Share News

వేడి తగులుతోంది!

ABN , Publish Date - Mar 12 , 2026 | 01:03 AM

ఎక్కడో యుద్ధం జరుగుతూంటే మనకేమిటన్న ప్రశాంతత లేకుండా చేసింది ఇరాన్‌. పాలకులు ఎలాగూ నోరువిప్పడం లేదు, కనీసం ప్రజలైనా గొంతెత్తాలంటే ఈ మాత్రం శిక్షతప్పదని అనుకుందేమో...

వేడి తగులుతోంది!

ఎక్కడో యుద్ధం జరుగుతూంటే మనకేమిటన్న ప్రశాంతత లేకుండా చేసింది ఇరాన్‌. పాలకులు ఎలాగూ నోరువిప్పడం లేదు, కనీసం ప్రజలైనా గొంతెత్తాలంటే ఈ మాత్రం శిక్షతప్పదని అనుకుందేమో మరి. వంటిట్లో పొయ్యి వెలగక, కడుపు నకనకలాడితే జనమే తమ నేతలమీద తిరగబడతారనీ ఒత్తిడిపెంచుతారనీ ఇరాన్‌ తెలివిడి. పదిరోజుల యుద్ధంలో ఇరాన్‌ ఎంత నష్టపోయిందో తెలియదు కానీ, మిగతా ప్రపంచమంతా ఇంధన కొరతలు, సరఫరాల నిలిపివేతలతో విలవిలలాడేట్టు చేయడంలో అది పైచేయి సాధించింది.

వేగంగా ఇరాన్‌ను చావుదెబ్బతీసి, పాదాక్రాంతం చేసుకొని, తమకు విధేయుడైన ఓ పాలకుడిని ప్రతిష్ఠించగలనని నమ్మకంగా కదనరంగంలోకి దూకిన ట్రంప్‌మీద కాలువెనక్కుతీసుకోమంటూ అన్నివైపుల నుంచీ ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్‌ సంధిస్తున్న చవుకబారు డ్రోన్లు గల్ఫ్‌లోని అమెరికా వందిమాగధ దేశాలన్నింటినీ ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. హార్ముజ్‌ జలసంధిని గుప్పిట్లో పెట్టుకొని, బ్యారెల్‌ భగ్గుమనేట్టు చేసి, యుద్ధం ఆపేది లేదని ఇరాన్‌ ఎదురు సవాళ్ళు విసురుతోంది. ఆయిల్‌ షాక్‌కు ప్రపంచ‍ం అల్లాడిపోతోంది, సూచీలు తలకిందులవుతున్నాయి. పూచికపుల్లలాంటి ఇరాన్‌ ఆయుధాల ధాటీకి ఒకపక్క ఆయిల్‌ నిల్వలు తగలబడుతూంటే, మరోపక్క నిల్వచేసుకొనే వీలులేక ఇరాక్‌, కువైట్‌, అరబ్‌ ఎమిరేట్స్‌ ఇత్యాది దేశాలు చమురు ఉత్పత్తిని భారీస్థాయిలో కుదించాల్సి వస్తున్నది. అణ్వాయుధాలున్న ఒకదేశాన్ని దారికి తేవాలంటే ప్రపంచం ఎంతోకొంత కోల్పోకతప్పదని మొదట్లో పెద్దపెద్దమాటలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు సైతం ఇప్పుడు దిగివచ్చి మాట్లాడుతున్నారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థను కుదిపేసే స్థాయిలో పరిస్థితులు మారిపోతూండటం వల్ల త్వరితగతిన యుద్ధాన్ని ముగించడం గురించి ట్రంప్‌ మాటమాత్రంగానైనా అనవలసి వస్తోంది. అయతొల్లా ఖొమేనీని హత్యచేశాక ఆయన కుమారుడే వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నారు. ఇలా ఎందరిని వధించుకుంటూ పోయినా మతవారసులే వస్తారు తప్ప, ఇరాన్‌ కాళ్ళబేరానికి దిగదు. ఒకపక్క శత్రువుల చేతిలో చావుదెబ్బలు తింటూ కూడా ప్రతీకారంగా ఇరాన్‌ కొడుతున్న ఆ చిన్నాచితకా దెబ్బలకు అమెరికా ఇజ్రాయెల్‌ దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధ నిల్వలు హరించుకుపోతున్నప్పుడు, యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంత అవమానం తప్పదనీ, వీరాధివీరుడన్న తన ఇమేజ్‌ హరించుకుపోవచ్చునని అమెరికా అధ్యక్షుడికి తోచిందేమో. చమురు, సహజవాయువు సంక్షోభం స్వదేశాన్ని తాకుతూంటే, దాని గొలుసుకట్టు ప్రభావాలు జనం అనుభవిస్తూంటే అతిత్వరలోనే ఎన్నికలకు పోవాల్సి ఉన్న అధ్యక్షుడికి కాలువెనక్కు తీసుకోగలిగే మార్గం ఒకటి కావాలి. ఆప్తమిత్రుడు పుతిన్‌ ఈ విషయంలో ఏవో సలహాలు ఇచ్చాడని అంటారు.


