సౌదీ కష్టాలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:40 AM
యెమెన్ హౌతీల దాడులకు జడిసి సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ బంకర్లలో దాక్కుంటున్నారనీ, ఎప్పటికప్పుడు నివాసభవనాలు మారుస్తున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో...
యెమెన్ హౌతీల దాడులకు జడిసి సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ బంకర్లలో దాక్కుంటున్నారనీ, ఎప్పటికప్పుడు నివాసభవనాలు మారుస్తున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఆయన మళ్ళీ తెరమీదకు వచ్చి, మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి, హౌతీలకు హెచ్చరికలు చేశారు. సౌదీ అరేబియాపై వరుస దాడులు చేస్తున్న హౌతీలు తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని ప్రకటిస్తూ, వారిమీద తాము చేస్తున్న పోరాటాన్ని భళా అని ప్రశంసించుకుంటూ, సౌదీ రాజ్యాన్ని భద్రంగా కాపాడుకుంటామని క్యాబినెట్ ప్రతిజ్ఞచేసింది. దశాబ్దకాలంగా ఎన్నడూ లేనిరీతిలో సౌదీ మీద హౌతీలు విరుచుకుపడుతున్నారు. సౌదీ విమానాశ్రయాలు, ఇంధన స్థావరాలు, నౌకామార్గాలు లక్ష్యంగా వారి దాడులు సాగుతున్నాయి. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద ఇటీవల జరిగిన దాడి సౌదీని వణికించింది, మిగతా ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ దాడిలో పదిహేనుమంది మరణించారు, మూడువందలకు పైగా గాయపడ్డారు. ఈ భయానకదాడికి సంబంధించిన వీడియోలు టెలిజన్ చానెళ్ళలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా ప్రచారమై హౌతీలకు ఇంత శక్తి ఎక్కడిదని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఈ ఘటన తరువాత నుంచి యువరాజు బయటప్రపంచానికి కనిపించకుండా పోవడంతో అంతర్జాతీయ మీడియాలో కథనాలకు లెక్కలేకపోతున్నది.
హౌతీల దాడులు యువరాజును ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. కేవలం చమురు మీద ఆధారపడి ఎంతోకాలం నిలవడం ఈ ఈవీ యుగంలో కష్టం కనుక, పర్యాటకాన్ని పెంచుకోవాలని, పెట్టుబడులను ఆకర్షించాలని ఆయన అనేక కలలుకన్నాడు, ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. కానీ, హౌతీ దాడులు సౌదీ భద్రతను సవాలు చేశాయి, పెట్టుబడుల విషయంలో నమ్మకాన్ని తగ్గించాయి. రియాద్ ఘటన జరిగిన మర్నాడు కూడా హౌతీలు సమీప ప్రాంతంలోనే మరో దాడి జరిపి తమ శక్తిని ప్రకటించుకున్నారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 12 శాతం జరిగే బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వ బలగాలు ప్రయత్నిస్తుండటంతో, ఎర్ర సముద్ర తీరంలో పోరాటం తీవ్రమైంది. దీనికి ప్రతిగా, ఇరాన్ మద్దతున్న హౌతీలు సౌదీ విమానాశ్రయాలు, చమురు కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. హోర్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల రాకపోకలు చాలా కష్టమైపోతూండటంతో ఇంధన ఎగుమతులకు ఎర్ర సముద్రమార్గం మరింత ముఖ్యమైపోయింది. బుధవారం హోర్ముజ్ సమీపంలో ఒక చమురు ట్యాంకర్‌ను ఇరాన్ ముంచివేయడం కూడా మధ్యంతర ఎన్నికల ముందు ట్రంప్‌మీద చమురు ఒత్తిడి పెంచడంలో భాగమే. ఖతార్, అరబ్ ఎమిరేట్స్ సమీప సముద్రజలాల్లోకి కూడా ఈ దాడులను విస్తరిస్తూ చమురు ధరలు తగ్గకుండా చూడటం ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. మూడురోజుల క్రితం కేవలం ఒక్కరోజులోనే ఐదుట్యాంకర్లమీద ఇరాన్ దాడులు చేసింది.
హౌతీలను చావుదెబ్బకొట్టాలన్న ప్రయత్నం అనాదిగా సాగుతూనే ఉంది. గాజా యుద్ధం జరుగుతున్నప్పుడు వారు ఇజ్రాయెల్‌కు పోతున్న నౌకలమీద దాడులు చేయడం, అమెరికా బ్రిటన్ కలసికట్టుగా ప్రతీకారం తీర్చుకోవడం తెలిసిందే. గత ఏడాది అమెరికా నిరంతర దాడులతో విరుచుకుపడి కూడా హౌతీలను అణచలేకపోయింది. యెమెన్‌లోని కీలకప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ మరింత బలపడుతున్న హౌతీలు గతనెల ఒక ‘లోకల్ మేడ్’ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్‌తో అమెరికా తయారీ ఎఫ్–15 యుద్ధవిమానాన్ని నేలకూల్చి, దాని నాలుగునిముషాల వీడియోతో తమ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. తాము ఎంతటి యుద్ధానికైనా సంసిద్ధంగా ఉన్నామన్న సందేశం ఆ చర్యలో ఉంది. సౌదీ–హౌతీ ఘర్షణ మక్కా మదీనా వరకూ చేరి, ఇప్పుడు ఏకంగా పౌర విమానాశ్రయాల వరకూ విస్తరించడం ఆందోళన కలిగించే పరిణామం. ఇరాన్ మద్దతు ఉన్నప్పటికీ, సర్వస్వతంత్రంగా వ్యవహరించే హౌతీలను దారికి తేవడం అంత సులభం కాదు. సౌదీపక్షాన హౌతీలమీద విరుచుకుపడటానికి ఇజ్రాయెల్ సిద్ధపడినప్పటికీ యువరాజు అంగీకరించకపోవడం సరైన నిర్ణయం. ఇరాన్ మధ్యవర్తిత్వంలో కేవలం చర్చలు, ఇచ్చిపుచ్చుకోవడాలతో మాత్రమే హౌతీలను కాస్తంత లొంగదీయడం సాధ్యం. ‘రెడ్‌లైన్’ దాటవద్దని హెచ్చరించడం వినా హౌతీలను నియంత్రించలేకపోతున్న సౌదీ యువరాజు ఎంబీఎస్‌కు ఈ పరిణామాలు ఒక పెద్ద సవాల్.
ఈ వార్తలూ చదవండి
రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో