Share News

India Germany Relations: కలిసివచ్చిన జర్మనీ

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:53 AM

జర్మన్‌ చాన్సెలర్‌ ఫ్రీడ్రిక్‌ మర్ట్స్ రెండురోజుల పర్యటనతో కొత్త ఏడాదిలో యూరోపియన్‌ నేతల వరుస రాకపోకలు మొదలైనట్టే. ఈనెలాఖరులో జరగబోయే ఈయూ–ఇండియా శిఖరాగ్ర సదస్సు...

India Germany Relations: కలిసివచ్చిన జర్మనీ

జర్మన్‌ చాన్సెలర్‌ ఫ్రీడ్రిక్‌ మర్ట్స్ రెండురోజుల పర్యటనతో కొత్త ఏడాదిలో యూరోపియన్‌ నేతల వరుస రాకపోకలు మొదలైనట్టే. ఈనెలాఖరులో జరగబోయే ఈయూ–ఇండియా శిఖరాగ్ర సదస్సు కోసం వస్తున్న ఈయూ కౌన్సిల్‌, కమిషన్‌ అధ్యక్షులు భారత గణతంత్రదినోత్సవ వేడుకల్లోనూ పాల్గొంటారు. ఫిబ్రవరిలో జరిగే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సదస్సులో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ది కీలకపాత్ర. ట్రంప్‌ చర్యలూ చేష్టలతో ఇబ్బందులు పడుతున్న భారత్‌కు ఈయూతో సాన్నిహిత్యం ఉత్సాహంతో పాటు, ఉపకారాలూ చేస్తుంది.

ఉక్రెయిన్‌ యుద్ధం సహా చాలా విషయాల్లో జర్మనీతో భారతదేశానికి విభేదాలు ఉన్నాయి. కానీ, ట్రంప్‌ మహాశయుడు అస్మదీయులు, తస్మదీయులన్న తేడా లేకుండా అందరినీ ఏదో విధంగా వేధించుకుతింటున్న తరుణంలో యూరప్‌ దేశాలు కొత్త స్నేహాలతో పాటు, ఇప్పటికే ఉన్నవాటిని బలోపేతం చేసుకొనే పనిలో పడ్డాయి. జర్మన్‌ చాన్సెలర్‌ తన పర్యటనలో ఉభయదేశాల సాన్నిహిత్యం అత్యున్నత స్థాయిలో ఉండబోతున్నదని స్పష్టంచేశారు. ఈయూలో భారత్‌ అతిపెద్ద వాణిజ్యభాగస్వామి అయిన జర్మనీతో ఇప్పుడు కుదిరిన ఒప్పందాలు ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఉన్నాయి. భారతీయులకు వీసా ఫ్రీ ట్రాన్సిట్‌ సదుపాయం కల్పించడం జర్మన్‌ అధినేత పర్యటనలో కీలకమైన నిర్ణయం. ఇది ప్రయాణాలను సులభతరం చేయడంతో పాటు, ప్రజలమధ్య సాన్నిహిత్యానికి పెంచేందుకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న చర్య. విద్యారంగంలో సంయుక్తంగా కోర్సులు, యూనివర్సిటీల మధ్య విస్తృతసహకారం, క్యాంపస్‌ల ఏర్పాటు సహా ఉభయదేశాలు ఇచ్చిపుచ్చుకోగలిగే పలురకాల అవకాశాల గురించి దేశాధినేతలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. వివిధ ఉత్పత్తుల తయారీతో మేకిన్‌ ఇండియాను బలోపేతం చేయడం కూడా జర్మనీ నిర్ణయాల్లో ఒకటి. భారత్‌–జర్మనీ మధ్య కుదిరిన అవగాహనలు, ఒప్పందాలు మనకు చాలా రంగాల్లో వృద్ధికి వీలుకల్పిస్తాయి. ఎప్పుడో కుదిరిన సబ్‌మెరైన్ల సరఫరా వంటివి ఇంకా కొన్ని ఒత్తిళ్ళ నేపథ్యంలో, ఆచరణకు దూరంగా ఉండిపోయినప్పటికీ, నైపుణ్యంగల కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి జర్మనీ సిద్ధపడటం బాగుంది. ఆరోగ్యరంగంలో సహకారం సాంకేతికతతో పాటు ఉపాధినీ పెంచుతుంది. రక్షణరంగంలో ఇచ్చిపుచ్చుకోవడాలు భారతీయ కంపెనీలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని అంటున్నారు. పారిశ్రామికంగా దక్కబోయే సహకారం మనకు సాంకేతికతనూ, సామర్థ్యాన్ని సమకూరుస్తుంది. సెమీ కండక్లర్లు, కీలక మినరల్స్‌, బయో ఎకానమీ వంటివి బలోపేతమవుతాయి.


వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికతల బదలాయింపు, గ్రీన్‌ ఎనర్జీ ఇత్యాది అంశాల్లో యూరప్‌ దేశాల సహకారం తోడైనప్పుడు అభివృద్ధిచెందిన ఆర్థికవ్యవస్థగా భారత్‌ అవతరించడం సుసాధ్యమవుతుంది. యూరప్‌లో అతిపెద్ద ఆర్థికశక్తిగా జర్మనీ నిర్వహించే పాత్ర ఇందులో ప్రధానమైనది. ఈయూతో మనం జరుపుతున్న మొత్తం వాణిజ్యంలో నాలుగోవంతు ఈ దేశంతోనే సాగుతోంది. అయితే, ఈయూ ఆవల ఈ దేశం సాగిస్తున్న వాణిజ్యం అమెరికా, చైనాల్లోనే అధికంగా సాగుతోంది. పెట్టుబడులు కూడా అది ఈ దేశాల్లోనే అధికంగా పెడుతోంది. అయితే, ఒక వాణిజ్యభాగస్వామిగా చైనా మీద ఎక్కువగా ఆధారపడటం సరికాదన్న ఆలోచనతో జర్మనీ ఇప్పుడు కొత్త విస్తరణ ప్రయత్నాలతో కదులుతోంది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా కూడా నమ్మదగ్గది కాకుండా పోతున్నది. ఈ నేపథ్యంలో విస్తృతమైన మార్కెట్‌ అవకాశాలు ఉన్న భారత్‌తో బంధం జర్మనీకి అత్యవసరం.

ఇండియా–ఈయూ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఉభయదేశాల నాయకులు అపరిమితంగా శ్లాఘిస్తూ ఈనెలాఖరులో జరగబోయే శిఖరాగ్రసదస్సులో ఖరారుచేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికాతో ఇదే తరహా ఒప్పందం ఎడతెగని చర్చోపచర్చలతో ఇంకా కొలిక్కిరాని నేపథ్యంలో, ఈయూతో మనం చేయీచేయీ కలిపి సాగడం మనకు ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ ఇస్తుంది. తన తొలి ఆసియా పర్యటనలో భారత్‌ను ఎంపికచేసుకొని జర్మనీ అధినేత ఇచ్చిన ప్రాధాన్యం ప్రశంసనీయమైనది. ఇప్పుడు జర్మనీ, రాబోయే రోజుల్లో మొత్తంగా ఈయూ చాలా రంగాల్లో తోడు నిలవబోతున్నాయి. ట్రంప్‌ ఎవరినైతే రావద్దంటున్నాడో, వేటినైతే కాదంటున్నాడో ఆ లోటుపాట్లను భర్తీ చేసేందుకు ఇండియా–ఈయూ సాన్నిహిత్యం ఉపకరిస్తుంది.

ఇవీ చదవండి

ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్

జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

Updated Date - Jan 15 , 2026 | 12:53 AM