ఎదురొడ్డి పోరాడటమే తప్ప, రాజీ లేదని ఇరాన్‌ అంటోంది. యుద్ధం ఎంతకాలం సాగాలి, ఎప్పుడు ఆగాలి అన్నది ఎవరు నిర్ణయిస్తారో తెలియదు కానీ, ఉత్పత్తి మాట అటుంచితే, కనీసం ఇంధన నిల్వలను కాపాడుకోవడం కూడా గల్ఫ్‌లోని అమెరికా దోస్తులకు కష్టమైపోతోంది. అంతా సవ్యంగా ఉంది, గాలికబుర్లు నమ్మకండి అని మన దేశ పాలకులు చెబుతున్నప్పటికీ, హోటళ్ళు మూతబడుతూ, హాస్టళ్ళు రెండుపూటల తిండికే పరిమితమవుతూ గ్యాస్‌ సంక్షోభం క్రమంగా విస్తరిస్తోంది, రేపోమాపో మన వంటింటినీ తాకుతుంది. వాహనాల్లో చమురు లేక ఇంటి నుంచి పనిచేయడం సరే, సకల సరఫరాలూ నిలిచిపోయి కనీస అవసరాలు సైతం తీరని పాడుకాలమూ దాపురించవచ్చు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్న రష్యా నుంచి చమురుకొంటున్నందుకు ట్రంప్‌ నోట పలు అవమానకరమైన మాటలు పడి, భారీ సుంకాల దెబ్బలు తిని చివరకు ఆయనకే లొంగి దిగుమతులను వదులుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అగ్రరాజ్యాధీశులవారు అనుమతించినందుకు ఎంతో సంతోషించి, విశ్వగురువులకు మాత్రమే దక్కిన గౌరవంగా మళ్ళీ కొనుగోళ్ళు మొదలుపెట్టి, ఒడ్డునపడవేసినందుకు ఎగిరిగంతేస్తున్నాం. ఒక యుద్ధాన్ని ఆపే పేరిట మనను చమురు కొనవద్దన్న పెద్దమనిషే, తాను ఆరంభించిన మరో యుద్ధం కారణంగా మనలను మళ్ళీ కొనమంటున్నాడు. అమెరికా అధ్యక్షులవారి ఏకపక్ష, నిరాధార యుద్ధం ఆరంభాన్ని అడ్డలేకపోయినా, ఆ ఉన్మాదాన్ని నిలువరించలేకపోయినా కనీసం ముగింపును త్వరితం చేయగల సమర్థత, సాన్నిహిత్యం మన ఏలికలకు ఉందని విశ్వసిద్దాం.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్

టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్

Updated Date - Mar 12 , 2026 | 01:03 AM