకున్న ఓ బలమైన నాయకుడు కూలిపోవడం వెనుక జరిగిందంతా ఒక సాధారణ పార్లమెంటరీ ప్రక్రియ కాదనీ, అందులో వీసమెత్తు ప్రజాస్వామ్యం లేదని, తమ కళ్ళముందే ఒక భారీ కుట్ర జరిగిందని వారికి తెలిసొచ్చివుంటుంది. అగ్రరాజ్యమూ, దానికి దాసోహపడిన తమ పాలకులు ఇందుకు కారకులని అర్థమై ఉంటుంది. తమను మాయచేయడానికి పాక్‌ పాలకులు చేసిన ప్రయత్నాలన్నీ గుర్తుకు వచ్చివుంటాయి. మీ ప్రధానిని జైల్లోకి తోసేయండని అమెరికా చెప్పడం కంటే, దానిని వినయంగా స్వీకరించి మిలటరీ సహా కీలకవ్యవస్థలన్నీ తదనుగుణంగా నడుచుకోవడం, పావులు కదపడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఖాన్‌ను పదవీచ్యుతుడిని చేసిన తరువాత జరిగినదంతా కూడా అమెరికా స్క్రిప్టులో తరువాత భాగమే తప్ప, తమ పాలకులకు వీసమెత్తు ప్రజాస్వామిక విలువలు లేవని పాక్‌ ప్రజలకు ఈ సరికొత్త లీక్‌తో అర్థమై ఉంటుంది. కన్నుమూసేవరకూ జైల్లో, ఏకాంతంలో ఉండాల్సిన ఇమ్రాన్‌కు సానుభూతి తెలియచేయడం వినా వారు చేయగలిగేది కూడా ఏమీ లేదు.

ఇవి కూడా చదవండి..

ఆ పెళ్లికి వెళితే నన్ను బతకనీయరు.. మీడియాపై ట్రంప్ సెటైర్లు

యురేనియాన్ని వదులుకోం

Updated Date - May 23 , 2026 | 02:57 AM